గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 25, 2014

తెలంగాణ విద్యుత్ ప్లాంట్లలో సీమాంధ్ర ఇంజనీర్ల తిష్ఠ!


-తెలంగాణలోని ప్లాంట్లలో 630 మంది సీమాంధ్ర విద్యుత్ ఇంజినీర్లు
-ఏపీజెన్‌కోలోని 11,535 మంది ఉద్యోగుల్లో 6,412 మంది సీమాంధ్రులే 
-నకిలీ ధ్రువపత్రాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఉద్యోగులు
-సొంత ప్రాంతాలకు సాగనంపాలి
...టీ విద్యుత్ ఉద్యోగ సంఘాల డిమాండ్

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ రంగంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. జెన్‌కోలోని ఉద్యోగాల్లో సీమాంధ్రులదే మెజార్టీ. ఏపీజెన్‌కోలో 11,535 మంది ఉద్యోగుల్లో 6,412 మంది సీమాంధ్రులే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లలో అసిస్టెంట్ ఇంజినీర్ నుంచి చీఫ్ ఇంజినీర్‌స్థాయి వరకు వివిధ కేటగిరిల్లో 630 మంది సీమాంధ్ర ఇంజినీర్లు పనిచేస్తున్నా రు. సీమాంధ్రలోని విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న తెలంగాణ ఇంజినీర్లు మాత్రం 48 మంది మాత్రమే ఉండడం గమనార్హం. రాష్ట్ర విభజన జరిగినా తప్పుడు ధ్రువపత్రాలతో తెలంగాణలోనే తిష్ఠవేసేందుకు  సీమాంధ్ర ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారు.


ఇన్నాళ్లుగా తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కకుండా, ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు దక్కకుండా చేసిన సీమాంధ్ర ఇంజినీర్లు.. తెలంగాణ రాష్ట్రంలోనూ కుట్రలకు సిద్ధపడుతున్నారు. తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లకు న్యాయం జరిగేలా, నిరుద్యోగులకు కొంతమేరకైనా ఉద్యోగాలు లభించేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్‌తోపాటు పలు తెలంగాణ సంఘాలు, తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర ఇంజినీర్లను స్వస్థలాలకు పంపి, అక్కడి తెలంగాణ ఇంజినీర్లను వెనక్కి రప్పించాలని కోరుతున్నారు.

విద్యుత్‌ప్లాంట్ ఉన్న అన్ని చోట్లా పాగా...
ఖమ్మం జిల్లా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లోని ప్లాంట్‌లో 301 మంది తెలంగాణ ఇంజినీర్లు ఉంటే 180 మంది సీమాంధ్ర ఇంజినీర్లున్నారు. కేటీపీఎస్ 5,6 దశల్లో 227 మంది తెలంగాణ ఇంజినీర్లుంటే 150 మంది సీమాంధ్రులున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో 167 మంది తెలంగాణ ఇంజినీర్లు ఉంటే 86 మంది సీమాంధ్ర ఇంజినీర్లు ఉన్నారు. నాగార్జునసాగర్ హైడెల్ ప్రాజెక్టులో 56 మంది తెలంగాణ, 57 మంది సీమాంధ్రులున్నారు. లోయర్ సీలేరు హైడెల్ ప్రాజెక్టులో 26 మంది తెలగాణ, 26 మంది సీమాంధ్ర ఇంజినీర్లు పనిచేస్తున్నారు. జూరాల హైడెల్ ప్రాజెక్టులో 35 మంది తెలంగాణ, 50 మంది సీమాంధ్ర ఇంజినీర్లున్నారు.

రామగుండం థర్మల్ పవర్‌ప్రాజెక్టులో 61 మంది తెలంగాణ, 11 మంది సీమాంధ్ర ఇంజినీర్లు, పోచంపాడు మినీ హైడెల్ ప్రాజెక్టులో 32 మంది తెలంగాణ, ఆరుగురు సీమాంధ్ర, శ్రీశైలం ఎడమ కాల్వ హైడెల్ ప్రాజెక్టులో 36 మంది తెలంగాణ, 59 మంది సీమాంధ్ర, విద్యుత్‌సౌధలో 152 మంది తెలంగాణ, 192 మంది సీమాంధ్ర ఇంజినీర్లు పనిచేస్తున్నారు. విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్టులో 23 మంది, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇద్దరు, కృష్ణపట్నం పవర్‌ప్రాజెక్టులో ముగ్గురు, నాగార్జునసాగర్ టెయిల్‌పాంట్ హైడెల్ ప్రాజెక్టులో 9 మంది, తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేట వద్ద మినీ హైడెల్‌లో కేవలం ఒక్కరు, శ్రీశైలం కుడి కాల్వ హైడెల్ ప్రాజెక్టులో పదిమంది చొప్పున మొత్తం 48 మంది తెలంగాణ ప్రాంత ఇంజినీర్లు సీమాంధ్రలోని పవర్‌ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు.


లాబీయింగ్ చేస్తూ పాతుకుపోయిన సీమాంధ్రులు
తెలంగాణవారిని తెలంగాణకు రప్పించి సీమాంధ్రులను స్వస్థలాలకు పంపించాలని అనేకసార్లు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసినప్పటికీ కొన్నేళ్లుగా యాజమాన్యాలను లాబీయింగ్ చేస్తూ సీమాంధ్రులు ఇక్కడే కొనసాగుతున్నారు. ఏపీ జెన్‌కోలో ఉన్న 11,535 మంది మొత్తం ఉద్యోగుల్లో 6,412 మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారు. 5,123 మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్రులు అనేక మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నా యి. వీరి స్థానికతపైనా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. సాం కేతిక సిబ్బందితో పోలిస్తే 1,439 మంది తెలంగాణ ఉద్యోగులు ఉండగా 2,811 మంది సీమాంధ్రులే తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్నారు. స్థానికత ఆధారంగా వీరందరినీ వారి స్వస్థలాలకు పంపిస్తే తెలంగాణలో వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు ఇప్పటి వరకు సీమాంధ్రుల వల్ల పదోన్నతులు కోల్పోయిన అనేక మంది తెలంగాణ ఇంజినీర్లకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని టీ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీ ఎలక్ట్రిసిటీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేస్తోంది.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి