-హెరిటేజ్ బిల్డింగ్ మరమ్మతులకు యత్నం
అసెంబ్లీ వేదికగా ఆంధ్రోళ్ల ఆటలు ఇంకా కొనసాగిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన సంగతి మరిచి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తాత్కాలికంగా ఉంటున్నారన్న ధ్యాస కూడా లేకుండా హైదరాబాద్, అసెంబ్లీ మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో, శాసనమండలిలో అన్ని గదులను తమ వారికే కేటాయించుకున్న ఏపీ అసెంబ్లీ అధికారులు ఇప్పుడు మిగిలి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు.అసెంబ్లీలోని అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఉన్న జీ4ను అడ్డగోలుగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేటాయిస్తూ ఏపీ అసెంబ్లీ సెక్రెటరీ పేరుమీద ఉత్తర్వులు జారీచేశారు. ఈ భవనంలోని 307 రూమ్‌ను ఏపీ ప్రభుత్వ విప్ మల్లికార్జునరెడ్డికి కేటాయించారు. వాస్తవానికి గవర్నర్ సూచనల మేరకు గదుల కేటాయింపు జరగాలి. కానీ అదేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఏపీ అసెంబ్లీ అధికారులు రూమ్‌లను కేటాయిస్తున్నారు. దీనికి నిరసనగా తెలంగాణ అసెంబ్లీ అధికారులు అవే గదుల్లో తెలంగాణ పార్టీలకు, నేతలకు రూమ్‌లు కేటాయించారు. కాగా, జగన్‌కు, మల్లికార్జునరెడ్డికి కేటాయించిన రూమ్‌లను మరమ్మతులు చేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ సెక్రెటరీ సత్యనారాయణరావు ఆదేశించారు. ఆదివారం ఉదయం స్పీకర్ కోడెల చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలోని అడ్మినిస్ట్రేటీవ్ భవనంలో కొన్ని పనులు ప్రారంభించినట్లు తెలిసింది.
చారిత్రక భవనంలో మరమ్మతులా?
అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న పాత అసెంబ్లీ భవనం, అడ్మినిస్ట్రేటివ్ భవనాలను చారిత్రక ప్రాధాన్యమున్న భవనాలు (హెరిటేజ్ బిల్డింగ్స్)గా గుర్తించారు. ఇలా గుర్తించిన భవనాలకు ఎలాంటి మరమ్మతులు చేయడానికి వీల్లేదు. కానీ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆంధ్రోళ్లు మరమ్మతులకు ఆదేశాలు ఇవ్వడంపై తెలంగాణ అధికారులు భగ్గుమంటున్నారు. గవర్నర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అసెంబ్లీలోని కొత్త అసెంబ్లీ తెలంగాణకు, పాత అసెంబ్లీని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆ మేరకు సభా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని ఎవరికీ కేటాయించలేదు. ప్రస్తుతం ఇందులో రెండు రాష్ట్రాలకు చెందిన ఫైళ్ల విభజన జరుగుతున్నది. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు ఈ భవనాన్ని జగన్‌కు కేటాయించడం, పైగా ఆయన చాంబర్‌లో మరమ్మతులు చేయాలని ఆదేశించడంపై తెలంగాణ అధికారులు మండిపడుతున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి