గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 17, 2015

వైరుధ్యాలకు అతీతంగా...


 
అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో వేళ్లూనుకొని ఉన్న దోపిడీ నుంచి బయటపడగలిగిన నాడే సామాజిక తెలంగాణ కాని, బంగారు తెలంగాణ కాని సాధ్యం. లెనిన్ చెప్పినట్లు మనవారికి, శత్రువులకు మధ్యవ్యత్యాసం గ్రహించినప్పుడే సరైన దృక్పథం అలవడుతుంది. అప్పుడే మనం కలలుగన్న తెలంగాణ సాధ్యమవుతుంది.

వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లోకి రావడాన్ని ఫిరాయింపుగానో, నీతిమాలిన చర్యగానో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలో జరిగిన వివిధ రకాల రాజకీయ పునరేకీకరణలను, ఫిరాయింపులను విశ్లేషించుకోవలసిన అవసరం ఉన్నది. మావో అన్నట్లు స్పష్టమైన రాజకీయ దృక్పథం లేనివాడు ఆత్మలేని వాడితో సమానం.


స్వాతంత్య్ర పోరాటం అనంతరం మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన మంత్రి మండలిలోకి కాంగ్రెస్‌ను, వ్యక్తిగతంగా తనను వ్యతిరేకించిన వివిధ పార్టీల నేతలను ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించి కొత్తగా ఏర్పడిన దేశానికి తమవంతు సహకారం అందించాలి అనే సదుద్దేశంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ (షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ) న్యాయశాఖమంత్రిగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (హిందూ మహాసభ అధ్యక్షులు), పరిశ్రమల మంత్రిగా, బాలదేవ్ సింగ్ (ప్యాంథిక్ పార్టీ), రక్షణమంత్రిగా నెహ్రూతో పాటు 1947 ఆగస్టు 15న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మహానుభావులు ఆ రోజు చేసింది పార్టీ ఫిరాయింపుగా ఆ నాటి రాజకీయ పార్టీలు గాని నాయకులు గాని, ప్రజలు గాని చూడలేదు. స్వతం భారతదేశంలో సవాళ్లను స్వీకరించడానికి జరిగిన రాజకీయ పునరేకీకరణగా, ప్రజలు, చరిత్రకారులు శ్లాఘించారు. ఆ రోజు, ఆ మహానేతలు తమ వ్యక్తిగత, పార్టీ అభిప్రాయాలను, ఆవేశాలను పక్కనబెట్టి దేశం కోసం ఏకమైన మహత్తర ఘట్టం.


దాదాపు 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులను తెలంగాణ పోరాటం చూసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రపార్టీలు, ఆంధ్ర ప్రాబల్యమున్న జాతీయ పార్టీలు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే ఎన్నో కుట్రలు చేశాయి. దీన్ని చూడలేని వివిధ పార్టీల్లో ఉన్న కొందరు తెలంగాణ నాయకులు, ఆయా పార్టీల తెలంగాణ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరారు. మరికొంతమంది నాయకులు వారి పార్టీల్లోనే ఉంటూ అంతర్గతంగా తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్ణాలు అనేక కుట్రలను ఛేదించి తెలంగాణను సాధించాయి.


తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఆంధ్రపార్టీలు, ఆంధ్ర ప్రాబల్యమున్న జాతీయ పార్టీలు తెలంగాణ మీద తమ కుట్రలను కొనసాగిస్తున్నాయి. ఇక్కడ రాజకీయ అస్థిరత్వం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయా పార్టీల్లో ఉన్న కొంతమంది నాయకులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదామనే తలంపుతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తెలంగాణలోని అన్ని రాజకీయ శక్తులు సంఘటితమై తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి.


గడిచిన సంవత్సరకాలంలో టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ హక్కుల గురించి పోరాటంతో తెలంగాణ వ్యాన్‌గార్డ్‌గా ఉందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజాకాంక్షను పట్టని పార్టీలను, నాయకులను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. తెలంగాణ హక్కుల గురించి మాట్లాడని, పోట్లాడని నాయకులు, పార్టీలు ఏ విధమైన రాజకీయం చేసినప్పటికీ ప్రజల ఆదరణ పొందలేరు.


1983లో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవం అనే ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చిన మామ అయిన ఎన్టీఆర్‌పై పోటీకి సిద్ధం అని ప్రకటించాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో చిత్తుగా ఓడిన చంద్రబాబు కొన్ని రోజులకు టీడీపీలో చేరడం ఫిరాయింపు కాక మరేమిటి?


1995లో చంద్రబాబు ఎన్టీర్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి, పదవీచ్యుతున్ని చేసి తాను అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ఫిరాయించినట్లు కాదా?


10 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వైఎస్సార్. ఆయన స్ఫూర్తితో కుమారుడు జగన్ పెట్టుకున్న పార్టీ వైఎస్సార్సీపీ.


గౌతమ బుద్ధుడు ధర్మానికి పరిభాష్యం చెబుతూ బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ధర్మమే అని గుర్తించాలి.


కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన యూనైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్‌లలో టీడీపీ భాగస్వామి కాలేదా?.
తెలంగాణ అనుకూల శక్తులను తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్‌ఎస్ ఒక్కటిచేసి తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదించాలి. ఇలాంటి ఏకీకరణకు సహకరించడం ప్రతి వ్యక్తి, నాయకుడి నైతిక బాధ్యత.


అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో వేళ్లూనుకొని ఉన్న దోపిడీ నుంచి బయటపడగలిగిన నాడే సామాజిక తెలంగాణ కాని, బంగారు తెలంగాణ కాని సాధ్యం. లెనిన్ చెప్పినట్లు మనవారికి, శత్రువులకు మధ్య వ్యత్యాసం గ్రహించినప్పుడే సరైన దృక్పథం అలవడుతుంది. అప్పుడే మనం కలలుగన్న తెలంగాణ సాధ్యమవుతుంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి