గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 30, 2015

సీనియారిటీ జాబితా తారుమారు...!!!

 


-సచివాలయ ఏఎస్‌ఓల పదోన్నతుల్లో ఏపీ ఏకపక్ష ధోరణి
-తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానేసీనియారిటీ జాబితా తయారీ
-మండిపడుతున్న తెలంగాణ ఉద్యోగులు
-తిప్పిపంపాలని ప్రభుత్వ సీఎస్‌కు వినతి

ఉమ్మడి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏపీ సర్కారు యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నది. ఆస్తుల పంపిణీలోనే కాదు.. ఉద్యోగుల విభజన, పదోన్నతుల్లోనూ అవరోధాలను కల్పిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం లేకుండానే సచివాలయ ఏఎస్‌ఓల సీనియారిటీ జాబితాను విడుదల చేసి తాజాగా మరోసారి తన ఆధిపత్య దురంహంకారాన్ని ప్రదర్శించింది. 2014 జూన్ ఒకటో తేదీ నాటి సీనియారిటీ జాబితా ప్రాతిపదికనే ఉద్యోగుల పంపిణీ జరగాలి. కానీ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా కొత్త సీనియారిటీ జాబితాను విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగుల్లోనూ డైరెక్ట్ రిక్రూటీలు, ప్రమోటీల మధ్య సీనియారిటీ విషయంలో గొడవలు ఉన్నాయి. 


1990-92 మధ్య కాలంలో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్‌గా ఎంపికైన వారు 1998-2001 మధ్య ఏఎస్‌ఓలుగా పదోన్నతులు పొందారు. వారికీ.. 2002లో నేరుగా ఏఎస్‌ఓలుగా ఎంపికైన ఉద్యోగులకు సీనియారిటీ అంశంలో 2010 నుంచి తగాదా నడుస్తున్నది. సమస్య కోర్టుల దాకా వెళ్లింది. దీనిపై ప్రభుత్వం 19-3-1998 నుంచి 19-10-2001 మధ్య నియమితులైన 151 మంది ఏఎస్‌ఓల సీనియారిటీ లిస్టును (జీఓ ఎంఎస్ నం.347-జీఏ,ఎస్‌యు-2 ద్వారా) 2010 జూన్ 28న నోటిఫై చేసింది. అందులో 2002లో నేరుగా నియామకమైన ఏఎస్‌ఓల కంటే 27 మంది ప్రమోటీ ఏఎస్‌ఓలను పుష్ డౌన్ చేసినట్లు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 


దీంతో విభేదించిన డైరెక్ట్ రిక్రూటీ ఏఎస్‌ఓలు కేసు వేయగా 1992 నుంచి ఏర్పడ్డ ఖాళీలను లెక్కించాలని ఏపీఏటీ తీర్పునిచ్చింది. ఈ తీర్పును ప్రమోటీ ఏఎస్‌ఓలు హైకోర్టులో చాలెంజ్ చేశారు. 2012 ఫిబ్రవరి 22న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఏపీఏటీ ఆర్డర్‌ను సస్పెండ్ చేయడాన్ని నిరాకరించింది. ఏపీఏటీ ఆర్డర్ ప్రకారం సీనియారిటీ లిస్టును తయారుచేసి రెండు నెలల్లో సమర్పించాలని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఆఫీసర్ కమిటీ రిపోర్టు ఆధారంగా సీనియారిటీ లిస్టును తయారు చేసి ప్రభుత్వం (2013 జూలై 19 తేదీ, మెమో 2636/ఎస్‌యూ-2/2012-9) హైకోర్టుకు సమర్పించింది. 


ఈ మెమోను కొందరు అవినీతి అధికారులు హైకోర్టు నుంచి తిరిగి తీసుకొచ్చినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత సీరియారిటీ లిస్టును రివైజ్ చేయడానికి నోట్ ఆర్డర్ పాస్ చేయడంతో, డైరెక్ట్ రిక్రూట్ ఏఎస్‌ఓలు తమ సీనియారిటీ లిస్టును ఇంకా హైకోర్టు ముందు ప్రభుత్వం సమర్పించలేదని కంటెప్ట్ వేశారు. దాన్ని తప్పించుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద రివైజ్డ్ సీనియారిటీ లిస్టును తయారు చేసి మెమో నం.2636/ఎస్‌ఓ.5/ఏ1/12-11, తేదీ.15.7.2015ను రూపొందించింది. 


15 రోజుల్లో అభ్యంతరాలను తెలపాలంటూ ఏపీ, తెలంగాణలో పనిచేస్త్తున్న ఏఎస్‌ఓలకు సర్వ్ చేయాలని ఆదేశించింది. 27 మంది ఏఎస్‌ఓలను పుష్‌డౌన్ చేయడంతో పాటు మరో 200 మంది సీనియారిటీని కుదించింది. ఏపీ వైఖరి వల్ల తెలంగాణ ఉద్యోగులే అధికంగా నష్టపోయే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతి పత్రం సమర్పించారు. ఏపీ ఇచ్చిన జాబితాను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దని, తిప్పి పంపాలని కోరారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి