గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 24, 2014

ఫౌండ్రీకి ఫౌండేషన్!

-170 ఎకరాల్లో క్లస్టర్ ఏర్పాటు
-రాష్ట్రంలో లోహపరిశ్రమకు ఊపు
-రూ. 300 కోట్ల పెట్టుబడులకు అవకాశం
-వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు
-పారిశ్రామీకీకరణ వేగం పెంచిన సర్కార్
-రేపటి హాట్ ఫేవరేట్ తెలంగాణే
-బాలారిష్టాలు తొలగించుకుంటే భారీగా ఉపాధి
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామీకీకరణ వేపు వేగంగా అడుగులు వేస్తున్నది. నూతన ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాలనే కతనిశ్చయంతో ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు సాగించింది. ఫలితంగా రాష్ట్రంలో ఫౌండ్రీ ఇండస్ట్రీ (లోహ పరిశ్రమ)లో పెట్టుబడులకు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. వీరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబుపేట దగ్గర 170 ఎకరాలతో ఫౌండ్రీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పార్కులో కనీసం 50 యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉంది. ఇక్కడ సుమారు రూ.300 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో మరిన్ని క్లస్టర్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గ్యాస్ రెగ్యులేటర్ నుంచి పవర్‌ప్లాంట్ దాకా...

ఫౌండ్రీ ఇండస్ట్రీని పరిశ్రమలకు మదర్ ఇండస్ట్రీగా పిలుస్తారు. ఇందులో గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ మొదలుకొని ఆటోమొబైల్స్, కమర్షియల్ వాహనాలు, ఎర్త్‌మూవింగ్ ఎక్విప్‌మెంట్స్, పవర్‌ప్లాంట్స్, మిషన్ టూల్స్, ఇంజినీరింగ్ వస్తువులు తయారవుతాయి. రాష్ట్రంలో ఈ రంగంలో ఇప్పటికే బీహెచ్‌ఈఎల్, టెక్‌మిష్, మహింద్రా అండ్ మహింద్రాలతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ, ఫ్యాన్ ఇండస్ట్రీ వంటివి ఉన్నాయి.

ప్రస్తుత స్థితి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 250 ఫౌండ్రీలు ఏర్పాటయ్యాయి. ఇందులో హైదరాబాద్ చుట్టూనే 120 వరకు ఉన్నాయి. ప్రధానంగా జీడిమెట్ల, బాలానగర్, ఉప్పల్, మియాపూర్, పటాన్‌చెరు, పాశ మైలారం ప్రాంతాల్లో ఈ పరిశ్రమ వేళ్లూనుకుని ఉంది. ఏటా 6000 టన్నుల మేరకు ఉత్పత్తి చేస్తూ రూ.700 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నదని అంచనా. వీటి వల్ల ప్రత్యక్షంగా 8 వేల మందికి, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి దొరుకుతున్నదని ఫౌండ్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే 600 ఫౌండ్రీలతో 25 లక్షల కుటుంబాలు ఈ పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నాయి. వీటిలో 80 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమలే. మెటలార్జికల్ ఇండస్ట్రీగా పిలిచే ఫౌండ్రీ రంగం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి.

హాట్ ఫేవరెట్ తెలంగాణ..

ఈ రంగంలో కర్నాటక, పశ్చిమబెంగాల్, గోవా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన పారిశ్రామికవేత్తల సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో అనేక చోట్ల ఏర్పాటైన పరిశ్రమల్లో వీరిదే అగ్రతాంబూలం. వీరంతా మన చుట్టుపక్కల ప్రాంతాల వారే కనుక తెలంగాణలో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసిన పక్షంలో ఫౌండ్రీ పరిశ్రమల ఏర్పాటుకు వీరంతా ముందుకు వచ్చే అవకాశముంది. కోల్‌కతాలో 650 ఎకరాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లస్టర్ విజయవంతం కావడం స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే కోయంబత్తూరులో మూడు, బెల్గాంలో ఒకటి, బెంగుళూరులో ఒకటి వంతున ఉన్న క్లస్టర్లు కూడా విజయవంతంగా నడుస్తున్నాయి.

చైనాది అగ్ర స్థానం..

ప్రపంచ వ్యాప్తంగా ఫౌండ్రీ రంగంలో మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండో స్థానానికి భారత్, అమెరికాలు పోటీ పడుతున్నాయి. చైనా ఏటా 30 మిలియన్ టన్నుల కాస్టింగ్ ఉత్పత్తి చేస్తున్నది. భారత్ 9 మిలియన్ టన్నుల ఉత్పత్తులతో రెండోస్థానంలో ఇటీవలి వరకూ కొనసాగింది. ఈ ఏడాది అమెరికా 9 మిలియన్ టన్నుల కంటే అధికంగా ఉత్పత్తి చేసి రెండో స్థానానికి పోటీకి వచ్చింది. మనదేశంలో ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్, కర్నాటక రాష్ర్టాల్లో లోహ పరిశ్రమలు ఎక్కవగా ఉన్నాయి.

చిన్నచూపు..వ్యతిరేకత:

ఈ రంగం మీద కొంత వ్యతిరేకభావన ఉన్నది. ఈ రంగాన్ని డర్టీ, డేంజరస్ అంటూ వ్యాఖ్యానించడం కూడా కద్దు. ఈ పరిశ్రమల్లో వ్యర్థాలు ఉత్పత్తి కావడం అవి పరిశ్రమల పరిసరాల్లో సమస్యలు సష్టించడం దీనికి కారణం. పరిశ్రమలుగానీ, ప్రభుత్వాలు గానీ తగు జాగ్రత్తలు పాటించని చోట్ల పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. పర్యావరణానికి హాని కలుగుతుందంటూ కాలుష్య నియంత్రణ మండలి వీటిని రెడ్ కేటగిరిగా పరిగణించింది. దీనికి కారణమెవరైనా ఈ రంగం మీద కొంచెం చిన్నచూపు ఏర్పడిన మాట వాస్తవం. అయితే ఇదే సమయంలో ఈ రంగం భారీగా ఉద్యోగాలు, ఉపాధికి దారిచూపడం కూడా అంతే వాస్తవం. తగిన జాగ్రత్తలు తీసుకొని గ్రీన్ ఫౌండ్రీస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. వ్యర్ధాలు అధికంగా ఉత్పత్తి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలను పారిశ్రామికవేత్తలు చేపట్టాల్సి ఉంటుంది.

సమస్యలు..

ఈ పరిశ్రమకు సంబంధించి ప్రధానంగా విద్యుత్తు కోతలే అతి పెద్ద సమస్యగా పరిణమించిందని ది ఇండియన్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఫౌండ్రీమెన్ దక్షిణాది చాప్టర్ పేర్కొంది. అలాగే విద్యుత్తు టారీఫ్ వల్ల కూడా భారీగా నష్టపోతున్నామని పలువురు పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్రకటితపు కోతల వల్ల ఫౌండ్రీ ఇండస్ట్రీ నడువడం కష్టమవుతున్నదన్న అభిప్రాయం కూడా వెల్లడవుతున్నది. దాంతో పాటు స్కిల్డ్ లేబర్ కూడా సమస్యగానే ఉంది. రెడ్ కేటగిరిగా పరిగణించడం వల్ల యువత ఈ పరిశ్రమలో పని చేసేందుకు ముందుకు రావడం లేదు. అయితే మన రాష్ట్రంలో ఉన్న ఫౌండ్రీలు ఇతర రాష్ర్టాలతో పోటీ పడే స్థాయిలోనే ఉన్నాయని ప్రశంస వినిపిస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి