గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 26, 2014

తుదిశ్వాస వరకూ హైదరాబాదీనే!

-భారతీయురాలినని ఇంకెలా నిరూపించుకోమంటారు?
-మహిళనైనందుకే నాపై విమర్శలా?
-మరే దేశంలోనైనా ఇలా జరుగుతున్నదా?
దేశ, విదేశాల్లో లెక్కకుమిక్కిలి విజయాలు, ప్రశంసలు, అవార్డులతో భారత మహిళా టెన్నిస్‌కు చిరునామాగా ఉన్న సానియా మీర్జా కొన్నాళ్లుగా తన స్థానికతపై రాద్ధాంతం చేస్తున్న కుహనా జాతీయవాదులకు కన్నీళ్లతో అడుగుతున్న ప్రశ్న ఇది! తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా
ఎంపికైంది మొదలు పసలేని విమర్శలతో నానాయాగీ చేస్తున్న తీరు ఈ హైదరాబాదీ స్టార్‌ను ఎంత బాధించిందోగానీ, ఎట్టకేలకు పెదవి విప్పిన సానియా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. తన దేశభక్తిని శంకించొద్దని, తుదిశ్వాస వరకూ హైదరాబాదీనని గర్వంగా చెప్పుకుంటానంటూ శుక్రవారం ఎన్డీటీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కన్నీళ్లపర్యంతమైంది. 

sania-mirza2
తన స్థానికతను వివాదం చేయడంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా తన నియామకంపై రాజకీయ దుమారం రేగడంపై తీవ్రంగా కలత చెందినట్లు ఎన్డీటీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సానియా వాపోయింది. మహిళనైనందుకే తనపై ఇన్ని విమర్శలు చేస్తున్నారనీ, మరే దేశంలోనైనా ఇలా జరుగుతుందా అని ప్రశ్నించింది. ఎన్నో విజయాలు సాధించి దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాననీ, తన భారతీయతను ఇంకెన్నిసార్లు నిరూపించుకోవాలని సానియా కన్నీళ్లు పెట్టుకుంది.

ఇంటర్వ్యూలో సానియా చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..
-ఈ వివాదం నన్ను చాలా బాధిస్తోంది. నా భారతీయతను శంకించడం సరికాదు. నా స్థానికతపై ఇంత రచ్చ చేయడంవల్ల వారికేం ప్రయోజనమో అర్థంకావడం లేదు.

-చాలా ఏళ్లుగా నా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. టెన్నిస్‌లో చాలా విజయాలు అందుకున్నాను. ఆటలో నా ప్రతిభద్వారా దేశానికి ఎంతో గౌరవప్రతిష్టలు తీసుకొచ్చాను. పెళ్లయ్యాక కూడా భారత్ కోసమే ఆడి ఎన్నో పతకాలు సాధించాను. ఇక నా భారతీయతను ఎలా నిరూపించుకోవాలి?

-మరే దేశంలోనూ ఇలా జరగదేమో? మనం పురుషాధిక్య సమాజంలో ఉన్నాం. నేను మహిళను..అందులోనూ వేరే దేశం వ్యక్తిని పెళ్లాడినందుకే ఇలా నాపై నిందలు వేస్తున్నారు. 

-నన్ను బయటివ్యక్తిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను పక్కా హైదరాబాదీని. వందేళ్లకు పైగా నా కుటుంబం భాగ్యనగరంలోనే నివసిస్తోంది. నా మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నా చివరిశ్వాస వరకు హైదరాబాదీగానే, భారతీయురాలిగానే జీవిస్తాను. 

-నా కుటుంబానికి ఎప్పుడు కూడా మతం, కులం పట్టింపులు లేవు. అందుకే నా భర్త ఎక్కడినుంచి వచ్చాడన్నది వాళ్లెప్పుడూ ఆలోచించలేదు. షోయబ్‌ను తొలిసారి కలిసినప్పుడు కూడా అతనిది పాకిస్థానా లేదంటే మరే దేశమా అన్నది నా మదిలోకి కూడా రాలేదు. కానీ వీళ్లెందుకు ఇవన్నీ పట్టించుకుంటున్నారో తెలియడం లేదు. నేను దేశభక్తి మెండుగా ఉన్నదాణ్ని. అందుకే ఇంత భావోద్వేగానికి గురవుతున్నాను. 

-ఇకనుంచి ఎవరేమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోను. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదా అన్నది నాకు దక్కిన అరుదైన గౌరవం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్ నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయను. రాష్ట్ర ప్రతినిధిగా గౌరవాన్ని నిలబెడతా.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి