గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 28, 2013

నిన్న మొన్నటి దాఁక వంచించు మాట!


*
నిన్న మొన్నటి దాఁక వంచించు మాట
లెన్నొ మాట్లాడి, “తెలగాణ మున్నది యటఁ
గేంద్ర కరమున! నా చేఁతి కేమి యిడక
యుండ్రి! వారలదౌ నిర్ణయోద్ధృతినిట
నేను తలఁదాల్చి, యనుసరించెద నిజమ్ము!
నమ్ముఁ” డంచుఁ జొక్కంపు బంగారు మాట
లాడి; నేఁడుఁ దప్పి, మఱొక్క లాగున విని
పించుచును ముఖ్యమంత్రి ఱంపిల్లుచుండె!! (1)

*
“నీర ముద్యోగము లుపాధి ఘోరమైన
పాటులందును విభజన వలన నిచటఁ!
గాన, కేంద్రమ్మిఁక మఱియొక్క తఱిఁ దఱచి,
విభజనంపు టాలోచన వేగముగను
మానవలె” నంచు మన ముఖ్యమంత్రి వలికె! (2)

*
నీటి పాట్లను ట్రిబ్యునల్ తేఁట పఱచు;
మఱియు, నుద్యోగులకు నియమావళి యిట
నుండెను; నుపాధి కొఱ కే జనుండు నైన,
నెచటికైనను బోయి యుండినను నెవరు
నీ ప్రజాస్వామ్య దేశాన నెటుల నాపు
దురు? కనుక, నివియ వితండ దుర్మదాంధ
దర్పిత వచనమ్ములు! కాన, తగ్గుమనుచు
నిచటి తెలగాణ జనులు ఖండించుచుండ్రి! (3)

*
స్వార్థపూరిత దూషిత వాక్కులివియ;
యివియ తెలగాణ జనులను నీసడించి,
రెచ్చఁగొట్టెడి పలుకు! లుద్రేక జన్య
వా క్కలహ కారణమ్ములు! భ్రమముఁ గొలుపు
నివియ సీమాంధ్ర జనులకు; నెంతయేని
మోసమునుఁ గూర్చు మాటలు! ముందు ముందు
నెన్నికలలోన గెలుపొంద, నిక్కముగను
నెత్తుగడ కాక, యిదికాదె నీచ కృతము? (4)

*
మొదట నొకమాటఁ బలికియుఁ, బిదప మఱియు
నొకటి వలుకంగ, రెండు నాలుకలు గలవె?
వాక్కు స్థిరముగా నుండఁగా వలయుఁ; గాని,
పూఁట పూఁటకు మాఱిన, మూర్ఖుఁడనరె? (5)

*
బొంకులను బల్కి, యిట నట మూఢ మతినిఁ
బ్రజల మోసగించంగ దిగ్భ్రాంతులయిరి!
రెచ్చిపోవునట్టుల వారి గిచ్చి, యిటులఁ
గోపమునుఁ బెంచఁగా నెంతొ ఘోరమొదవె! (6)

*
ముఖ్యమంత్రి యనంగను ముఖ్యముగను
నిరువుఱను శాంత పఱుపంగ స్థిర తముఁ డని,
శాంతి కాముకుఁడని యంచు, సఖ్యముగను
మెలఁగి, కేంద్ర శాసనముల మీఱకుండ
నందఱును దలఁదాల్చెద రహరహమ్ము!
కాని, కోపమ్మునుం బెంచు ఖండితమగు
వచనములు వల్కఁగా గౌరవమ్మె చెడెను!! (7)

*
"నేను సీమాంధ్ర పక్షమే కాన, ప్రభుత
యే తెలంగాణ ప్రకటన నిపుడె తిరిగి
వెనుకకును దీసికొనుదాఁక వెనుక యడుగు
వేయ; నేను రాజీనామ చేయుటకును
జంకఁ బోను! క్రికెట్టున నింకఁ జివరి
బంతి నా చేఁత నున్నది! పరుగు లాఱొ,
యోడి పోవుటయో, చూచె దోయి నే" న
టంచుఁ బలుకంగ నిష్ఫలితమ్మె కలుగు! (8)

*
ఆటలో నోడిపోయెద నంచుఁ దెలిసి,
గెలిచె దంచును బలుకంగ గెలుపుఁ గనునె?
ఆట యెప్పుడో ముగిసెలే, యటఁ బ్రకటన
కేంద్రమే చేసె! తెలగాణ కిది సమయము!
హైదరాబాదుతోఁ గూడినట్టి రాష్ట్ర
మునొసఁగంగ మాటిచ్చెను గనుక, మాట
తప్పు నవకాశమే లేదటంచుఁ జెప్పె!! (9)

*
అవని విదీర్ణమైనను, హిమాద్రి చలించుటఁ గల్గినన్, మహా
ర్ణవ మది యింకినన్, దివసనాథుఁడుఁ, జంద్రుఁడుఁ దేజ మేదినన్,
నవ తెలగాణ రాష్ట్రము జనావళి మెచ్చియు, “జే” యనంగ, గౌ
రవయుత యయ్యు వచ్చును, విరాజిలుచుం జిఱునవ్వు తోడుతన్! (10)

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి