గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 21, 2016

చెట్టులో మనిషి ప్రాణం


పూవుల నిచ్చేవి చెట్లు! ఫలముల నిచ్చేవి చెట్లు!
నీడను ఇచ్చేవి చెట్లు! కలపను ఇచ్చేవి చెట్లు!
ప్రాణం నిల్పేవి చెట్లు! ఆ చెట్లను పెంచకుండ
ఇండ్ల కొఱకు నరికెదేల? చెట్లు పెంచు సోదరా!
చెట్లను నువు పెంచకున్న... భవితయె నశియించునురా!
మానవాళి మనుగడకై... పచ్చదనం పెంచుమురా!!
-గుండు మధుసూదన్

చందమామ కథల్లో మాంత్రికుడి ప్రాణం చెట్టు తొర్రలో ఉందని తరచూ చదువు కునేవాళ్లం. అది నిజమో కాదో తెలియదు కానీ మనిషి ప్రాణం మాత్రం చెట్టులోనే ఉన్నదని ఇప్పుడు మనకు తెలిసివస్తున్నది. 

ఎండలు కొత్త కాదు కానీ, అవి నానాటికీ ముందుకు రావడం, తీవ్రస్థాయిలో ఉండటం కొత్త. ఏప్రిల్‌లో ఇటువంటి ఎండలు నాలుగు దశాబ్దాల తర్వాత చూస్తున్నామని ఒక అధికారి చెప్పారు. రుతువులు గతి తప్పుతున్నాయి. కాలాలు గతి తప్పుతున్నాయి. కరువు నిత్యకృత్యం అవుతున్నది. ఈసారి అసలు చలికాలం వచ్చినట్టు పోయినట్టు ఎవరికీ పెద్దగా అనుభవంలోకి రాలేదు. సంవత్సరమంతా ఎండలు చూస్తున్నాం. కాస్త ఎక్కువగా కాస్త తక్కువగా. ఏమి జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో ఒకసారి అందరూ మననం చేసుకోవలసిన అవసరమయితే కనిపిస్తున్నది. మనిషి ప్రాణం నీరులో ఉంది. నీరు ప్రాణం చెట్టులో ఉంది. చెట్టు ఉంటే గాలి. చెట్టు ఉంటే నీడ. చెట్టు ఉంటే నీరు. ఆ చెట్టు లేకుండా పోవడమే ఇప్పుడు అన్ని అనర్థాలకు దారితీస్తున్నది. 


shekar 

అభివృద్ధి, విధ్వంసం జమిలిగా ఉంటాయి. గత రెండు దశాబ్దాల్లో రహదారుల విస్తరణ పేర, గనుల తవ్వకం పేర, కార్ఖానాల ఏర్పాటు పేరిట, వ్యవసాయ విస్తరణ పేరిట రోడ్లవెంట ఉన్న మహావృక్షాలు, అడవులు, కంచెలు మాయమయిపోయాయి. వృక్షాలను కదిలించకుండా అభివృద్ధి చేసే ఆలోచనే మన విధానాల్లో లేకుండాపోయింది.


ఆ మధ్య థాయిలాండ్‌లో ఒక చారిత్రక నగరాన్ని సందర్శించాము. చియాంగ్మయి నుంచి లాంఫూన్‌కు వెళ్లే దారి అది. సుమారు పది కిలోమీటర్లు దారి పొడవునా రోడ్డుకిరువైపులా 40 నుంచి 50 అడుగుల ఎత్తైన యాంగ్ వృక్షాలు కనిపించాయి. ఆ చెట్లకు పసుపుపచ్చని వస్త్రాలు కట్టి దేవతల్లాగా పూజిస్తున్నారు. నడి ఊర్లలో కూడా, పెద్ద పెద్ద వ్యాపార సముదాయాల వద్ద సైతం ఒక్క చెట్టునూ కదిలించలేదు. ఇళ్లు కట్టుకున్నా, వ్యాపార సముదాయం కట్టుకున్నా చెట్టు జోలికెళ్లకుండా కట్టుకోవలసిందే. అక్కడ ఏ ఊరు చూసినా వనంలాగా కనిపించింది. ఇండ్ల కంటే పైకెదిగిన వృక్షాలు అధికంగా కనిపించాయి. అక్కడా ఒకప్పుడు అడవులను తీవ్రంగా ధ్వంసం చేసి, విపరీత పర్యవసానాలను చూసిన తర్వాత వృక్షజాతి సంరక్షణకు కఠినమైన చట్టాలు తెచ్చారు.

ఎంతో దూరం ఎందుకు? జర్మనీలో ఇంటి నిర్మాణం కోసం ఒక చెట్టును నరకాల్సివస్తే, అదే స్థానంలో రెండు అవే జాతి మొక్కలు నాటి, అవి కుదురుకునే వరకు, ఇంటి యజమాని వాటిని సంరక్షించాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తూంటుంది. ఒకప్పుడు మన రాష్ట్రంలోనే ప్రతిఊరిలో ఎక్కడపడితే అక్కడ చెట్లు ఉండేవి. 

చింతలతోపులు, మామిడి తోపులు, మర్రి, జువ్వి, రావి, వేపచెట్లు విరివిగా ఉండేవి. ఎండాకాలం వస్తే జనం చెట్లకిందికి చేరి ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. ప్రతిఊరికి రెండు మూడు వందల ఎకరాల కంచెలు ఉండేవి. కంచెల నిండా చెట్లు ఉండేవి. పశువులను మేపడానికి ఆదరువుగా ఉండేవి. జింకలు, కుందేళ్లు, అడవి పందులు దుముకుతూ ఉండేవి. ఇప్పుడవన్నీ అంతరించిపోయాయి. వనాలతోపాటే వానలు పోయాయి. చెరువులు నిండటం ఎప్పుడో అరుదుగా జరుగుతున్నది. ఏటా అలుగులు పోసిన బావులు, పిల్లల ఈతలకు కేంద్రంగా ఉండే బావులు ఇప్పుడు పాడుబడిపోయాయి. మర్రి చెట్లు, జువ్వి చెట్లు, రావి చెట్లు అరుదుగా కనిపిస్తాయి. చేలల్లో, గట్లల్లో, బావుల వద్ద అసలు చెట్లు లేకుండా పోయాయి. ఇప్పుడు నాగలి దున్నని చోటులేదు. ఊర్లు కాంక్రీట్ జంగల్‌లు అయ్యాయి. కరువు విరుచుకుపడుతున్నదంటే ఎందుకు పడదు? ఎవరిని నిందించాలి ఇప్పుడు? 


మరోవైపు అడవుల విధ్వంసం. తెలంగాణలో ఉన్నంత విశాలమైన దట్టమైన అరణ్యం ఒకప్పుడు ఆంధ్రలో లేదు. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే అవి కూడా చాలా చిన్నచిన్న చెట్లతో మాత్రమే మిగిలిఉన్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ దట్టమైన అరణ్యాలకు ప్రసిద్ధి. వరంగల్ అడవుల్లో ఒకప్పుడు ఏనుగుల సంచారం ఉండేదని చెబుతారు. ఇప్పుడక్కడ అడవి దొంగల సంచారం కనిపిస్తున్నది. 


చాలామంది రాజకీయ నాయకుల అండతో వరంగల్ జిల్లాలో అడవి అంతిమ దశకు చేరుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అడవుల ఆవశ్యకత గురించి, ఒక్కో మనిషికి ఉండాల్సిన చెట్ల సంఖ్య గురించి దేశదేశాల వివరాలు సేకరించి చెబుతున్నారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం గురించి పదేపదే నొక్కి చెబుతున్నారు. అటవీ సిబ్బందికి అవసరమైన సాధన సంపత్తి సమకూర్చుతున్నారు. కానీ నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో అడవుల నరికివేత ఆగలేదు. అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడులు ఆగలేదు. బండెనకబండి పదహారు బండ్లు కట్టి కలప తరలించుకుపోవడం ఆగలేదు. అడవుల విస్తీర్ణం నానాటికీ హరించుకుపోతున్నది. అడవుల విస్తీర్ణం పెంచడం కాదుకదా ఇప్పుడున్న శాతం కూడా కాపాడలేని పరిస్థితి. మనిషి ప్రాణానికి ఇచ్చిన విలువను చెట్టు ప్రాణానికి ఇచ్చే చట్టాలు చేయకపోతే భవిష్యత్తు తరాలు మనలను క్షమించవు. చెట్టును ముట్టుకోవడానికి మనిషి భయపడే రోజు రావాలి. అలా చేయనంతకాలం కూర్చోవడానికి నీడ, పీల్చుకోవడానికి గాలి, తాగడానికి నీరు లేక విపరీత ఉత్పాతాలను ఎదుర్కోవలసిన పరిస్థితి తలెత్తుతుంది. 

ఎంత విజ్ఞానం, ఎన్ని ఆవిష్కరణలు, ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషిని ఎవరూ రక్షించలేరు. అమెరికానే మనకు ఉదాహరణ. అత్యంత ఆధునిక దేశం, టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్న అమెరికాలో ఈరోజు కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తే అతలాకుతలం అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రకృతి అసమతౌల్యం ఏర్పడిన ప్రతిచోట పరిస్థితి అలాగే ఉంది.

వెనుకటికి జనం కలరా వంటి మాయరోగాలు వచ్చి చనిపోయేవారు. ఇప్పుడు కరువులకు,వడగాడ్పులకు పిట్టల్లా రాలిపోతున్నారు. పల్లె పట్నం తేడా లేదు. హైదరాబాద్ గురించి ఒకప్పుడు కాశీయాత్రా చరిత్రలో ఏనుగుల వీరాస్వామయ్య చాలా గొప్పగా చెప్పారు. ఉద్యానవనాలు, పండ్లతోటలు, పచ్చని మైదానాలు ఎక్కడ చూసినా భవనాలను కప్పేసే వృక్షాలు ఉండేవని ఆయన రాశారు. అప్పటిదాకా ఎందుకు, 1970, 80 దశకాల్లో ఇంత ఉష్ణోగ్రతలు లేవు. ఎక్కడ చూసినా గ్రీన్ స్పేసెస్ ఉండేవి. వసంతం వచ్చిందంటే రోడ్లవెంట గుల్‌మొహర్ పూలు తివాచీ పరచినట్టు పరుచుకుని ఉండేవి. సాయంత్రం అయితే వాతావరణం చల్లబడేది. ఎండాకాలంలో కూడా వర్షపు జల్లులు పలకరించిపోయేవి. వర్షాలు విరివిగా కురిసేవి. కానీ నగరంలో ఇప్పుడు ఖాళీ స్థలాలు లేవు. రోడ్ల వెంట చెట్లు లేవు. విస్తరణ, ఆధునీకరణ పచ్చదనాన్ని మింగేసింది. నగరీకరణ ఒత్తిడి, అస్తవ్యస్థ పాలన కారణంగా కమ్యూనిటీ స్థలాలు సైతం అన్యాక్రాంతమైపోయాయి. చివరికి కొండలు గుట్టలు ఏవీ ఆక్రమణల నుంచి తప్పించుకోలేకపోయాయి. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఉన్నంత లాండ్ బ్యాంకు దేశంలో మరే నగరానికీ లేదు. సమైక్యపాలనలో ఒక విధంగా లూటీ అయిపోయింది. ఇవ్వాళ ఎక్కడ చూసినా భవంతులే భవంతులు. ప్రభుత్వం ఏదైనా కొత్త కార్యాలయం కట్టాలంటే స్థలం దొరకడం కష్టమైపోతున్నది. వందలాది చెరువులు అంతరించిపోయాయి. ఉన్న చెరువులు కూడా కుంచించుకుపోయాయి. నీరు ఇంకడానికి ఖాళీ స్థలాలు లేవు. ఇక భూగర్భ జలాలు ఎలా ఉంటాయి. ఇవ్వాళ రెండు వేల అడుగుల కంటే ఎక్కువ లోతుకు తవ్వుతున్నారు. నమస్తే తెలంగాణకు సమీపంలో మూడు రోజులుగా ఒకే బోరుబండి నీటికోసం తవ్వుతూనే ఉంది. భూమికి చిల్లు పడుతుందేమో అని ఒక మిత్రుడు కామెంట్ చేశాడు. భూమికి చిల్లు పడుతుందో లేదో కానీ నీరు మాత్రం ఇంకా దొరకలేదు. 

నగరంలో మొక్కల పెంపకం ఒక ప్రహసనమే. కొన్ని ఏళ్లుగా ఏటా లక్షలాది మొక్కలు నాటుతున్నట్టు, పట్టణ సామాజిక అడవులు పెంచుతున్నట్టు ప్రకటించడం చివరికి వచ్చేసరికి ఎక్కడా అవి కనిపించకపోవడం అనుభవంలో ఉన్నదే. మొక్కలు పెట్టగానే కాదు. వాటిని పెంచడానికి నీళ్లు కావాలి. సిబ్బంది కావాలి. లేదంటే ప్రజలయినా ముందుకు వచ్చి పట్టించుకోవాలి. ఇవి రెండూ సాధ్యం కావడం లేదు. అందుకే ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. కాలం వెనకకుపోతూనే ఉంది. రుతువులు చెదిరిపోతూనే ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఒకటి అర్థం అవుతుంది-చెట్టు, నీరు, గాలి, ఖాళీ స్థలాలు పరస్పరాధారితాలు. మొత్తం సమాజం ఈ అంశంపై దృష్టిపెడితే తప్ప ముందు ముందు ఈ గండం నుంచి తప్పించుకోలేము. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కరెంటు కష్టాలు లేకుండా చూస్తున్నది. ఏవో ఏసీలు, కూలర్లు నడుస్తున్నాయి కదా అని ఊపిరి పీల్చుకుంటుండవచ్చు. కానీ పచ్చదనాన్ని ఇచ్చే చెట్ల ధ్వంసం ఇలాగే కొనసాగి, ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ పోతే ఏ ఏసీలు, ఏ కూలర్లూ మానవజాతిని కాపాడలేవు. మానవ మనుగడకే ముప్పు ఏర్పడే దుస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఇప్పటికీ మన చేతుల్లోనే ఉంది.
kattashekar@gmail.com


జై తెలంగాణ!     జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి