గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 23, 2014

కరెంట్‌ కట్ చేస్తే..కబ్జాకోర్లు ఫట్!

-కరెంటు కనెక్షనే కబ్జాకు పెట్టుబడి
-అక్రమ నిర్మాణాలకు బీజం పడేదిక్కడే
-దాని ఆధారంగానే ఇతర పత్రాల సృష్టి
-కండ్లు మూసుకుని కనెక్షన్లు ఇస్తున్న విద్యుత్ శాఖ
గ్రేటర్ హైదరాబాద్‌లో విచ్చలవిడి కబ్జాలకు ఊతమిస్తున్న పరిస్థితులేమిటి? కబ్జా స్థలాల్లో వెలిసిన నిర్మాణాలకు అనుమతులు ఎలా లభిస్తున్నాయి? ఆ ఇండ్లకు నంబర్లు ఎలా కేటాయిస్తున్నారు? వీటికి విద్యుత్, నీటి కనెక్షన్లు ఎలా దొరుకుతున్నాయి? అవి చూపించి రేషన్ కార్డులు, పాస్‌పోర్టులు కూడా ఎలా పొందగలుగుతున్నారు? ఎక్కడుంది లోపం? ఇవన్నీ ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు. అనేకసార్లు న్యాయస్థానాల్లో కబ్జాదారులే తమకు విద్యుత్, నీటి కనెక్షన్ ఉండగా అక్రమమని ఎలా అంటారని కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కబ్జా భూముల్లో కట్టిన ఇండ్లు కొని మోసపోయిన వారూ ఇదే ప్రశ్న వేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా ప్రజలనుంచి ఇదే ప్రశ్న ఎదురవుతున్నది. దీనికి సమాధానం అధికారుల దగ్గర లభ్యం కావడం లేదు. కారణం ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోపాలు. కొన్ని ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం. నిజానికి కొద్దిపాటి చట్టాల మార్పు, అధికారుల అప్రమత్తతతో ఈ జాడ్యాన్ని మొగ్గలోనే తుంచవచ్చు. కబ్జాదారులు ఖాళీ స్థలం దొరికితే పాగా వేసేందుకు రాత్రికి రాత్రే గుడిసెలు వేస్తున్నారు. కొంతమేర స్థలాన్ని చదును చేసి ఫెన్సింగ్ వేస్తున్నారు. 
ఇక దానిమీద హక్కు పుట్టించుకునేందుకు మొదటి అడుగు కరెంటు ఆఫీసువైపు వేస్తున్నారు. తన గుడిసెకు కరెంటు కనెక్షన్ కావాలని దరఖాస్తు చేస్తున్నారు. మాయ చేసి కనెక్షన్ పొందితే ఇక పంట పండినట్టే. ఆ ఒక్క ఆధారంతో జలమండలినుంచి నీటి కనెక్షన్ వస్తుంది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీనుంచి ఇంటి నంబరు సులభంగా తీసుకుంటున్నారు. ఈలోగా అసలు యజమాని వస్తే విషయం కోర్టుకు వెళ్లి ఈ ఆధారాలు చూపుతున్నారు. న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి ఏండ్లు పట్టడం ఆసరాగా ఆక్రమణదారులు స్టేతో బహుళ అంతస్తుల భవనాలు కట్టేస్తున్నారు. మధ్యలో రెగ్యులరైజేషన్ అవకాశం వస్తే దర్జాగా పత్రాలు చేతికి వస్తాయి. ఇలాంటి సంఘటనలు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలలో లక్షల్లో జరుగుతున్నాయి. ఇందులో సహజంగానే అధికారుల పాత్ర సైతం ఉంటుంది. అది అవినీతి కావొచ్చు..నిర్లక్ష్యమూ కావొచ్చు.
విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తారు..

ఒక నివాస గృహానికి విద్యుత్ కనెక్షన్ కావాలంటే వినియోగదారుడు దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ యాక్ట్ ప్రకారం 1957 డబ్ల్యూఆర్(1), డబ్ల్యూఆర్ (2) ను ఇంప్లిమెంట్ చేస్తూ ప్రక్రియను చేపట్టాలి. ముందు డబ్ల్యూఆర్(1)యాక్ట్ ప్రకారం విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఆ స్థలం డాక్యుమెంటేషన్, ఐడీ ప్రూఫ్‌లు అందించాలి. సక్రమంగా ఉంటే ఆ స్థలంలో గుడిసెలు, షెడ్డులువంటి తాత్కాలిక నిర్మాణాలు ఉన్నట్టయితే వాటికి విద్యుత్ కనెక్షన్‌ను తాత్కాలిక పద్ధతిలో ఇవ్వాలి. దీన్ని మూడు నెలలకు ఒకసారి తొలగించాలి. తిరిగి దరఖాస్తు చేసుకుంటే మళ్లీ ఇవ్వాలి.

ఈ నిబంధనలు విద్యుత్ అధికారులు విస్మరిస్తున్నారు. వినియోగదారుడు ఆ స్థలంలో పెద్ద భవనాలు నిర్మించినప్పుడు డబ్ల్యూఆర్(2)యాక్ట్ ప్రకారం అందులోని గదులు, జీహెచ్‌ఎంసీ నిర్మాణ అనుమతి పత్రాలు, కావల్సిన విద్యుత్ లోడ్ వివరాల రిపోర్టు సమర్పించినపుడు ఆ భవనానికిలేదా పరిశ్రమలకు శాశ్వత పద్ధతిలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. స్థలాల అక్రమ కబ్జాలను అరికట్టడానికి ప్రభుత్వం ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే విద్యుత్, నల్లా కనెక్షన్లు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యుత్ అధికారులు స్వంత నోటరీతో లేదా కాలనీ కమిటీ సేల్ డీడ్‌లపై విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు.

ఆక్యుపేషన్ లేకున్నా...

ఆక్యుపేషన్ సర్టిఫికెట్ లేని వారు ఒక నోటరీని సమర్పించినా దాని ఆధారంగా విద్యుత్ కనెక్షన్లు విచ్చలవిడిగా ఇస్తున్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని అయ్యప్ప సొసైటీకి ఇదేరీతిలో భారీగా కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిసింది. ఎలాంటి అనుమతులు లేని ఈ ప్రాంత నిర్మాణాలకు ఏకంగా విద్యుత్ లైన్లు వేసి, కొత్త కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు బిగించి మరీ అక్రమంగా నిర్మించిన ఇళ్ళకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ఓవైపు అన్ని డాక్యుమెంట్లు ఉన్న వారు కనెక్షన్ల కోసం ఎంత తిరిగినా కనికరించని అధికారులు ఇలాంటి భారీ వెంచర్లకు ఉరకలు పరుగుల మీద కనెక్షన్లు ఎందుకు ఇస్తారో తెలియంది కాదు.

తప్పుడు ధృవీకరణ పత్రాలతో ...

ఇక అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నవారూ తక్కువ తినడం లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేక అధికారులు నిరాకరించిన సందర్భంలో నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. గత సంవత్సరం మూసాపేటలో ఒక ఇంటికి అప్పటికే మూడు కనెక్షన్లు ఉన్నా మరొకరు నకిలీ పత్రాలతో మీటర్‌కు దరఖాస్తు చేసుకోగానే కనెక్షన్ ఇచ్చారు. దీని ఆధారంగా ఆ ఇల్లు తనదేనని నకిలీ వ్యక్తి కోర్టుకెక్కి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి ఇంటిని కబ్జా చేయడానికి విఫల యత్నం చేశాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

కొత్త భాష్యం చెపుతున్న విద్యుత్ అధికారులు..

ఈ అక్రమ విద్యుత్ కనెక్షన్ల విషయంలో విద్యుత్ అధికారులు కొత్త కొత్త భాష్యాలు చెబుతున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తారని అడిగితే అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీదే తప్ప తమది కాదంటున్నారు. విద్యుత్‌ను అమ్ముకుని వ్యాపారం చేయడం తమ ధర్మమని వాదిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ వారు తప్పును తమపై తోయడానికి విద్యుత్ కనెక్షన్లతో రమ్మని వారే కబ్జాదారులకు సలహాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ శాఖ నిబంధనల ప్రకారం నోటరీ ఉన్నా కనెక్షన్ ఇవ్వవచ్చునని చెబుతున్నారు. నకిలీపత్రాలు పరిశీలించి నిర్ధారించే యంత్రాంగం తమకు లేదని వారంటున్నారు.

ప్రభుత్వమే జీవో ఇచ్చింది..

లింక్ డాక్యుమెంట్ లేకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదు. రిజిస్ట్రేషన్, జీహెచ్‌ఎంసీ నుంచి పొందిన పన్ను రశీదు, నోటరీ వంటి ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అది లీగలా? ఇల్లీగలా అనేది కోర్టు చూస్తుంది. మాకు సంబంధం లేదు. కబ్జాలలో నిర్మాణాలను నిరోధించాల్సింది జీహెచ్‌ఎంసీవారే. గుడిసెలేసినా వారు పన్ను రశీదు ఇస్తున్నారు. దాని ఆధారంగా మేం కనెక్షన్ ఇస్తున్నాం. నోటరీ ఉన్నా సరే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని నిబంధన ఉంది. కబ్జాలతో మాకు సంబంధం ఉండదు. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌కు,డ్యాక్యుమెంట్‌కు సంబంధం లేదు. ఆక్యుఫేషన్ సర్టిఫికెట్ లేకపోయినా విద్యుత్ కనెక్షన్ ఇవ్వొచ్చు. కానీ ముందే మూడు రెట్లు బిల్లు చెల్లిస్తామనే కండిషన్‌పై ఇస్తాం. ప్రభుత్వమే ఈ మేరకు జీవో ఇచ్చింది.


తప్పుడు పత్రాలతోనే ...

గ్రేటర్ హైదరాబాద్‌లో భూముల విలువ పెరిగిన తర్వాత తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే ఖాళీ స్థలంలో గుడిసె వేసినా దానికి ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ యాక్ట్ 1957 డబ్ల్యూఆర్(1) ప్రకారం మూడు నెలలకు సరిపడా బిల్లును ముందే వసూలు చేసి తాత్కాలిక పద్ధతిన తాత్కాలిక నెంబర్‌తో కనెక్షన్ ఇవ్వాలి. మూడు నెలలు కాగానే దానిని తొలగించి తిరిగి కొత్త దరఖాస్తుపై ఇవ్వాలి. ప్రస్తుతం ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. ముందే పర్మినెంట్ నెంబర్ ఇవ్వడంతో అక్రమాలకు అస్కారం ఏర్పడుతుంది. దొంగ సర్టిఫికేట్లతో కబ్జాదారులు విద్యుత్ కనెక్షన్ పొంది నిర్మాణాలు చేస్తున్నారు. వాటిని అరికట్టాల్సింది జీహెచ్‌ఎంసీదే తప్ప విద్యుత్ శాఖ కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి