గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 28, 2015

తెలంగాణలో డీలా...సీమాంధ్రలో గోలగోల...!!!???

-తెలంగాణలో డీలా, సీమాంధ్ర గోలగోల
-ఎదురు తన్నుతున్న చంద్రబాబు వ్యూహాలు
-ఆంధ్ర పెత్తనం మీద మండిపడుతున్న టీటీడీపీ
-మాగంటికి సిటీ పదవిపై రేవంత్ మండిపాటు
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందే చేతులెత్తేసిన టీడీపీ
ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణలో ఉన్న బలమైన నాయకులు వెళ్లిపోగా డీలా పడిపోతే, సీమాంధ్రలో ఎన్నికలముందు చేరిన నాయకుల భారంతో ఆగమాగమవుతున్నది. భవిష్యత్తు ఉందా లేదా తెలియక ఇక్కడ అయోమయం ఏర్పడితే సీమాంధ్రలో భారీ విజయం సాధించీ ఎవరినీ సంతృప్తి పరచలేక చతికిలపడింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినపుడు కేంద్రం సహకారంతో ఇక్కడ పరోక్షపాలన.. సీమాంధ్రలో ఎదురులేని పాలన చెలాయిస్తామనుకున్న సంతోషం అచిరకాలంలోనే ఆవిరైంది. అక్కడ ఇక్కడ పప్పులుడకని పరిస్థితి ఏర్పడింది. తాజాగా చంద్రబాబు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. తెలంగాణలో నాయకులను రోజూ బుజ్జగించాల్సి వస్తుంటే సీమాంధ్రలో రోజుకొకరు ఎదురుతిరుగుతుంటే ఏమీ చేయలేని స్థితి చంద్రబాబుది. 


babu

తెలంగాణలో చంద్రబాబు పార్టీ నేతల మధ్య ఒక రకమైన కోల్డ్‌వార్ జరుగుతున్నది. ఓ వైపు వారిని బుజ్జగిస్తూనే మరోవైపు సీమాంధ్ర పెత్తనమే రుద్దుతున్నారు. తెలంగాణ టీడీపీకి రమణను అధ్యక్షునిగా చేసినా కుమారుడు లోకేశ్‌ను రెండోవైపు రుద్దారు. ఇదీ చాలక ఓసారి ఎర్రబెల్లికి, మరోసారి రేవంత్‌కు ప్రాధాన్యం ఇస్తూ అందర్నీ ఉత్సవ విగ్రహాలుగా వాడుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ మీద కుట్రలు చేస్తూ, తెలంగాణ ఏర్పాటు ఘోరం.. దారుణం అంటూ ప్రకటనలు చేస్తూ, వారికి మింగలేని కక్కలేని పరిస్థితిని తానే తెస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఉండాలి.. కానీ సీమాంధ్ర పెత్తనంలోనే ఉండాలన్న వ్యూహాన్ని చంద్రబాబు అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నగర అధ్యక్ష పదవిని సీమాంధ్రకు చెందిన మాగంటి బాబుకు ఇవ్వడం ద్వారా బాబు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించారు. ఆంధ్ర నాయకులను తెలంగాణ నాయకులు భుజానికెత్తుకోవాల్సిందేనని పరోక్షంగా వెల్లడించారు. బాబు నిర్ణయంతో తెలంగాణ ఎమ్మెల్యేలు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.


జిల్లాల్లో నాయకులు ప్రజలకు ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాగంటి పేరును ఖరారు చేయడం పట్ల పార్టీలో విస్తృతస్థాయి చర్చ జరుగుతున్నది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పదవిని సీమాంధ్ర నేతకే కట్టబెట్టడం ఏమిటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన సామాజిక వర్గం ఓట్లు, సీమాంధ్ర ప్రాంత ఓట్లను దృష్టిలో ఉంచుకునే అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ బాబు ఆంతరంగికులు సన్నాయి నొక్కుతున్నారని తెలిసింది. అంటే ఒక్క సీమాంధ్ర ఓట్లు మాత్రమే టీడీపీకి చాలా? తెలంగాణ వారి ఓట్లు అవసరం లేదా? అని శ్రేణులు వాపోతున్నాయి. 


చంద్రబాబును అన్నింటికీ వెనకేసుకు వచ్చే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్ష పదవిని ఆంధ్రకు చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీకి కట్టబెట్టేందుకు చంద్రబాబు మొగ్గు చూపడంపై అగ్గి మీద గుగ్గిలమైనట్టు తెలిసింది. ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కొనసాగగుతున్న మాజీ మంత్రి క్రిష్ణయాదవ్‌కే మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆయనను వెంటబెట్టుకుని చంద్రబాబు వద్దకే వెళ్లినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ నేతలు కరువైనట్లుగా ఆంధ్ర ప్రాంతనేతకు సిటీ అధ్యక్ష పదవిని కట్టబెడుతున్నారని నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం క్లిప్పింగ్‌ను చంద్రబాబు వద్ద ఉంచినట్టు తెలిసింది. తెలంగాణ ప్రజలు గోపీనాథ్‌ను వ్యతిరేకిస్తున్నారని, ఆంధ్రప్రాంత నేతలకు పదవులిస్తే వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవచ్చనే ఆలోచన సరికాదని రేవంత్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది. 


రాష్ట్రంలో ప్రస్తుతం ఓటుకు ఆధార్‌కార్డును అనుసంధానం చేస్తున్నారని, దీనితో ఇక్కడున్న ఆంధ్రప్రాంత వాసులు తాము పుట్టిన ప్రాంతాల్లో ఓటును కాపాడుకునేందుకు ఇక్కడి ఓట్లు వదులుకుంటున్నారని తెలిపినట్టు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రులు పలువురు నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నారని, ఇక్కడి రాజకీయాలపై వారికి ఆసక్తి కూడా నశించిందని ఆయన వివరించినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర నాయకులకు తెలంగాణ ప్రాంతంలో పార్టీ పదవులు కట్టబెడితే తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమవుతుందే తప్ప ఏ ప్రయోజనం ఉండదని కరాఖండీగా చెప్పారని తెలిసింది. 


ఇదిలా ఉంటే తెలంగాణ ప్రాంతానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎల్ రమణకు ఈ వ్యవహారంలో ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదని తెలిసింది. పేరుకే అధ్యక్షుడు తప్ప పార్టీలో ఎవరూ ఆయన అధీనంలో లేరని, మరోవైపు ఎర్రబెల్లి, రేవంత్‌లు పెత్తనం కోసం ఎవరి గ్రూపులు వారు కడుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు కూడా ఎపుడు ఎవరి మాట వింటారో.. ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియని పరిస్థితి ఉందని వారన్నారు. 


తప్పుడు వ్యూహంతో వెల్లక్కిలా..


ఉన్న కష్టాలు చాలక పార్టీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యేలను దెబ్బ కొట్టాలని కోర్టుకు ఎక్కిన టీడీపీకి చుక్కెదురైంది. సోమవారం హైకోర్టు ఎదుట అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే దానిని విచారించాల్సిన పని లేదని కోర్టు తేల్చి చెప్పింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, చల్లా ధర్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డిలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా నిరోధించాలని టీడీపీ తరపున ఎర్రబెల్లి దయాకర్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పెద్దగా స్పందించక పోవడంతో తర్వాత ఏమిటి అనేది అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.


మరోవైపు ఈ చర్యతో ఎన్నికకు ముందే చేతులెత్తేసినట్టు అయింది. గెలుపు విషయాన్ని పక్కనపెడితే ఈ ఎన్నికల్లో ఎంతమంది పార్టీకి ఓటు వేస్తారో తెలియని అయోమయం నెలకొంది. గెలవని అభ్యర్థికి ఓటెందుకు? అనే అభిప్రాయం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తున్నదంటున్నారు. ఇంతోటిదానికి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ఎర్రబెల్లి, రేవంత్ సిగపట్లకు కూడా దిగారు. చివరకు రేవంత్‌రెడ్డి బలపరిచిన వేం నరేందర్‌రెడ్డికే అభ్యర్థిత్వం వరించగా ఎర్రబెల్లి చిన్నబుచ్చుకున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి