గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 14, 2014

జలగర్భంలోకి మన చరిత్ర చేరనున్నదా...?!

-కోటిలింగాలను ముంచెత్తనున్న ఎల్లంపల్లి...

nife

మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే పురుడు పోసుకున్నాయి. మహా సామ్రాజ్యాలన్నీ సస్యశామల మైదానాల్లోనే విలసిల్లాయి. శత్రుభీకర దుర్గాలన్నీ జల దుర్గాలు, గిరి దుర్గాలే. ఇది చరిత్ర. అందుకే ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న తెలంగాణ అనేక సామ్రాజ్యాలకు ఆటపైట్టెంది. చరిత్రకందినంతవరకు దక్షిణ భారతంలో మహాజనపదం అస్మక సామ్రాజ్యం ఇక్కడే విలసిల్లింది. ఆ అవశేషాలపై అనేక రాజ్యాలు ఆవిర్భవించాయి. శాతవాహనులకు పూర్వమే మహావైభవంగా వర్ధిల్లిన చరిత్ర కరీంనగర్ జిల్లా కోటిలింగాలది. 

kotilingalu



గోదావరి తీరంలో విలసిల్లిన ఈ రాజ్య ప్రస్తావన మెగస్తనీస్ రాతల్లో అగుపిస్తుంది. తెలుగువారి చరిత్రలో ఘనమైందిగా చెప్పుకొనే శాతవాహన సామ్రాజ్యం ఇక్కడే పురుడు పోసుకుంది. తెలంగాణ ఘన చరిత్రను ప్రపంచానికి చాటిన కోటిలింగాల ప్రస్తుతం ముంపు ముంగిట నిలిచింది. సర్కారు సత్వరమే స్పందించి, తవ్వకాలకు ఆదేశిస్తేనే మన ఘన వారసత్వ సంపద భావితరాలకు దక్కుతుంది. లేదంటే కడుపులో దాచుకున్న చారిత్రక అవశేషాలతో సహా కాలగర్భంలో కలిసిపోతుంది.

kunda


(చిల్ల మల్లేశం, టీ మీడియా ప్రతినిధి-కరీంనగర్): కోటిలింగాల.. కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలో గోదావరి నదీతీరాన ఉన్న ఓ కుగ్రామం. క్రీ.పూ.4వ శతాబ్దం నాటికే ఆంధ్రుల అతి ప్రాచీన రాజధాని నగరం. కాకతీయుల తాతలుగా చెప్పుకునే శాతవాహనుల కంటే పూర్వమే వెలసిన స్థావరం. ఇది మొదట కోటలోని లింగాలుగా ఉండి, తర్వాత కోటలింగాలుగా, అటుపై క్రమంగా కోటిలింగాలగా మారి ఉంటుందని చరిత్రకారులు, భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రఖ్యాత శాతవాహన రాజు హాలుడు, తన గాథాసప్తశతిలో కోటేర్మధ్యే అని పేర్కొనడం వల్ల ఇది మొదట కోటి రాజ్యంగా ఉండి, ఆ తర్వాత లింగాల వచ్చి చేరి ఉంటుందన్నది మరికొందరి వాదన.


ఇక్కడ, ఇలా ఉన్నది..


కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట వెళ్లే దారిలో వెల్గటూర్ నుంచి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే కోటిలింగాల వస్తుంది. పడమర నుంచి తూర్పునకు ప్రవహించే గోదావరి, ఈ ప్రాంతంలో కొద్దిగా మలుపు తిరిగింది. ఈ వంక దాటీదాటగానే దక్షిణం నుంచి పెద్దవాగు(మునులవాగు) వచ్చి కలుస్తున్నది. ఇలా ఏర్పడ్డ త్రిభుజాకార స్థలంలో సుమారు 2500 ఏళ్ల కిందటి చారిత్రక దిబ్బ 110 ఎకరాల విస్తీర్ణంతో నేలకు ఆరు మీటర్ల ఎత్తున తవ్వకాల కోసం ఎదురుచూస్తున్నది.

ఇండికాలో ప్రస్తావన..

kotilingalu

చంద్రగుప్త మౌర్యుడి కాలంలో(క్రీ.పూ. 324-300) ఆయన ఆస్థానాన్ని సందర్శించిన సుప్రసిద్ధ గ్రీకు రాయబారి మెగస్తనీస్, తన పర్యటన విశేషాలను ఇండికా గ్రంథంలో పొందుపరిచాడు. ఆంధ్రులకు బలమైన 30 కోటలు, లక్ష కాల్బలం, వెయ్యి ఏనుగులు, రెండు వేల గుర్రాలున్నాయి.. అని రాశాడు. మెగస్తనీస్ పేర్కొన్న ఆ 30 కోటల్లో ఇప్పటివరకు మూడు, నాలుగు కోటల ఆనవాళ్లే లభ్యమయ్యాయి. అందులో కోటిలింగాల ఒకటి కాగా, రెండోది ఇదే కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలంలోని ధూళికట్ట(ధూళికోట). మూడోది ధర్మపురి మండలంలోని బుగ్గారం గ్రామానికి తూర్పున ఉన్న రణం కోట అని పలువురు చరిత్రకారులు వాదిస్తుండగా, మరో కోట బోధన్‌లో మట్టిదిబ్బగా మిగిలి ఉన్నది.

శెరవనీయ బౌద్ధ జాతక కథలోనూ..


శెరవనీయ (శ్రీవణిజ) బౌద్ధ జాతక కథలో తెలివాహ నామ నదీం ఉత్తీరిత్వా, ఆంధ్రపురం నామ నగరం ప్రవిశంతు(సంస్కృతం) అని ఉంది. కోటిలింగాలలో తవ్వకాలకు (1979-84) ముందు తెలివాహ నదిని కృష్ణానది (తైలం లాంటి నల్లని నది) అనీ, దాని తీరంలోని ఆంధ్రపురం అమరావతి అని చరిత్రకారులు భావించారు. కోటిలింగాల తవ్వకాల తర్వాత ఈ అభిప్రాయం తప్పని తేలింది. కృష్ణ అంటే నల్లనిది, తెలి అంటే తెల్లనిది అనీ, తెలివాహ అంటే తెల్లని ప్రవాహం, అదే గోదావరి అనీ, దాని ఒడ్డున ఉన్న ఆంధ్రపురమే కోటిలింగాల అని చరిత్రకారులు తేల్చారు.

అతి ప్రాచీన బౌద్ధ స్తూపం


పెద్దవాగు, గోదావరిలో సంగమించే చోట(ఆగ్నేయభాగం) ఆంధ్రప్రదేశ్‌లోనే అతి ప్రాచీన బౌద్ధస్తూపం బయటపడింది. ఆంధ్రులు గొప్పగా చెప్పుకునే అమరావతి స్తూపం (క్రీ.శ.1వ శతాబ్దం) కంటే ఇది 500ఏళ్ల ముందుది! ఈ స్తూపం తూర్పు నుంచి పడమరకు 1055 మీటర్లు, ఉత్తరం నుంచి దక్షిణానికి 333 మీటర్లు, 9 మీటర్ల ఎత్తుతో, గుండ్రని ఇటుకల ప్లాట్‌ఫాం(ప్రదక్షిణా పథం) కలిగి ఉందని కోటిలింగాల తవ్వకాలపై అందజేసిన నివేదికలో డాక్టర్ ఎన్ రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఈ స్తూపానికి 20 సెంటీమీటర్ల మందం గల రాతి పలకలు అతికి ఉన్నాయి.


kotilingalu


ఇవి 59 దాకా లభించగా, వీటిపై లఘు శాసనాలున్నాయి. ఇవి బౌద్ధ ధర్మాలను బోధిస్తున్నాయి. శాసనాల్లోని భాష పూర్వ బ్రాహ్మీలిపిలోని ప్రాకృతం. ఇది అశోకునికి పూర్వం నాటిది. ఈ అతి ప్రాచీన లిపి వల్లే, హీనయాన శాఖకు చెందిన ఈ బౌద్ధస్తూపం క్రీ.పూ. 4వ శతాబ్ది నాటిదని చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. మలి శాతవాహన రాజులు నిర్మించిన జగత్ ప్రసిద్ధ అజంతా గుహాలయాలకు 300 ఏళ్ల ముందే తొలి శాతవాహనులు కోటిలింగాలకు దక్షిణంగా కిలోమీటరు దూరంలోని మునుల గుట్టపై గుహాలయాలు నిర్మించారు. ఈ కోటిలింగాల, ధూళికట్టలోని బౌద్ధ స్తూపాలు అమరావతి స్తూపం కన్నా పూర్వపువి. ఇవి రెండూ క్రీ పూ.4 వ శతాబ్దం నాటివని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వీవీ కృష్ణమూర్తి తేల్చారు.

తవ్వకాలకు అడుగడుగునా ఆటంకాలు..


kotilingalu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినప్పటి నుంచీ పురావస్తుశాఖలో సీమాంధ్ర అధికారులే ఉన్నారు. వీరంతా మొదటి నుంచీ కోటిలింగాల తవ్వకాల్లో దొరికినవాటిని దొరికినట్లు ఆంధ్ర ప్రాంతానికి తరలించి, తెలంగాణ ఘన చరిత్రను వెలుగులోకి రాకుండా చేశారనే ఆరోపణలున్నాయి. కోటిలింగాలలో 1979 నుంచి 1984 దాకా జరిగిన మొదటి విడత తవ్వకాల్లోనే ఇది ఆంధ్రుల తొలిరాజధాని అని తేలినా, 2006 దాకా ఆ విషయాన్ని కావాలనే తొక్కిపెట్టారు. అంటే తొలిరాజధానిగా పాఠ్యపుస్తకాల్లో పేర్కొన్న ధాన్యకటకం(అమరావతి) పేరును తొలగించడం వారికి ససేమిరా ఇష్టం లేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు!

చివరకు ఇక్కడి చరిత్రకారులు, కవులు, రచయితలు గగ్గోలు పెడితే, తవ్వకాలకు సంబంధించిన నివేదికను పుస్తకం రూపంలో 2006లో ముద్రించారు. కొన్నిసార్లు కోటిలింగాల, ధూళికట్ట లాంటి స్థావరాల్లో తవ్వకాలను అర్ధంతరంగా నిలిపివేయించి, పత్తా లేకుండా పోయారు.

భూసేకరణలోనూ నిర్లక్ష్యం..


కోటిలింగాల కోట మొత్తం ఇక్కడి 110 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ భూముల్లో సగ భాగం గ్రామం ఉండగా, సగభాగంలో పంట చేలున్నాయి. ఇళ్ల కింద ఎలాగూ తవ్వలేని పరిస్థితి ఉండడం, కనీసం పంట పొలాల్లో తవ్వేందుకు కూడా స్థానిక రైతులు ఒప్పుకోకపోవడంతో చాలాసార్లు పురావస్తు అధికారులు ఉత్త చేతుల్తో తిరిగివెళ్లారు. ఒకరిద్దరు రైతులను ఒప్పించి, కొన్ని గుంటల స్థలంలో మాత్రమే తవ్వకాలు జరిపారు. అందులోనే అనేక కట్టడాలు, వస్తువులు బయటపడగా, తిరిగి మట్టితో పూడ్చి వెళ్లిపోయారు. రైతులకు పరిహారం చెల్లించి, మొత్తం భూములు సేకరించి తమకు అప్పగించాలని ఎన్నోసార్లు పురావస్తుశాఖ అధికారులు కోరినా అప్పటి సీమాంధ్ర పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా తవ్వకాలు ముందుకు సాగలేదు.

ముంపు ముంగిట..


koti6

గోదావరిపై రామగుండం మండలం ఎల్లంపల్లి వద్ద నిర్మిస్తున్న శ్రీపాదసాగర్ ప్రాజెక్టులో మునిగిపోతున్న 40 గ్రామాల్లో కోటిలింగాల ఒకటి. దీనిని పూర్తిస్థాయి ముంపుగ్రామంగా ప్రకటించిన ప్రభుత్వం, ఇండ్లు, వ్యవసాయ భూములకు నష్ట పరిహారం చెల్లించింది. కొందరు రైతులకు ఇంకా కొద్ది మొత్తంలో పరిహారంతో పాటు గ్రామస్తులకు పునరావాసం కల్పించాల్సి ఉంది. చాలా ప్రభావిత గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ఈసారి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయకుండా గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అంటే ఈ ఒక్క ఏడాది మాత్రమే కోటిలింగాలలో తవ్వకాలకు అవకాశముంది.

ప్రాజెక్టు ముంపు గ్రామం కింద ఇళ్లు, వ్యవసాయ భూములకు ఎలాగూ నష్టపరిహారం చెల్లించినందున రైతులు అడ్డుకునే పరిస్థితి దాదాపు లేదు. అందువల్ల రాష్ట్ర సర్కారు స్పందించి, యుద్ధప్రాతిపదికన పనులు చేపడితే అలనాటి అద్భుత కట్టడాలు, అరుదైన వస్తుసామగ్రి బయటపడే అవకాశముంది. ముంపునకు గురికాకుండా స్థావరం చుట్టూ పెద్ద రక్షణ గోడ నిర్మించాలనే చరిత్రకారుల డిమాండ్‌లోని సాధ్యాసాధ్యాలను నిపుణులతో అధ్యయనం చేయించాల్సి ఉంది.

pearl

అప్పుడు ఇక్కడ లభ్యమైన చారిత్రక అవశేషాలతో ఇక్కడే మ్యూజియం నెలకొల్పి, ప్రదర్శనకు ఉంచితే, కోటిలింగాల దేశంలోనే గొప్ప చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. అదీ వీలుకాకుంటే కోటిలింగాల సమీపంలోనే ఎక్కడైనా మ్యూజియం నెలకొల్పి, చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

నాణేలు చెప్పిన నిజాలు..


చివరి పొరల్లో లభ్యమైన అనేక రాగి, సీసపు నాణేలపై క్రీ.పూ.2వ శతాబ్దపు లక్షణాలతో కూడిన ప్రాకృత బ్రాహ్మీలిపిలో రాణో గోభద(గోభద అనే రాజు), రాణో నారన, రాణో సిరి కంపాయ, రాణో సమగోప అని నలుగురు పాలకుల పేర్లు చెక్కి ఉన్నాయి. వీరంతా శాతవాహనుల పూర్వీకులైన ఆంధ్ర రాజులు. వీరి తర్వాతి పాలకులైన శాతవాహనుల నాణేలు కూడా సమగోపుని నాణేలను పోలి ఉన్నాయి. ఈ నాణేలతో పాటు నల్లని, ఎర్రని పెంకులు, మట్టి పాత్రలు లభించాయి. వీటి ఆధారంగా జరిగిన పరిశోధనల ద్వారా ఈ ప్రాంతం, క్రీ.పూ.4వ శతాబ్దం నాటి ఆంధ్రుల అతి ప్రాచీన స్థావరంగా తేలింది. ముందే చెప్పినట్లు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీముఖుడితో పాటు అతని పూర్వీకులు శాతవాహన, శాతకర్ణి నాణేలు కోటిలింగాలలో మాత్రమే లభించాయి.

stone

ఆంధ్రదేశంలో మరెక్కడా లభించలేదు. అలాగే ఇక్కడ మలి శాతవాహనులైన గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణేలు దొరకలేదు. అలాగే తొలిశాతవాహనుల నాణేలు మహారాష్ట్రలోని పైఠాన్(ప్రతిష్ఠానపురం)లోగానీ, అమరావతి(ధాన్యకటకం)లోగానీ లభించలేదు. ఆయాచోట్ల కేవలం మలి శాతవాహనుల నాణేలు మాత్రమే దొరికాయి. దీనిని బట్టి శాతవాహనుల తొలిరాజధాని కోటిలింగాల కాగా, రెండో రాజధాని పైఠాన్, చివరి రాజధాని అమరావతి అని చరిత్రకారులు భావిస్తున్నారు. ప్రకృతి బీభత్సాలు, శత్రువుల దాడుల నుంచి రక్షణ, లేదా రాజ్య విస్తరణలో భాగంగా రాజధానుల మార్పులు జరిగి ఉండవచ్చు.

తవ్వినకొద్దీ చరిత్ర..


రాష్ట్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో 1979 నుంచి 1984 వరకు కోటిలింగాల స్థావరంలోని (మొత్తం 110 ఎకరాలకుగాను) ఎకరాకు మించని స్థలంలో ఆరు పొరల దాకా తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఇటుక కట్టడాలు, వివిధ రాజవంశాలకు చెందిన వేలాది నాణేలు, వస్తువులు బయటపడ్డాయి. కింది మూడు పొరల్లో మట్టి ప్రాకారం, రబ్బుల్ నిర్మాణాలు, పై మూడు పొరల్లో కోటగోడలు, బురుజులు వెలుగుచూశాయి. కింది ఐదో పొర నుంచి పైన మొదటి పొర వరకు శాతవాహనుడు, మొదటి శాతకర్ణి నాణేలు, కింది మూడో పొర నుంచి పై మొదటి పొర వరకు సిముకుడి(శ్రీముఖుడి) నాణేలు లభించాయి. చివరి ఆరో పొరలో ఆంధ్ర గోపుల నాణేలు దొరికాయి. దీంతో ప్రాచీన ఆంధ్ర చరిత్ర అనుకోని మలుపు తిరిగింది. శాతవాహనుల కంటే పూర్వమే కోటిలింగాల ఆంధ్రుల రాజధానిగా వర్ధిల్లిందని తేలింది.

జనావాసాలు, బావులు..


భూమి నుంచి కేవలం 2.5 మీటర్ల లోతున జనావాసాలు, బావులు, పారిశుధ్య నిర్మాణాలు, నీటి తొట్లు, సౌందర్య సాధకాల (ఆభరణాలు, పూసలు)తో పాటు అనేక ఇనుప పనిముట్లు లభించాయి. రోమన్ నాణేలు, వారి శిల్పకళతో కూడిన కుండలు కూడా ఇక్కడ దొరకడం వల్ల కోటిలింగాల ఒకనాడు అంతర్జాతీయ వ్యాపార, వర్తక కేంద్రంగా వర్ధిల్లిందని భావిస్తున్నారు.

కాల్చిన ఇటుకలతో కట్టడాలు..


భూమికి 6 నుంచి 9 మీటర్ల ఎత్తున్న ఈ కోట నిర్మాణానికి కాల్చిన పెద్ద ఇటుకలు వాడారు. కోటకు నాలుగు వైపులా బురుజులున్నాయి. దక్షిణంగా మునేరు పక్కన కోట గోడలో కొంత భాగం(బురుజు సహా) ఇప్పటికీ నిలిచి ఉంది. ఆగ్నేయ బురుజు మీద ప్రస్తుతం కోటేశ్వరాలయం ఉంది. నైరుతి బురుజు దిబ్బగా మిగిలింది. ఇక గోదావరి ప్రవాహం వల్ల వాయువ్య బురుజుతో సహా ఉత్తరాన కోట గోడ పూర్తిగా కనుమరుగైంది. ప్రస్తుతం 300 మీటర్ల పొడువునా కోట గోడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇక దక్షిణం వైపు కోట ముఖద్వారం ఉండగా, ఉత్తరాన గోదావరి నది వైపు మరో ద్వారం బయటపడింది. ఈ ద్వారం నుంచి చతురస్ర, దీర్ఘచతురస్రాకారంలో అనేక ఇటుక కట్టడాలు కనిపించాయి. దీనిని బట్టి గోదావరి మీద ఓడల ద్వారా మనుషులు, సరుకుల రాకపోకలు సాగేవనీ, ఈ ఇటుక కట్టడాలు ఓడరేవు ఆనవాళ్లని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.


wall


తరలిపోయిన సంపద..


కోటిలింగాల తవ్వకాల్లో బయటపడ్డ స్థాయిలో నాణేలు, బౌద్ధ, జైన ఆనవాళ్లు, వస్తుసామగ్రి రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతంలోనూ దొరకలేదు. వెయ్యిదాకా ఆంధ్ర, శాతవాహన నాణేలు దొరికినా అందులో కనీసం పది నాణేలు కూడా కరీంనగర్ జిల్లా మ్యూజియంలో లేవు. వాటన్నింటినీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివిధ మ్యూజియాలకు తరలించారు. 2005లో గుంటూరు జిల్లాలోని అమరావతిలో జరిగిన కాలచక్ర ఉత్సవాలకు తెలంగాణ నుంచి 260 బౌద్ధ సంబంధిత వస్తువులను తరలించారు.

అందులో కోటిలింగాలకు చెందినవే 50కి పైగా అవశేషాలున్నాయి. కరీంనగర్‌లోని గాంధీ మ్యూజియం నుంచే 17 ఆనవాళ్లను తరలించినట్లు దక్కన్ ఆర్కియాలాజికల్ అండ్ కల్చరల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ అప్పట్లో ఆరోపించింది. వీటన్నింటినీ అమరావతిలోనే ఏర్పాటు చేసిన బుద్ధవనం మ్యూజియంలోనే ఇప్పటికీ ఉంచినట్లు తెలుస్తున్నది. తరలిపోయిన వాటిలో క్రీ.పూ.4వ శతాబ్దానికి చెందిన ధూళికట్ట బౌద్ధ స్తూపానికి అతికిన పాదుకలు, నాగముచిలింద పలకలున్నాయి. ఇంకా హైదరాబాద్ మ్యూజియంలోనూ అనేక అవశేషాలున్నాయి. వీటన్నింటినీ తిరిగి కోటిలింగాలకు తెప్పించి, ఇక్కడ ఏర్పాటు చేసే మ్యూజియంలో ఉంచాల్సిన బాధ్యత కొత్త సర్కారుపై ఉంది.


వెంటనే తవ్వకాలు చేపట్టాలె


1979 నుంచి 1984 దాకా ఇక్కడ పురావస్తు తవ్వకాలు జరిగితే, ఆ నివేదికను 26 ఏళ్ల తర్వాత 2006లో బయటపెట్టడం వెనుక అప్పట్లో పెద్ద కుట్రే జరిగింది. నాలాంటి ఎందరో చరిత్రకారులు నెత్తీనోరూ మొత్తుకుంటే 2009లో మలి దశ తవ్వకాలు జరిపిన్రు. నిధుల్లేక అవి కూడా ఆగిపోయినయ్. పంటలు నాశనమైతున్నయని రైతులు అడ్డుకున్నరు. ఇప్పుడు పరిహారం ఇచ్చిన్రు గనుక తెలంగాణ సర్కారు వెంటనే పూర్తిస్థాయి తవ్వకాలు జరిపి, బయటపడ్డ అవశేషాలతో ఇక్కడే మ్యూజియం ఏర్పాటు చేయాలె.


గుట్టపై మ్యూజియం ఏర్పాటు చేయాలి


పురావస్తు శాఖ 1979- 1984 మధ్య ఇక్కడ తవ్వకాలు జరిపితే 2500 ఏళ్ల కిందటి నగరం బయటపడింది. ఇప్పుడు శ్రీపాద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది నిండక, మునగలేదుగానీ ఎప్పటికైనా మునగడం ఖాయం. అందుకే కొత్త సర్కారు సత్వరమే స్పందించి, తవ్వకాలు ముమ్మరం చేయాలి. విశిష్టమైన ఇటుకలు, నాణేలు, అలనాటి వస్తు సామగ్రి, బౌద్ధస్తూపం వెలికితీసి, ప్రస్తుత శివాలయం ఉన్న గుట్టపై మ్యూజియం ఏర్పాటు చేసి, భద్రపరచాలి. వీలుకానప్పుడు స్థల ప్రాధాన్యత దృష్ట్యా వెల్గటూర్ సమీపంలోని మునుల గుట్టపై మ్యూజియం ఏర్పాటు చేయాలి.

2 కామెంట్‌లు:

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

ఆంద్రపాలకుల వివక్షత వలన ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది, ఇకపైన అయినా సత్వరమే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇదే కాదు కొండాపూర్, ఫణిగిరి వంటి తెలంగాణ అతి పురాతన ప్రదేశాలు వెలుగు చూడవలసిన అవరం ఎంతైనా ఉంది. మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇవి అతిపురాతన ప్రదేశాలైనా కావాలనే ఈ తెలంగాణ చరిత్రను అణగదొక్కి పెట్టటం అతి దుర్మార్గం. కొండాపూర్, ఫణిగిరి తవ్వకాలు నిజాం కాలంలో మొదలైనవి. చరిత్ర వెలుగు చూసినా ఆ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా చేయబడలేదు, ప్రపంచానికి కాదుగదా తెలుగువారికి కూడా తెలిసేలా చేయబడలేదు. వెలుగుచూసిన వస్తువులు ఎన్నో ఇప్పుడు కనిపించకపోవటం విచిత్రం. నిజాలు నిప్పులాంటివి అవి ఎంతకాలానికైనా వెలుగు చూడాల్సిందే. తెలంగాణ చరిత్ర వెలికితీతలో నమస్తే తెలంగాణ పత్రిక ఎంతో శ్రమిస్తున్నందులకు అభినందనలు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అవును స్వామిగారూ!

తెలంగాణ ప్రభుత్వం స్పందించి, త్వరపడి, మన చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా తగిన ఏర్పాట్లుచేస్తే, రాబోయే తరాలకు మన చరిత్ర తెలుస్తుంది. లేకుంటే భావితరం క్షమించదు.

వ్యాఖ్యపెట్టడంద్వారా స్పందించినందుకు ధన్యవాదాలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి