గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 14, 2014

ఏపీకి ప్రత్యేక హోదాకు " నో..."?

-హోదా లభిస్తే 90 శాతం గ్రాంటుగా కేంద్ర సాయం
-దేశంలో ప్రస్తుతం 11 రాష్ట్రాలకు హోదా
-మరో మూడు రాష్ట్రాలకు అర్హత
-అర్హత లేదని ప్రకటించిన ప్రణాళికా సంఘం
-కాదు..కాదు.. తుది నిర్ణయం జరగలేదు
-గంటల వ్యవధిలో మరో ప్రకటన
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక క్యాటగిరీ హోదా ఇవ్వలేమని ప్రణాళికా సంఘం తేల్చి చెప్పింది. ప్రత్యేక క్యాటగిరీకి కావల్సిన అర్హతలు ఏపీకి లేవని సంఘం తెలిపింది. ఈ హోదా ఇచ్చేందుకు జాతీయాభివృద్ధి రూపొందించిన ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్‌కు సరిపోవడం లేదని ప్రణాళికా సంఘం అధికారులు పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఆ తర్వాత ప్రణాళికా సంఘం అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేస్తూ ఏపీ ప్రత్యేక హోదా అంశం ఇంకా సంఘం పరిశీలనలోనే ఉందని పేర్కొన్నారు. అంతకుముందు ప్రత్యేక క్యాటగిరీ కోసం జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన అర్హతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేవు. ప్రస్తుతం ఉన్న నిబంధనల కింద ఏపీకి హోదా ఇవ్వలేం అని కేంద్ర ప్రణాళికాశాఖ మంత్రి ఇందర్‌జిత్ సింగ్ రావుకు సమర్పించిన నివేదికలో కమిషన్ అధికారులు స్పష్టం చేశారు.

జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం పర్వత ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాలు, జనసాంద్రత అతి తక్కువగా ఉన్న , సింహభాగం గిరిజన జనాభా ఉన్న, సరిహద్దులో ఉన్న , దేశ సరిహద్దుల వంటి ప్రత్యేక పరిస్థితులు, ఆర్థికంగా, మౌలిక వనరుల విషయంలోనూ బాగా వెనుకబడిన ప్రాంతాలు, సొంత ఆదాయంతో మనుగడ సాగించలేని ప్రాంతాలు తదితర ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక క్యాటగిరీ హోదా ఇవ్వడానికి వీలవుతుంది. దేశంలో ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక క్యాటగిరీ హోదా అమలులో ఉంది. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, సిక్కిం రాష్ట్రాలున్నాయి. వీటిలో చాలా వరకు సరిహద్దు రాష్ట్రాలు. మిగిలిన వాటిలో పర్వత ప్రాంతాలు, గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలు, సొంత ఆదాయం మీద మన లేని రాష్ట్రాలున్నాయి.

గత ఫిబ్రవరి 21న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటన చేశారు. ఈ మేరకు మార్చి 2వ తేదీన కేంద్ర క్యాబినెట్ సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీపై నివేదిక ఇవ్వాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రత్యేక కేటగిరీ ఇవ్వాలంటూ బీహార్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలు కూడా ప్రణాళికా సంఘం ముందుకు వచ్చాయి. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన సంఘం ప్రస్తుతం బీహార్ మినహా మిగిలిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చునని తెలిపింది.

కాగా ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి కనుక చొరవ తీసుకుని తీర్మానం చేసిన పక్షంలో ప్రత్యేక కేసు కింద హోదా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములాను అనుసరించి రాష్ట్రాల ప్రణాళికలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా, 10 శాతం అప్పుగా ఇస్తారు. మిగిలిన రాష్ట్రాలకు 30 శాతం గ్రాంటుగా, 70 శాతం అప్పుగా ఇస్తారు.
కాదు కాదు....పరిశీలనలో ఉంది: ఏపీ ప్రత్యేక హోదాపై పీటీఐ వార్త వెలువడిన కొన్ని గంటల్లోనే ప్రణాళికా సంఘం స్పందించింది. ఏపీకి ప్రత్యేక హోదాపై తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ఇంకా ప్రణాళికా సంఘం పరిశీలనలోనే ఉంది. దానిపై ఇంత వరకూ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు అని ప్రణాళికా సంఘం అధికార ప్రతినిధి మీడియాకు చెప్పారు.
-ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుఅరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, సిక్కిం.
-హోదాకు అర్హత సాధించిన రాష్ట్రాలురాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్
-హోదాకు అర్హత లేదని ప్రకటించిన రాష్ట్రాలు బీహార్, ఆంధ్రప్రదేశ్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి