గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 15, 2015

ఇదీ.. గంగదేవిపల్లి పిల్లల మాట...!!!

తెలంగాణ కవి పండిత మేధావులకు, ప్రజలకు, వీక్షకులకు
భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!


గ్రామ ప్రజలంతా వూరును తీర్చిదిద్దుకుని ప్రగతిబాటలో నడిపిస్తుంటే దాని ప్రభావం వూర్లోని ఈ తరం పిల్లలపై ఏ విధంగా ప్రసరిస్తుందో ఈ ఆదర్శ గ్రామాన్ని చూస్తే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లలు గ్రామాల అభివృద్ధిలో పాల్గొంటే వాళ్లు పెరిగి పెద్దయిన తర్వాత వివిధ వృత్తుల్లో చేరిన తర్వాత ఎంతో స్ఫూర్తివంతంగా పనిచేయగలుగుతారు. చిన్నప్పుడు పిల్లల మనస్సుల్లో నాటుకున్న భావాలు అవి వారితోపాటే పెరిగి పెద్దవుతాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి వెళితే ఈతరం పిల్లలు ఏం మాట్లాడతారో అర్థమవుతుంది. గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా అది రాష్ట్రంలో, దేశంలో పేరుగడించింది. ఆ వూరు ఎలా ఆదర్శగ్రామమైంది? గ్రామ ప్రజల ఐక్యత ఎలా ఉంది? ఆ వూరు ఆదర్శంగా నిలవటానికి వాళ్లేం చేశారు? ఆదర్శ గ్రామం నిర్మించాలంటే ఆ వూరు చెబుతున్న పాఠాలేమిటి?..అన్న కోణంలో ప్రపంచమంతా గంగదేవిపల్లి గ్రామం వైపు చూస్తుంది. 

villeges


అందునా రాష్ట్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 17 నుంచి గ్రామాలను తీర్చిదిద్దేందుకు, గ్రామాభివృద్ధికి గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టే కసరత్తు ఒక పక్క ముమ్మరంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రామానందతీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కిశోర్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కొందరు సర్పంచ్‌లు ఆగస్టు 3వ తేదీన గంగదేవిపల్లిని సందర్శించారు. గ్రామమంతా కలియ తిరిగారు. గ్రామంలోని రోడ్లను, నీటి సరఫరా విధానాన్ని, విద్యుత్ పంపిణీ, పాఠశాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగునీటి నిర్వహణ విధానాల్ని పరిశీలించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల పాత్ర గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగదేవిపల్లిలోని హైస్కూల్‌కు వెళ్లారు. అక్కడ స్కూల్ నిర్వహణ పద్ధతి, పిల్లల ప్రగతి గురించి హెడ్‌మాస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. 9వ తరగతి గతికి వెళ్ళి కాసేపు పిల్లలతో మాట్లాడారు. మీ వూరు ఆదర్శ గ్రామం అని ప్రపంచమంతా చెప్పుకుంటున్నది. మీ వూరు ఆదర్శగ్రామం కావటానికి ఏం చేశారు? మీ వూరెందుకు ఆదర్శ గ్రామమయ్యింది? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పిల్లల అభిప్రాయాన్ని అప్పటికప్పుడు కాగితంపై రాసి ఇవ్వమని అడిగారు. దీనిపై కొందరు పిల్లలు రాసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

మావూరు ఆదర్శగ్రామం. ఎందుకనగా మా వూరిలో మద్యనిషేధం అమలు జరుగుతున్నది. మలవిసర్జనకోసం ఎవరూ బయటకు వెళ్లకుండా మరుగుదొడ్లను కట్టించారు. అయినా ఎవరైనా బయటికి వెళ్తే జరిమానా తప్పదు. ఆదర్శగ్రామం కావడానికి ప్రజలందరూ భాగాస్వాములయ్యారు. రాజమౌళి సార్ ఆదర్శ గ్రామాన్ని చేయడానికి చాలా కృషి చేశారు. పగలనక, రాత్రనక కృషి చేశారు. ఆదర్శ గ్రామంగా చేయడానికి ఇంకా కృషి చేస్తూనే వున్నారు. అతని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఆ చుట్టు పక్కల పరిశుభ్రంగా వుండేటట్లు చేయడం. పరిశుభ్రంగా లేకపోతే ఆ రోజు వాటర్ క్యాన్ బంద్. మాకు ప్రతి ఇంటికి మంచినీరు సదుపాయం ఉంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉన్నాయి. చెత్త చెదారం లేకుండా చూసుకుంటారు. చెత్త చెదారం వుంటే జరిమానా వేస్తారు. చెట్లను చాల బాగా చూసుకొంటాము. ప్రతి చెట్టును ఒక మనిషిలా భావిస్తాము.


మల విసర్జన కోసం బయటికి వెళ్తే 500 రూ.లు జరిమానా వేస్తారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటి వాటికి నీరు పోసి పెంచి పెద్ద చేశాము. చెత్త చెదారం బయట వేయరు. ఎవరి యింటి ముందు వారే శుభ్రపరుస్తారు. ఎవరి ఇంటి ముందు చెట్టుకు వారే శుభ్రపరుచుకొని నీరు పోస్తారు. మద్యం సేవించడం అనేది లేకుండా చేశారు. మా ఊరి సర్పంచ్ కృషి చేతే ఇవన్నీ జరిగాయి. ఒక రోజు చెట్టుకు నీరు పోయకపోతే ఫిల్టర్ నీళ్లు ఇవ్వరు. మా ఊరి బడిలో పిల్లలు వూరంతా తిరిగి బడి ఈడు పిల్లలంతా బడికి రావాలని చెప్తాం. ఇతర ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌లు ఊరిలోకి రాకుండా చేశారు. అందుకనే గంగదేవిపల్లి గ్రామం ఆదర్శ గ్రామం అయింది.


మా గ్రామంలో మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్లరు. మద్య నిషేధ పథకం ఉన్నది. ఎవరు మద్యం సేవించకుండా చేశాము. ప్లాస్టిక్ నిషేధం చేశాము. రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటి వాటిని బ్రతికించడం. ఇంటి చుట్టూ మరియు పరిసరాలను శుభ్రం చేయడం. నీటి యాజమాన్య కమిటీలున్నాయి. వాటికి అధ్యక్షులను పెట్టడం జరిగింది. అందరు కలిసి గ్రామ పంచాయతీని జాగ్రత్తగా నిర్వహిస్తారు. వచ్చిన వనరులను జాగ్రత్తగా వాడుకోవడం. అందరికి అన్ని వసతులను అందించడం. వాతావరణం కాలుష్యం చేయకుండా ఇంటి చుట్టు చెట్లు నాటడం కారులో సీఎన్‌జీని వాడడం. అందరి కోసం వికాస శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం.


మా గ్రామంలో మద్యపానాన్ని నిషేధించారు. ఇంటికొక చెట్టును పెంచేందుకు పురిగొల్పారు. రోడ్లపైన చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా వుంచుకుంటాం. చెత్తను కుండీలో వేస్తారు తప్ప రోడ్లపైన వెయ్యరు. మా వూరిలో వాటర్ ట్యాంకు ద్వారా మంచి నీటి సౌకర్యం ఉంది. మా వూరు పచ్చగా ఉంటుంది.



మా గ్రామం ఎందుకు అభివృద్ధి అయింది అంటే?-మా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను పెంచడం వల్ల.
-బయట మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటంవల్ల.
-అలా వెళ్లిన వారికి 500 రూ.లు జరిమానా వేయవలసి ఉంటుంది.
-మద్యనిషేధం అమలులో ఉంది.
-మా గ్రామంలో 28 కమిటీలున్నాయి. ఆ కమిటీ ఇచ్చిన పనిని వారు పూర్తి  చేయాలి.
-అలా చేయకపోతే వారికి వాటర్ ఇవ్వరు.
-రోడ్డుకు ఇరువైపులా పెట్టిన చెట్లకు, నీరు పోసి దాని చుట్టు చెత్త  చెదారంలేకుండా చూడాలి.
-మా గ్రామం అభివృద్ధి చెందటానికి మరొక కారకుడు సర్పంచ్ గారు. మరియు  హెడ్‌మాస్టర్ గారు. వారు చేసిన సహాయం మేము మరచిపోము.



మా వూరు ఆదర్శ గ్రామం. ఎందుకనగా మద్యం సేవించరాదు. మల మూత్ర విసర్జనకు బయటకు వెళ్లరు. ప్రతి ఇంటికి కుళాయి, మరుగుదొడ్లు ఉన్నాయి. మా గ్రామ పెద్దలందరూ కలిసి కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కమిటీకి ప్రాధాన్యత ఉంటుంది. ప్లాస్టిక్ సంచులు ఎక్కడ బడితే అక్కడ వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంటికి ఒక్కొక్క చెట్టు యిచ్చారు. చెట్టును మన ఇంట్లో ఒక మనిషిలా భావిస్తారు. ఆ చెట్టు చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి. ఆదర్శ గ్రామం కావటానికి ప్రజలు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ఊరిలో, గుట్కా, పాన్, అంబర్ వంటివి తినకూడదు.


రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటి వూరిని హరితవనంగా మార్చారు. చెత్త, చెదారం బయట వేయము. ఎవరి ఇంటి ముందు వారే శుభ్రపరుస్తారు. మద్యం సేవించడం అనేది లేకుండా చేశారు. మా ఊరి సర్పంచ్ చేత ఇవన్నీ జరిగాయి. మా ఊరి బడిలో పిల్లలు ఎక్కువ మంది లేకపోతే సర్పంచ్‌గారు, హెడ్‌మాస్టర్ గారు ఇల్లు ఇల్లు తిరిగి పిల్లలు రావాలని హెచ్చరించారు.


ఇంటి ప్రక్కల చెత్త చెదారం వేయరు. ఇంటి చుట్టు ప్రక్కల చెట్లు నాటుకున్నాం. లెట్రిన్‌కు బయటకు వెళితే 500 రూపాయలు జరిమానా కట్టాలి. ప్రతి చెట్టుకు మేమే నీరు పోయాలి. నీళ్లు పోయకపోతే శిక్ష వేస్తారు. ఎవరి ఇంటిముందు వారు శుభ్రంగా వుంచుకోవాలి. మా వూరికి మేము రక్షకులుగా నిలిచాం.


మా ఊరిలో అందరు కలిసి మెలిసి ఉంటారు. ఎవరికి ఏది కావాలన్నా మా ఊరి సర్పంచ్‌గారు అందుబాటులో ఉంటారు. మా ఊరికి ఇరువైపుల చెట్లు నాటాము. మా వూరిలో దాతల సాయంతో సిమెంట్ రోడ్లు నిర్మించుకోవటం జరిగింది. మా ఊరు చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంటుంది. బయట మూత్రం పోస్తే 500 రూపాయలు కట్టాలి. మా ఊరిలో అందరి ఇళ్లల్లో మరుగుదొడ్డి ఉంది. ఊరిలో ఇంకా బాలవికాస్ కమిటీ, డ్వాక్రాగ్రూప్ వంటివి అనేక గ్రూపులు ఉన్నాయి. మా గ్రామంలో ఏ సమస్య అయినా చెప్పాలని అనుకుంటే వారు తమ గ్రూప్ లీడర్‌కు చెప్పి అందరిని పిలుచుకుని రమ్మని చెపుతారు. సభ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. గ్రామసభలు మా గంగదేవిపల్లిని తీర్చిదిద్దుతున్నాయి.


రాజమౌళిగారు మా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. బయట మలమూత్ర విసర్జన చేస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారు. మా వూరిలో 24 కమిటీలు వున్నవి. ఆ కమిటి వాటికి ఇచ్చిన పని చేస్తారు. మా గ్రామం ప్రపంచంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు రాజమౌళిగారు. మద్యం ఇక్కడ అమ్మరు. త్రాగరు. అలా చేస్తే ఫైన్ వేస్తారు. ఇక్కడ రోడ్డుకు ఇరువైపుల చెట్లు ఉంటాయి. అందరు కలిసి ఉంటారు. బడిలో కూడా చెట్లు నాటించారు. మా బడిలో మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంది. మా బడిని కూడా ఆదర్శబడిగా చేయాలన్నదే మా ఊరి లక్ష్యం. ప్రపంచమంతటి నుంచి ఈ ఊరికి వస్తున్నారు. దీనికి కారణం రాజమౌళి టీచర్.


మా గ్రామంలో ఇంటికొక చెట్టు పెంచాము. దానికి ప్రతి వారం వారం నీరు పోసి చెత్త చెదారం లేకుండా చేస్తాము. బయట మల మూత్ర విసర్జన చేయకుండా ఉంటాము. అందరికి మరుగుదొడ్లు ఉన్నాయి. మంచి నీరు. ఇంటి చుట్టుప్రక్కల చెత్త చెదారం లేకుండా చూసుకుంటాము. ప్లాస్టిక్ చెత్త చెదారం బయట వేయకుండా చెత్తకుండీలో వేస్తాము. రోడ్లను శుభ్రంగా ఉంచుతాము. ఊరిలో వాటర్ ట్యాంక్ ఉంది. అందరు వాటర్ క్యాన్ తెచ్చుకుంటారు. మంచి నీటి సౌకర్యం ఉంటుంది. ఊరిలో స్కూల్ ఉంది.




(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి