-ఇక్కడ పన్నులేసేది సీమ అధికారే!
-వాణిజ్యపన్నుల శాఖలో ఇష్టారాజ్యం
-రూ.239 కోట్ల పన్ను కట్ చేస్తే రూ.33 కోట్లే!
-ఆయన పేరెత్తితే బెంబేలెత్తుతున్న వ్యాపారులు
-మంటగలుస్తున్న హైదరాబాద్ ప్రతిష్ఠ
సీమాంధ్ర పాలనలో స్కామ్ క్యాపిటల్‌గా మారిన హైదరాబాద్‌ను స్మార్ట్ క్యాపిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ తరుణంలో ఇక్కడ తిష్ఠవేసిన కొందరు సీమాంధ్ర అధికారుల కారణంగా ఆ ప్రతిష్ఠ మసకబారుతున్నది. అస్మదీయ పాలనలో ఇష్టారాజ్యంగా సాగించిన అవినీతినే వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నగరంలో వాణిజ్యపన్నుల అధికారి సాగిస్తున్న అవినీతి బాగోతమే. ఇవాళ ఆ అధికారి పేరు చెప్తే చాలు.. హైదరాబాద్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవారు హడలెత్తుతున్నారు. -వాణిజ్యపన్నుల శాఖలో ఇష్టారాజ్యం
-రూ.239 కోట్ల పన్ను కట్ చేస్తే రూ.33 కోట్లే!
-ఆయన పేరెత్తితే బెంబేలెత్తుతున్న వ్యాపారులు
-మంటగలుస్తున్న హైదరాబాద్ ప్రతిష్ఠ

భారీస్థాయిలో పన్నులను వడ్డించి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఆయన బేరసారాల పర్వం ప్రారంభమవుతుంది. ఆనవాయితీ ప్రకారం రేట్ ఆఫ్ ట్యాక్స్ నుంచి సరుకులు కొనుగోలు చేసే సమయంలో చెల్లించే వ్యాట్, లేబర్ చార్జీలను పన్నునుంచి మినహాయించి ఇన్‌ఫుట్ ట్యాక్స్‌ను వేయాల్సి ఉంటుంది. దాదాపు 30% లేబర్ ఖర్చు, 30% ముడిసరుకుల కొనుగోలుపై చెల్లించిన వ్యాట్ ట్యాక్స్‌ను తీసేసి మిగిలిన మొత్తం మీద పన్ను వేయాలి. కానీ సదరు అధికారి మొదట అన్నీ కలిపి పన్నులను వడ్డించి ఆ తర్వాత కుదిరే బేరాన్ని బట్టి ఎంత తగ్గించాలనేది నిర్ణయిస్తారని సమాచారం.
అనుకూలంగా స్పందించని వారిని ముప్పు తిప్పలు పెడతారన్న ఆరోపణలు ఉన్నాయి. జంబ్లింగ్ ఆడిట్‌లో తన వద్దకు వచ్చే ఆయా సంస్థల, కాంట్రాక్టర్ల, వాణిజ్య సముదాయాలకు నివేదికలను చూసి తన చేతివాటం ప్రదర్శిస్తారని ఆయన బాధితులు వాపోతున్నారు.
ప్రతి ఏడాది జూన్‌లో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వార్షిక పన్ను మదింపుకోసం తమ వద్దకు వచ్చే ఆడిట్ నివేదికలను పరిశీలిస్తారు. ఒక సర్కిల్‌లోని ఆడిట్ నివేదికలను మరో సర్కిల్ అధికారులు జంబ్లింగ్ పద్ధతిలో పరిశీలించి అసలు చెల్లించాల్సిన పన్ను ఎంతో నిర్ధారిస్తారు. ఇదే అవకాశంగా ఆయన వందశాతం వ్యాపారంపై పన్ను కట్టమంటారు. కార్మికుల ఖర్చులు, సరుకుల కొనుగోలుపై చెల్లించిన వ్యాట్‌ను తగ్గించిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను వేయాలి కదా అని వాదించినా ప్రయోజనం ఉండదు. ఏమి చేసుకుంటారో చేసుకోండని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కాదంటే అప్పీలుకు వెళ్లాలంటారు.
అప్పీల్‌కు వెళ్లాలంటే మొత్తం పన్నుపై 15శాతం సదరు సంస్థ లేదా వ్యాపారి సేల్స్ టాక్స్ అప్పిలేట్ అధారిటీ వద్ద జమచేయాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం డిపాజిట్ చేసి కోర్టు చుట్టూ తిరగడానికి చాలా మంది వెనుకాడుతారు. కోర్టులు, డిపాజిట్లు ఎందుకని రాజీ కొస్తే పద్ధతి మారిపోతుంది. వారి కోసం నిబంధనలను పక్కకు పోతాయి. పన్నును భారీగా తగ్గించి తగ్గించిన మొత్తంలో సగం పైవాళ్లకు అంటూ తీసేసుకుంటారు. గత సంవత్సరం 11 సంస్థలు, ఫ్యాక్టరీలకు 239 కోట్ల రూపాయల మేరకు తుది పన్నును నిర్ధారించిన సదరు అధికారి, తర్వాత ఎకాఎకిన పన్ను ఆ మొత్తాన్ని 205 కోట్లు తగ్గించి కేవలం రూ.33కోట్లు మాత్రమే వడ్డించడం అనేకమంది కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.
దీనిపై కొన్ని ఫిర్యాదులు ఉన్నతాధికారులకు కూడా వెళ్లాయి. అయితే ఉన్నత స్థాయిలో ఆయనకు అండదండలు లభిస్తున్నాయని చెబుతున్నారు. వివిధ కేసుల్లో 1000 నుంచి 1500 కోట్లరూపాయల మేరకు ఆయన తన చేతి వాటం ప్రదర్శించినట్లు బలమైన ఆరోపణలున్నాయి. ఈ అధికారి అవినీతి శృతిమించి హైదరాబాద్ ప్రతిష్ట మంటగలిసేలా ఉందని వ్యాపారులు వాపోతున్నారు. అవినీతి అధికారిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపి చర్య తీసుకోవాలని వారు కోరుతున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి