గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 01, 2014

విభజించిన ఉద్యోగులకు 1న పోస్టింగులు...!


-నేను నిమిత్త మాత్రుడిని.. నా చేతిలో ఏమీ లేదు..
- ఈ కేటాయింపులు తాత్కాలికమే 
-అసలు కేటాయింపులు సీఎంలు చూసుకుంటారు.. ముందు ఉద్యోగాల్లో చేరండి.. అన్నీ సర్దుకుంటాయి 
-ఉద్యోగ సంఘాల నేతల భేటీలో సీఎస్ మహంతి 
-సమావేశంపై అసంతృప్తి వెలిబుచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు 


నేను నిమిత్తమాత్రుడిని.. కేంద్రానికి బద్ధుడిని..నా చేతిలో ఏమీ లేదు.. ఇవీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతీ చెప్పిన మాటలు. నెలల తరబడి తమ భవిష్యత్తుపై ఆందోళనలకు గురై.. విన్నపాలు, వినతిపత్రాలు సమర్పించిన ఉద్యోగులకు చివరకు మిగిలింది ఏమిటంటే ముందు ఎక్కడవేస్తే అక్కడ చేరండి. తర్వాత అన్నీ సర్దుకుంటాయి అన్న ఓదార్పుతో కూడిన సలహా మాత్రమే. ఈ సమావేశం తీవ్ర ఆశాభంగం కలిగించింది... విభజన తర్వాత ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లో ఉద్యోగులు తమ జీతాలు ఏ ప్రభుత్వం ఇస్తుందో తెలియక కోర్టుల చుట్టూ తిరిగిన ఉదంతాలు గుర్తుకు వస్తున్నాయి అంటూ ఓ ఉద్యోగ నాయకుడు చేసిన వ్యాఖ్య ఉద్యోగుల మానసికాందోళనకు అద్దంపడుతున్నది.

రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగుల పంపిణీపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలను చర్చించేందుకు శుక్రవారం 30 ఉద్యోగసంఘాల నేతలతో ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ ఉద్యోగులకు అసంతృప్తినే మిగిల్చింది. దాదాపు గంటపాటు సాగిన సమావేశంలో ఉద్యోగుల వాదనలను, అభ్యంతరాలను విన్న సీఎస్‍.................., వారికి ఏ ఓదార్పూ ఇవ్వలేకపోయారు. ముందు ఉద్యోగాల్లో చేరండి.. తర్వాత సమస్యలు అన్నీ సర్దుకుంటాయని అన్నారు. ప్రస్తుతం జరుపుతున్న కేటాయింపులన్నీ తాత్కాలికమేనని, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక కొత్త ముఖ్యమంత్రులు సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. 

ఇప్పటికైతే కేంద్రం ఆదేశాల ప్రకారం పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ ఉద్యోగిని ఏ రాష్ట్రానికి కేటాయించిందీ జూన్ 1 వ తేదీ రాత్రి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని చెప్పారు. ప్రకటించిన ఆదేశాల ప్రకారం ఉద్యోగులు జూన్ రెండు తారీఖునుంచి తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని నేతలకు తేల్చి చెప్పారు. జూన్ రెండు నుంచి కేంద్ర నిబంధనల ప్రకారం ఆర్డర్ టు సర్వ్ పద్ధతిన మూడు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రస్తుతానికి కేంద్రం ఆదేశాల ప్రకారం పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగుల అభ్యంతరాలను జూన్ 9 వరకు స్వీకరించనున్నామని తెలిపారు. 

ఇదే సమయంలోపే ఇరు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లు ఏ రాష్ట్రానికి చెందినవి ఆ రాష్ట్రానికి పంపిణీ చేయడం, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఉద్యోగుల అభ్యంతరాలను పరిశీలించిన మీదట జూన్ 15 తేదీన మరోసారి సమావేశమై అప్పుడు మరో ప్రొవిజినల్ లిస్టు విడుదల చేస్తామన్నారు. ఉద్యోగుల పంపిణీ తుది దశకు చేరుకునే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. 

నాలుగు దశల్లో విభజన : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజన నాలుగు దశల్లో పూర్తి చేయనున్నట్లు మహంతి తెలిపారు. మొదటి దశలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజన, రెండో దశలో సచివాలయ ఉద్యోగులకు,శాఖాధిపతుల (హెచ్‌వోడీ ఉద్యోగుల)కి పోస్టింగులు కేటాయించడం జరుగుతుందన్నారు. మూడో దశలో గ్రూప్ వన్, గ్రూప్‌టు తదితర రాష్ట్ర క్యాడర్ కు చెందిన ఉద్యోగుల విభజన, నాలుగో దశలో జిల్లాలు, జోన్‍ల, మల్టీ జోన్ల స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. కాగా రాష్ట్ర విభజనతో పాటు ఉద్యోగుల విభజనలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ కార్యదర్శి మహంతి శనివారం తన పదవీ విరమణ చేయబోతున్నారు. 

సమావేశంలో మహంతితో పాటు జీఏడీ కార్యదర్శి ఎస్ కె సిన్హా, రాష్ట్ర సలహాదారు కమిటీ సభ్యుడు పీవీ రమేష్, ఐఏఎస్ అధికారులు బుర్రా వెంకటేశం,అజయ్ మిశ్రా, శ్యాం బాబు, రామకృష్ణా రావు పాల్గొన్నారు.తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘాల జేఏసీ నేతలు దేవిప్రసాద్, విఠల్, రవీందర్ రెడ్డి, మమత, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్,మధుసూదన్ రెడ్డి, శివశంకర్, చంద్రశేఖర్ గౌడ్, మామిడి నారాయణ, పద్మాచారి, కృష్ణయాదవ్, షేక్ హుస్సేన్‌లతో పాటు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు, సీమాంధ్ర ఉద్యోగుల సంఘాల నేతలు అశోక్‌బాబు,మురళీకృష్ణ తదితరులున్నారు. 

మాకు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు -ఉద్యోగ నేతల నిట్టూర్పు 
సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం తీరుపై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. చర్చల్లో ఏ భరోసా లభించలేదని వారు వాపోయారు. రాష్ట్రం విడిపోతుంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి వీడ్కోలు విందు ఇచ్చినట్టుంది అని వారన్నారు. 


తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తాం: దేవీప్రసాద్ 
కాగా తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రకు కేటాయించినా తిరిగి తెలంగాణకు రప్పిస్తామని తెలంగాణ నాన్-గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. ఉద్యోగుల విభజనలో ఉద్యోగుల స్థానికతను రహస్యంగా ఉంచడాన్ని తప్పుపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో గ్రూప్-4, అటెండర్లు, డ్రైవర్లు ఎక్కువగా ఉన్నారన్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. 


స్థానికత విషయంలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న విషయానికి తమ వద్ద సాక్ష్యాలున్నాయని, వాటిని కమలనాథన్ కమిటీకి కూడా సమర్పించామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులను ఎక్కడ కేటాయించారనే అంశం జూన్ 9లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జూన్2న ఉదయం 10:15 గంటలకు సికింద్రాబాద్‌లో పేరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారానికి ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. 

కేంద్రానిది యుద్ధనీతి: విఠల్ 
కేంద్రం కావాలనే ఉద్యోగుల విభజనలో యుద్ధనీతి అమలు చేస్తున్నదని తెలంగాణ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు విఠల్ ఆరోపించారు. యుద్ధంలో తమ సైనికులను రక్షించుకోవడానికి ప్రత్యర్ధి దేశ సైనికులను బందీలను చేసి పట్టుకుపోతారు. ఇదే విధానాన్ని కేంద్రం అమలు పరిచినట్లు కనిపిస్తున్నది. అక్రమంగా తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల మీద ఈగ వాలకుండా తెలంగాణ ఉద్యోగులను బందీలుగా సీమాంధ్రకు బదిలీ చేస్తున్నారని అనిపిస్తున్నది అని వివరించారు. సీమాంధ్ర ఐఏఎస్‌లు ఎన్ని ఎత్తులు, జిత్తులు వేసినా తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్రలో పనిచేయబోరు, సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో పనిచేయనివ్వరు అని స్పష్టం చేశారు. 


తెలంగాణ ప్రాంతానికి చెందిన 5 నుంచి 6 వేల మంది ఉద్యోగులు సీమాంధ్రకు , 8 నుంచి 10 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ ప్రాంతానికి కేటాయించినట్లు సమాచారం ఉందని అన్నారు. తనకు సీమాంధ్రలో పోస్టింగు ఇచ్చిన విషయాన్ని సరిచేస్తాననే మహంతి హామీ ఇచ్చారని, భవిష్యత్తు కార్యాచరణ జూన్ రెండు తర్వాత ప్రకటిస్తానన్నారు. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‍పై తమకు పూర్తి భరోసా ఉన్నదని గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. 2001 డీఎస్సీ తర్వాత 30 శాతం నాన్-లోకల్ కోటా కింద తెలంగాణలో ఉపాధ్యాయులుగా నియామకమైన సీమాంధ్ర ఉపాధ్యాయులను తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జేఏసీ ఛైర్మన్ జీ హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు 12వేల మంది సీమాంధ్ర ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తమ స్వంత జిల్లాలకు వెళ్లడానికి ఆప్షన్ అవకాశం కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కత్తి వెంకటనర్సింహరెడ్డి డిమాండ్ చేశారు. 

స్థానికతకు సిద్ధమే : అశోక్‌బాబు 
ఉద్యోగుల విభజనకు స్థానికతను ఆధారంగా తీసుకొని విభజించినా తమకు అభ్యంతరం లేదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. కొందరు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, నేతలు చేస్తున్న ప్రకటనలు సీమాంధ్ర ఉద్యోగులను ఆందోళనలకు గురి చేస్తోందన్నారు. విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యోగులతో కలిసి ఉద్యోగుల హెల్త్‌కార్డులు, పీఆర్‌సీ అమలు కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఉద్యోగుల విభజనపై తలెత్తే సమస్యలు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ప్రధాన మంత్రి అధ్యక్షతన ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు, సీఎస్‌లతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించినట్లు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ పేర్కొన్నారు. 


సచివాలయంలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగుల్లో తప్పుడు స్థానిక ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన ఉద్యోగులెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. బలవంతంగా ఇక్కడ ఉండాలని సీమాంధ్ర ఉద్యోగులకు లేదని సీమాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య అన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న హెచ్‌వోడీలకు స్థానిక రిజర్వేషన్లు వర్తించవన్నారు. 

ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రకే : ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ 
ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయడానికి మానసికంగా సిద్ధం కావాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇప్పుడే వెళ్తే సీనియారిటీ, ప్రమోషన్లలో ఎలాంటి గొడవలు ఉండవని సలహా ఇచ్చారు. 


తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర పోలీసు, ఉపాధ్యాయ ఉద్యోగులు తిరిగి స్వంత రాష్ట్రాలకు వెళ్తామని ముందుకు వచ్చినా కొందరు కావాలని సమస్యను జఠిలం చేస్తున్నారన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి పేరుమార్చాలనే ప్రతిపాదన సరికాదన్నారు. పేర్లు మార్చాల్సి వస్తే శంషాబాద్ విమానాశ్రయానికి ప్రోఫెసర్ జయశంకర్ పేరుపెట్టాలన్నారు. ఎల్బీ స్టేడియానికి శ్రీకాంతాచారిపేరు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి చాకలి అయిలమ్మ, ఎన్టీఆర్ మార్గ్‌కు యాదయ్యపేరు పెడతామని హెచ్చరించారు...పెట్టాలని డిమాండ్ చేశారు. కొందరు సీమాంధ్ర ఆఫీసర్లు ఆంధ్ర ఐఏఎస్‌లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.64 కోట్ల విరాళం 
-ఒకటిన్నర రోజుల వేతనం ఇస్తున్న తెలంగాణ ఉద్యోగులు 
తెలంగాణ స్వప్నం సాకారమై, స్వరాష్ట్ర ఏర్పాటు విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి తెలంగాణ ఉద్యోగులు ముందుకు వచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న జూన్ 2న తెలంగాణ ఉద్యోగులు తమ ఒకటిన్నర రోజుల వేతనాన్ని ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. ఈ మొత్తం సుమారు రూ.64 కోట్లను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇందులో ఒకరోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు, అరరోజు వేతనాన్ని అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి విరాళంగా ఇస్తున్నామని ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. 


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి