గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 27, 2015

ఇది నిజంగా సవతి తల్లి ప్రేమే...!!!

Tummalanageshwarrao


రెండు తెలుగు రాష్ర్టాలూ తమకు సమానమేనని, ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇరు రాష్ర్టాల అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తామని పదే పదే ప్రకటనలు గుప్పించే కేంద్ర ప్రభుత్వం.. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపిస్తూ.. పలు విషయాల్లో అన్యాయం చేస్తున్నది. జాతీయ రహదారుల కేటాయింపులో చూపిన వివక్షతో కేంద్ర ప్రభుత్వం నైజం మరోసారి బయటపడింది.


-తెలంగాణకు దక్కని జాతీయ రహదారులు
-కిలోమీటరు కూడా కేటాయించని కేంద్రం
-పునర్వ్యవస్థీకరణ చట్టానికి తూట్లు
-ఏపీకీ మరో 700 కి.మీ. మంజూరు
-నేడు కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి తుమ్మల భేటీ
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు తక్కువగా ఉన్నాయని, సత్వరమే మరో 1,018 కిలోమీటర్లు కేటాయించాలని సీఎం కే చంద్రశేఖర్‌రావుతోపాటు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అనేకసార్లు కేంద్రాన్ని కోరారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు. గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించానని, త్వరలో మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల చాలాసార్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి తెచ్చారు. 



రాష్ట్రంలో నేషనల్ హైవేస్ బాధ్యతలు చూస్తున్న చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డి కూడా అనేకసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. అయినా కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన జాతీయ రహదారులపై కరుణ చూపలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 700 కిలోమీటర్లు మంజూరు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు జనాభా, ప్రాంతీయ నిష్పత్తి ప్రకారం కేంద్రం జాతీయ రహదారులను కేటాయించాలి. జాతీయ రహదారులు తక్కువగా ఉన్న రాష్ర్టానికి అదనంగా ఇవ్వాలి. చట్టం ప్రకారం ఏపీ కంటే తక్కువగా ఉన్న తెలంగాణకు ఎక్కువ కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయాలి. కానీ తెలంగాణకు జాతీయ రహదారులను ఇవ్వడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది.

చట్టానికి తూట్లు పొడుస్తూ ఏపీకి మరో 700 కిలోమీటర్లు మంజూరు చేసింది. ఏపీ రాష్ర్టానికి ఇప్పటికే 3300 కిలోమీటర్ల పొడువు జాతీయ రహదారులు ఉండగా, తాజాగా మంజూరీతో 4వేల కిలోమీటర్లకు చేరాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2600 కిలోమీటర్ల రహదారులు మాత్రమే ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జాతీయ రహదారులను ప్రకటించలేదు. కనీసం మరో వెయ్యి కిలోమీటర్లైనా తక్షణమే ప్రకటించాల్సి ఉన్నది.

నేడు గడ్కరీతో తుమ్మల భేటీ..


రాష్ర్టానికి రావాల్సిన జాతీయ రహదారుల అంశంపై రోడ్లు ,భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో అధికారుల బృందం సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానుంది. ఈ అంశాన్ని రోడ్లు భవనల శాఖ మంత్రి పేషీ ఆదివారం అధికారిక ప్రకటనలో తెలిపింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, నేషనల్ హైవేస్ సీఈ గణపతిరెడ్డి కూడా మంత్రితో వెళ్లే బృందంలో ఉన్నారు. మంత్రి గడ్కరితోపాటు ఉపరితల రవాణాశాఖ, నేషనల్ హైవేస్ అధికారులను కూడా వారు కలువనున్నారు.

ప్రతిపాదనలివే..


కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముందు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఉంచనున్న ప్రతిపాదనలు..
-తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 రాష్ట్ర రహదారులను 1,018 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలి
-సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్‌ఎఫ్)కు అదనపు నిధులు మంజూరు చేయాలి
-ప్రస్తుతం ఉన్న 17 రహదారుల అభివృద్ధి కోసం రూ.557 కోట్లు మంజూరు చేయాలి
-బోయిన్‌పల్లి-కొంపల్లి, ఆరాంగఢ్-శంషాబాద్ నేషనల్ హైవేపై 44 అభివృద్ధి పనుల ప్రస్తావన
-తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రెండో దశలో రాష్ర్టానికి తగినన్ని నిధులు ఇవ్వాలి
జాతీయ రహదారులుగా మార్చాలని కోరనున్న ఆరు రహదారుల వివరాలు..
-హైదరాబాద్ నుంచి నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, బాసర, భైంసా మీదుగా వెళ్లి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే రాష్ట్ర రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి పరచడం(230 కిలోమీటర్లు)
-హైదరాబాద్ నుంచి బీజాపూర్ రోడ్ వయా మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, కొడంగల్ మీదుగా కర్ణాటకను కలుపుతూ వెళ్లే రోడ్డు (133 కిలోమీటర్లు)
-కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల మీదుగా ఉన్న రోడ్డు (220 కిలోమీటర్లు)
-నిర్మల్ నుంచి జగిత్యాల, ఖానాపూర్, మల్లాపూర్, రాయికల్ మీదుగా ఎన్‌హెచ్-61ను కలిపే రోడ్డు (110 కిలోమీటర్లు)
-అశ్వారావుపేట, ఖమ్మం, సూర్యాపేట రోడ్డు (160 కిలోమీటర్లు)
-కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం మీదుగా వెళ్లే రాష్ట్ర రోడ్డు (165 కిలోమీటర్లు)
-మొత్తం ఆరు రహదారులు కలిపి 1018 కిలోమీటర్లు.

ఎవరి ఒత్తిళ్ళకు లొంగకుండా పై రహదారుల అభివృద్ధికి అనుమతిస్తే, కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు...నిజమైన ప్రేమే చూపిస్తున్నదని భావించాలి. అనుమతించకుంటే అది తప్పకుండా.....!!!



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి