గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 28, 2015

అబ్దుల్ కలాంకు అశ్రు నివాళి..


అబ్దుల్‌కలాం తమిళనాడులోని రామేశ్వరంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో అనేక కష్టాలను అనుభవించి ఉన్నత చదువులు చదివారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా సాగిన కలాం ప్రస్థానంలో ఆయన దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివి. శాస్త్రవేత్తగా కెరీర్ ప్రారంభించిన కలాం దేశం గర్వించదగిన స్థాయికి చేరుకున్నారు. అరవయ్యో దశకంలో డీఆర్‌డీఓలో శాస్త్రవేత్తగా ఆయన దేశానికి అనేక విజయాలు అందించారు.

భారతదేశపు  పదకొండవ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆకస్మిక మరణంతో భారత శాస్త్ర, సాంకేతిక రంగం మార్గదర్శకున్ని, పెద్దదిక్కును కోల్పోయింది. కలాం శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి అంతా ప్రజల కోసమేనని చాటి చెప్పారు. సైన్సును ప్రజల కోసం వినియోగించడంలో అగ్రభాగాన నిలిచారు. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజల ముందు తలవంచి నిలిచేలా చేసిన కలాం తనదైన ప్రజానుకూల దృక్పథంతో అసాధ్యాలను సుసాధ్యం చేశారు. భారత అణ్వస్త్ర పితామహుడిగా, క్షిపణి రంగ రూపశిల్పిగా దేశానికి సేవలందించి భారత కీర్తిపతాకను విశ్వ వినువీధిలో సమున్నతంగా నిలిపారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన కలాం పీఎస్‌ఎల్ వీ, ఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కలలు కనండి వాటి సాకారం కోసం కష్టపడండి అన్న ఆయన మాటలు కోట్లాదిమంది యువతకు ఆదర్శం. భారత అణుశాస్త్ర పితామహుడిగా రక్షణ రంగంలో కలాం చేసిన కృషి మన దేశ ప్రతిష్ఠను ప్రపంచపటంలో నిలబెట్టాయి. దేశంలో ఆయన స్ఫూర్తితోనే అనేకమంది అంతరిక్ష శాస్త్రవేత్తలు వచ్చారంటే అతిశయోక్తి కాదు.

ఆధునిక టెక్నాలజీతో అమెరికా, రష్యా లాంటి దేశాలు అందనంత ముందుకు దూసుకుపోతున్న సమయంలో అంతరిక్ష నౌకలకు రూపకల్పన చేసి విజయవంతంగా ప్రయోగించారు. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ తదితర క్షిపణులు కలాం కృషితో భార త అమ్ములపొదిలోకి చేరాయి. కలాం అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణులకు రూపకల్పన చేయడం విశేషం. 1998 పోఖ్రాన్-2 అణు పరీక్షలో కీలకమైన సంస్థాగత, సాంకేతిక పాత్ర పోషించారు. అలాగే శాస్త్రసాంకేతిక రంగాలు ప్రజల జీవనంలో సమూల మార్పుకు, జీవన ప్రమాణాలు వృద్ధి చెందేందుకు కృషిచేయాలని చెప్పడమే కాదు, ఆచరణలో నిజం చేసిన ఆయన, ప్రజల జీవనంలో మౌలిక మార్పుకోసం కృషి చేశారు. నగర ప్రజలకు అందుబాటులో ఉన్న సాంకేతికతను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని అప్పుడే నిజమైన అభివృద్ధి మార్పు సంభవిస్తుందని చెప్పి ప్రొవిసన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ టుం రూరల్ ఏరియాస్ (పురా)కు రూపకల్పన చేశారు.

శాస్త్రవేత్తగా అబ్దుల్‌కలాం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. అంతేకాదు ఆయనను ఈ దేశ పదకొండవ రాష్ట్రపతిగా ఎంచుకుని సమున్నతంగా గౌరవించింది. దానికనుగుణంగానే ఆయన ఒక సంక్లిష్ట సమయంలో రాష్ట్రపతి పదవి చేపట్టి భారత ప్రథమ పౌరుని కర్తవ్యాలను నెరవేర్చారు. ప్రజల రాష్ట్రపతిగా ఆయన పేరు గడించారు. అత్యున్నత స్థానంలో ఉన్నా పిల్లలకు దగ్గరైన వ్యక్తుల్లో నెహ్రూ తర్వాత స్థానాన్ని కలాం దక్కించుకున్నారు. ఆయన చివరి శ్వాస వరకు పిల్లలతోనే ఉన్నారు. కలాం తన జీవిత కథను వింగ్స్ ఆఫ్ ఫైర్‌గా వెలువరించారు. ఇంగ్లీషులో ముద్రించిన ఈ పుస్తకాన్ని తర్వాత పదమూడు భాషల్లోకి అనువదించారు. బ్రెయిలీ లిపిలో కూడా ఈ పుస్తకం ముద్రితమవడం విశేషం.
క్షిపణి శాస్త్ర విజ్ఞానాన్ని.., వైద్యశాస్ర్తానికి జోడించి సేవలందించాలని కలాం కలలు కనేవాడు.

ఆ కలలకు అనుగుణంగా ఆయన హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో పనిచేస్తున్నప్పుడు ప్రఖ్యాత కార్డియాలజిస్టు సోమరాజుతో కలిసి తన ఆలోచనలను పంచుకున్నాడు. వీరివురి కృషి, ఆలోచనల్లోంచే గుండె సంబంధ రోగాలనుంచి కాపాడే స్టెంట్ తయారీకి అంకురార్పణ జరిగింది. ఈ ఆలోచనామృతంలోంచే.. కలాం-రాజు స్టెంట్ తయారై ఇవ్వాళ వేలాది మందికి శ్వాసను నిలుపుతున్నది. క్షిపణి శాస్త్ర విజ్ఞానాన్ని వైద్యశాస్త్రంతో జోడించి ప్రజలకు సేవలందించాలన్న ఆయన కలల లోంచి ఉద్భవించిన కలాం- రాజు స్టెంట్ ఎందరినో హృద్రోగం నుంచి కాపాడితే.. అదే గుండెపోటుతో కలాం తుదిశ్వాస విడవటం విషాదం. అత్యున్నత రాష్ట్రపతి పదవిని ప్రజల ముంగిట నిలిపి ప్రజలందరికీ ప్రేమను పంచిన అబ్దుల్ కలాం అమరుడు.


అబ్దుల్ కలాం మాట..

-యువతకు ముఖ్యంగా నేనిచ్చే సందేశం ఏంటంటే.. భిన్నంగా ఆలోచించే సాహసం చేయండి. ఆవిష్కరణల్లో సాహసం చూపండి. ఎవరూ వెళ్లని దారిలో వెళ్లండి. అసాధ్యమనుకొనే దానిని కనిపెట్టేందుకు సాహసం చేయండి. సమస్యలను జయించండి. విజయాన్ని ఒడిసి పట్టండి. ఈ గొప్ప లక్షణాలను యువత తప్పక అలవర్చుకోవాలి.

-నా దృష్టిలో నాయకుడంటే లక్ష్యమున్నవాడు. అభిరుచి ఉన్నవాడు. సమస్యను చూసి భయపడకుండా దానిని ఎలా ఓడించాలో తెలిసినవాడు. పూర్తి చిత్తశుద్ధితో పనిచేయటం నాయకుడికి ఉండాల్సిన అత్యంత ముఖ్య లక్షణం.
-గొప్ప వ్యక్తులకు మతమంటే స్నేహాన్ని పెంపొందించేంది. అల్పులకు అది కొట్లాడుకొనేందుకు ఒక సాధనం.
-ఒకదేశం అవినీతి రహితం కావాలన్నా, గొప్ప మేధస్సులతో నిండాలన్నా సమాజంలో ముగ్గురివల్లనే సాధ్యమని నేను బలంగా నమ్ముతాను. వారే తల్లి, తండ్రి, గురువు.

-ప్రస్తుతం నిజమైన వైజ్ఞానిక కార్యకలాపాలన్నీ ఇంగ్లిష్‌లోనే కొనసాగుతున్నందున మనకు ఇంగ్లిష్ తప్పనిసరి. మన భాషల్లో నిజమైన వైజ్ఞానిక కార్యకలాపాలు మొదలవ్వటానికి మరో రెండు దశాబ్దాలు పడుతుందని నేను భావిస్తున్నాను. అప్పుడు మనం కూడా జపనీస్‌లాగా ముందుకు సాగవచ్చు.
-మనిషికి కష్టాలూ అవసరమే.. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలడు.
-విద్యార్థికి ఉండవల్సిన అతిముఖ్య లక్షణాల్లో ఒకటి ప్రశ్నించటం. విద్యార్థులారా ప్రశ్నించడం నేర్చుకోండి.
-మనం స్వేచ్ఛగా లేకపోతే.. ఎవరూ మనల్ని గౌరవించరు.
-కవిత్వమనేది అత్యున్నతమైన సంతోషం నుంచి లేదా అత్యంత విచారం నుంచే వస్తుంది.


జై హింద్      జై అబ్దుల్ కలామ్




2 కామెంట్‌లు:

asha చెప్పారు...

Jai Abdul Kalam!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

జై జై అబ్దుల్ కలాం! జై హింద్!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి