గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 24, 2016

మాతృభాషతోనే మనుగడ...

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వంసం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాదకరమైనది. ఒక జాతి సమూహం కోల్పోయిన వేటినైనా తిరిగి సాధించవచ్చు. కానీ.. భాషా సంస్కృతులు కోల్పోయిన జాతి సర్వస్వాన్ని కోల్పోయి బానిసత్వంలోకి పోతుందని హెచ్చరించాడు. ఈ వెలుగులో మనం మన తెలుగు భాషా వికాసానికి ప్రాధాన్యమిస్తూనే..సామాజికావసరాలకు అనుగుణంగా విద్యావిధానాలను రూపొందించుకోవాలి.

sama
మన దేశంలో విద్యావిధాన చరిత్ర ఓ పెద్ద విషాద గాథ. తరతరాల చరిత్రలో అందరికీ అందుబాటులో ఉండి సమాజంలో వెలుగులు పంచాల్సిన చదువు (విద్య) కొన్ని వర్గాలకే పరిమితమైపోయింది. మెజారిటీ ప్రజలను అక్షరాలకు ఆమడ దూరం చేసింది. ఆదిలో అది సంస్కృతం రూపంలో మెజారిటీ ప్రజలకు దూరమై, ప్రజలను అంటరాని వారిని చేసి అగ్రహారాలకే పరిమితమైతే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాక తర్వాత ఇంగ్లీష్‌రూపంలో ప్రజలకు అందనిదై పోయింది. ఈ క్రమంలో.. చదువు అందరికీ అందుబాటులోకి రావాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకోవడం ఆధునిక సమాజపు సహజ హక్కు. అయితే.. అందరికీ విద్య అందుబాటులోకి ఎలా వస్తుంది? దానికి అనుసరించాల్సిన విధానాలేమిటి? బోధనామాధ్యమం ఏమై ఉండాలి? ఓప్రత్యేక భాషా మాద్యమం(ఇంగ్లీష్)తో మాత్రమే ఆధునిక విజ్ఞానం సమకూరుతుందా?లాంటి ప్రశ్నలు మన ముందున్నాయి.

చరిత్రలో భారత సమాజంలోని విద్య, సాధించిన ప్రగతి ఫలాలు దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయి. మన సమాజం విద్యావిజ్ఞానంలో మిగతా ప్రపంచంతో పోల్చితే.. వెనకబడిందేమీ కాదు. ఇంకా వారి కన్నా ఒకడుగు ముందే ఉన్నామని చరిత్ర చెబుతున్నది. అయితే ఇది ఒక పార్శ్వం మాత్రమే. ఇలాంటి సామాజిక జ్ఞానాన్నంతా గతంలో అగ్రవర్ణ బ్రాహ్మణీయం తమ గుప్పిట్లో పెట్టుకుని సమాజానికి తీరని ద్రోహం చేసింది. అశేష ప్రజారాసులను అక్షరానికి అంటరాని వారుగా చేసి కాలానుగుణంగా వికసించాల్సిన జ్ఞానాన్ని అణచివేసింది, జనజీవితాన్ని అంధకారం చేసింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్‌లో అడుగుపెట్టే నాటికి దేశంలో మూలమూలనా దేశీ(వీథిబడులు, కాన్గి బడులు) విద్యావిధానం కొనసాగుతుండేది. అన్ని రకాల సమాజావసరాలను తీర్చేది. ఈ క్రమంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పుడు వీథి బడుల స్వచ్ఛంద బోధనా విధానం ఆచరణలో ఉన్నది. ఈ దేశీ విద్యావిధానం మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ చాప్లిన్ డాక్టర్ ఎ.బిల్ దృష్టిని ఆకర్షించింది. ఈ విధానంతో పేదలకు ఉచిత విద్యను అందించ వచ్చని గ్రహించి, ఆ విధానాన్నే ఇంగ్లాండులో ప్రవేశపెట్టించాడు. దీన్నే ఇంగ్లాండులో మానిటోరియల్ పద్ధతి అంటున్నారు. ఈ నేపథ్యంలోంచే తర్వాత కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయా ప్రావిన్స్‌ల్లో విద్యా విషయంలో సర్వే చేయించింది.

మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ థామస్ మన్రో విద్యా సర్వే చేయించి 1826 మార్చి 10న ప్రకటించాడు. ఆ సర్వే ప్రకారం మద్రాస్ ప్రావిన్స్‌లో 12,498 పాఠశాలలు, లక్షా 88వేల 650 మంది విద్యార్థులున్నారు. అలాగే బొంబాయి, కలకత్తా ప్రావిన్స్‌ల్లో కూడా విద్యా సర్వే చేయించారు. కలకత్తాలో అయితే.. ప్రతి 400 మంది జనాభాకు ఒక పాఠశాల ఉన్నది! ఈ విధమైన పరిస్థితే అటు, ఇటుగా దేశమంతా విస్తరించి ఉండేది. చాలా మంది అనుకుంటున్నట్లు, చెబుతున్నట్లు బ్రిటిష్ వారి రాకకు ముందు భారతీయ సమాజంలో విద్యా వికాసం లేదు, సమాజమంతా అంధకార బంధురం అన్నది ఎంత సత్యదూరమో అర్థం చేసుకోవచ్చు.

గ్రామీణ భారతంలో కానసాగుతున్న దేశీవిద్యను ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు విధాలుగా అవరోదంగా భావించింది. ఒకటి- దేశీవిద్య ప్రకృతితో మనుష్యుల సహజీవనానికి ప్రాధాన్యమిస్తుంది. రెండు- సహజవనరుల కనిష్ఠ వినియోగానికి ప్రాధాన్యమివ్వడమే కాదు, వస్తు వినియోగాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇది వస్తువులను అమ్ముకోవడానికి వచ్చిన బ్రిటిష్ వారికి పెద్ద అడ్డంకి అయ్యింది. ఈ అర్థంలో దేశీ విద్యను అంతం చేసి, వస్తు వినిమయాన్ని పెంచి పోషించే విద్య ఈస్ట్ ఇండియా కంపెనీకి అత్యవసరమైంది. సరిగ్గా ఈ సామాజికార్థిక అవసరాల్లోంచే మన దేశంలో బ్రిటిష్ (ఇంగ్లీష్) విద్యావిధానం పురుడు పోసుకున్నది.ఈ నేపథ్యంలోంచే చార్టర్ యాక్ట్, ఉడ్స్ డిస్పాచ్‌లు వచ్చాయి. దేశంలో ప్రవేశపెట్టబోయే విద్య గురించి ఉడ్స్ ప్రతిపాదనలు.. ఈస్ట్ ఇండియా కంపెనీకి విశ్వసనీయులైన, సమర్థులైన ఉద్యోగుల్ని సమకూర్చడం, భారత ముడి పదార్థాలతో బ్రిటన్ యంత్రాలతో తయారైన సరకులకు భారత్‌లో నిరంతరం గిరాకీ ఉండేలా చేయటం.. విద్య లక్ష్యంగా ప్రకటించాడు. ఈ లక్ష్యాలనే మరింత విస్తృత పరిచి గ్రాంట్, విలియం బెంటింగ్, మెకాలే తదితరులు తాము ప్రవేశ పెట్టిన విద్యావిధాన లక్ష్యాలను, ప్రయోజనాలను ఏ దాపరికం లేకుండా ప్రకటించుకున్నారు.

తాము ప్రవేశ పెడుతున్న విద్యతో.. రంగు రూపుల్లో భారతీయులుగా, ఆలోచనల్లో బ్రిటిష్ వారిగా తయారవుతారని చెప్పుకున్నారు. ఇంగ్లీష్ మాధ్యమ పరమార్థమంతా సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఉండే మానసపుత్రులను తయారు చేయడమే. మేధో బానిసత్వాన్ని సృష్టించుకోవడమే. సరిగ్గా ఈ సామాజిక సందర్భంలోనే.. మూలవాసుల సంస్కృతి వికాసాల గురించి మాట్లాడుతున్నామనే వారు కూడా మండే వేసవిలోనూ సూటుబూటు ధరించి ఇంగ్లీష్ భాషతోనే విముక్తి సాధ్యమంటున్న తీరును చూడాలి. సామాజిక విప్లవాల గురించి మాట్లాడే వారు కూడా ఇంగ్లీష్ భాషామాధ్యమాన్నే కోరుకోవడమే నేటి మహా విషాదం. 

ప్రపంచ వ్యాప్తంగా విద్యావ్యాప్తిలో సాధించిన విజయాలు, విజ్ఞాన ప్రగతి అంతా ఆయా ప్రజాసమూహాలు మాట్లాడుతున్న భాషలోనే సాగి, ఆయా దేశాల్లో తరాలుగా సంప్రదాయంగా వస్తున్న విద్యారీతుల పునాదులపైనే కొనసాగింది. ఉదాహరణకు ఇంగ్లాండులో అప్పటికి లోపభూయిష్ఠంగా ఉన్న స్వచ్ఛంద పాఠశాలల్ని అభివృద్ధి పరిచి విస్తరించడం ద్వారానే విద్యావ్యాప్తి జరిగింది.

కానీ మన దేశంలో మాత్రం మన సంప్రదాయ విద్యాబోధన రీతులు ధ్వంసం చేయబడ్డాయి. వీధి బడులు, కాన్గి బడుల విధానం కాలం చెల్లిన విధానమని చెప్పి స్వచ్ఛంద విద్యాబోధనా రీతులను పీక నులిమి చంపేశారు. అయితే.. భారతీయ సమాజం పట్ల బాధ్యతతో ఆలోచించిన బ్రిటిష్ అధికారులు లేకపోలేదు. 1819-27 కాలంలో బొంబాయి గవర్నర్‌గా ఉన్న ఎలిఫిన్‌స్టన్ నిజమైన అర్థంలో విద్యావ్యాప్తి ఎలా జరగాలో చెప్తూ.. విద్యాబోధన మాతృభాషలోనే జరగాలన్నాడు. దేశీయ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలన్నాడు. ఇంగ్లీష్‌ను ఒక సబ్జెక్టుగానే బోధించాలి గానీ.., మాధ్యమంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బోధించరాదని, దీనితో మేలుకన్నా భారతీయ సమాజానికి కీడే ఎక్కువని హెచ్చరించాడు. స్థానిక మాతృభాషలో కాకుండా పరాయి భాషా మాద్యమంలో విద్యాబోధన మేధోబానిసత్వాన్ని పెంపొందించడమే గాక, ప్రజల సాంస్కృతిక జీవనం చిన్నాభిన్నం చేస్తుందని హితబోధ చేశాడు.

తెలంగాణ సమాజ పునర్నిర్మాణం కోసం, వికాసం కోసం తపనపడుతున్న నేడు మన సామాజికావసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు పోవాలి. సమకాలీన పరిస్థితులు, తక్షణ అవసరాల నేపథ్యంలో..ఇంగ్లీష్ విద్యకు ప్రాధాన్యమివ్వాలని అంటున్న నేపథ్యంలో.. మనదైన సామాజిక, సాంస్కృతిక మూలాలను మరిచిపోవడం శ్రేయస్కరం కాదు. ఈ సందర్భంగానే.. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్లు.. ఒక జాతి భాషా, సంస్కృతుల విధ్వం సం ఆర్థిక దోపిడీ పీడనల కన్నా ప్రమాదకరమైనది. ఒక జాతి సమూహం కోల్పోయిన వేటినైనా తిరిగి సాధించవచ్చు.

కానీ.. భాషా సంస్కృతులు కోల్పోయిన జాతి సర్వస్వాన్ని కోల్పోయి బానిసత్వంలోకి పోతుందని హెచ్చరించాడు. ఈ వెలుగులో మనం మన తెలుగు భాషా వికాసానికి ప్రాధాన్యమిస్తూనే.. సామాజికావసరాలకు అనుగుణంగా విద్యావిధానాలను రూపొందించుకోవాలి. మేధో బానిసత్వంలో మునిగితేలుతున్న వారి మాటల ఉచ్చులో పడిపోరాదు. తెలంగాణ సమాజాన్ని శాశ్వత బానిసత్వంలోకి నెట్టే ప్రమాదాన్ని పసిగట్టాలి. దేశీ విధానంలో మాతృభాషలో విద్యబోధనే పరమోన్నతమైనదని గ్రహించాలి. అప్పుడే తెలంగాణ పునర్నిర్మాణ సత్వర సాఫల్యత చేకూరుతుంది.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి