-చాపర్ డీల్ స్కాం కేసులో గవర్నర్‌వైపు సీబీఐ చూపు
-నేడు ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్న దర్యాప్తు సంస్థ!
-ఇదే కేసులో బెంగాల్, గోవా గవర్నర్లు రాజీనామా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌ను వీడక తప్పదా..? పదవినుంచి దిగిపోవాలని మోడీ ప్రభుత్వం ఆదేశిస్తుందా..? అగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ డీల్ స్కాం కేసు పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. రూ.3600కోట్లతో వీవీఐపీలు ప్రయాణించేందుకు అనువైన 12 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గవర్నర్ నరసింహన్‌ను బుధవారం ప్రశ్నించాలని భావిస్తున్నదని సమాచారం. ఇదివరకే ఈ కేసులో పశ్చిమబెంగాల్, గోవా గవర్నర్లు ఎంకే నారాయణన్, బీవీ వాంఛూలను దర్యాప్తు సంస్థ విచారించింది. ఆ తర్వాత వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అగస్టా హెలికాప్టర్లలో కీలకమైన సాంకేతిక మార్పులకు 2005, మార్చిలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనుమతి ఇచ్చింది. టెండర్‌లో పేర్కొన్న అర్హతలకన్నా తక్కువ సాంకేతిక పరిజ్ఞానానికి ఆ సమావేశం ఆమోదం తెలిపింది.-నేడు ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్న దర్యాప్తు సంస్థ!
-ఇదే కేసులో బెంగాల్, గోవా గవర్నర్లు రాజీనామా..

నరసింహన్ను ప్రశ్నిస్తే.. కీలకమైన విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. సీబీఐ ప్రశ్నించిన తర్వాత నరసింహన్ పదవిలో కొనసాగుతారా..? లేక సహచరుల వలె రాజీనామా బాట ఎంచుకుంటారా..? ఇప్పటికే యూపీఏ పాలనలో నియమితులైన గవర్నర్లు పదవులు వీడాలని ఆదేశాలు జారీ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం.. నరసింహన్ విషయంలో ఏ వైఖరి అవలంబిస్తుంది..? అన్నది వేచి చూడాల్సిందే. కాగా, ఈ కేసులో భారత వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన సమీప బంధువులు, యూరప్‌కు చెందిన ఓ దళారితోపాటు 13మందిని నిందితులుగా సీబీఐ చేర్చింది. గరిష్ఠ ఎత్తు తగ్గించేందుకు వైమానిక దళ చీఫ్‌గా త్యాగి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తున్నది. ఈ క్రమంలో హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దర్యాప్తు సంస్థ సేకరిస్తున్నది. ఈక్రమంలోనే కేసుకు సంబంధమున్నదని భావిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి