గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

అసమగ్ర తెలంగాణ రాష్ట్రంలో....స్వంత హైకోర్టు ఎండమావియేనా?

రేపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ పతాకం జేగీయమానంగా ఎగిరినట్లయితే హైదరాబాద్ నగరం తెలంగాణ నగరం కాదన్న విష ప్రచారానికి మూడు పార్టీలు, విశేషించి మోదీయుల కూటమి, పచ్చమీడియా పడగ విప్పి బుసలు కొట్టే ప్రమాదముండదు. వరంగల్లు విజయం స్ఫూర్తితో ఇటువంటి ప్రమాదాలను నివారించక తప్పదు.


"WE ARE ALL PROUD OF THE HAPPY OCCASIoN WHEN THE ANDHRA STATE CAME INTO EXISTENCE, THERE WAS A FEELING OF INCOMPLETENESS. BUT NOW WITH THE CONSTITUTION OF THE HIGH COURT, THE LONG STANDING DESIRE AND ASPIRATIONS OF THE ANDHRAS HAVE BEEN FULFILLED.."

rao


ఇవి కోకా సుబ్బారావు గారి మాటలు: 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తర్వాత తొమ్మిది నెలలకు, 1954 జూలై 5వ తేదీన గుంటూరులో ఆంధ్రరాష్ట్రం హైకోర్టు ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి దేశ వ్యవహారాల శాఖామంత్రి కైలాస్ నాథ్ కట్జూ ఆంధ్రరాష్ట్రం హైకోర్టును ప్రారంభించారు. ఆంధ్రరాష్ట్ర హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. గుంటూరులో తమ హైకోర్టు ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ కోకా సుబ్బారావు పైన ఉదహరించిన మాటలు అన్నారు - "ఆంధ్రరాష్ట్రం అవతరించిన ఈ తరుణం మనందరికీ గర్వకారణం, సంతోషదాయకం. కానీ, అసమగ్రతా భావం వ్యక్తమైంది. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటు కావడంతో ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేరింది..." కోకా సుబ్బారావు మాటల తాత్పర్యం ఇది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినందుకు గర్వించినా, సంతోషపడినా హైకోర్టు ఏర్పాటు కాకపోవడంవల్ల రాష్ట్రం అసమగ్రం అన్న భావం వ్యక్తమైందని సుబ్బారావు అన్నారు. 


హైకోర్టు ఏర్పాటుతో రాష్ట్రం సంపూర్ణ స్వరూపం ధరించిందన్న అభిప్రాయం ఆయన మాటల్లో ప్రస్ఫుటమైందనడంలో అనుమానం లేదు. 28 నెలల తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గుంటూరులోని ఆంధ్రరాష్ట్ర హైకోర్టు వెంటనే (ఎంతమాత్రం ఆలస్యం కాకుండా) రాజధాని హైదరాబాద్‍కు వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం హైకోర్టు, ఆంధ్రరాష్ట్రం హైకోర్టు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. తరువాత ఆయన సుప్రీంకోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి 1967లో రిటైరయ్యారు. అదే సంవత్సరం ఆయన ప్రతి పక్షాలన్నింటి ఉమ్మడి అభ్యర్థిగా మూడవ రాష్ర్టపతి పదవికి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్రంతో పాటు హైకోర్టు కూడా ఏర్పాటు కాకపోవడం వల్ల రాష్ర్టం అసమగ్రమైనదన్న భావం కలిగిందన్న ఆయన మాట విలువైనది, గమనార్హమైనది. హైకోర్టు లేనందువల్ల రాష్ట్రం అసమగ్రమైనదన్న అభిప్రాయం, అసంతృప్తి సహజమైనవి, సహేతుకమైనవి.

మరి ఇప్పుడో...? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా... రాష్ట్రంతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా ఏర్పాటు కాకపోవడం... తెలంగాణ ప్రజలకు అసంతృప్తి కల్గిస్తుంది కదా! తమకు అరవై సంవత్సరాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా లభించిన రాష్ట్రం అసమగ్రమైనదన్న భావం (హైకోర్టు ఏర్పాటు కానందువల్ల) తెలంగాణ ప్రజలకు కూడా కలుగుతుంది కదా! కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన పిదప తొమ్మిది మాసాలకే గుంటూరులో ఆంధ్ర హైకోర్టు ఏర్పాటైంది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పందొమ్మిది నెలలైనా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కావడం లేదు. పందొమ్మిది నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం, పార్లమెంటు సభ్యులు, న్యాయవాదులు (ఉద్యమం కూడా నిర్వహిస్తూ), తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏక కంఠంతో తెలగాణ హైకోర్టు కోసం నిర్విరామ, నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. హైకోర్టు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశారు. హైదరాబాద్‌లో కొంతకాలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెట్టుకోవడానికి భవనాలు తదితర అన్ని సదుపాయాలు సమకూర్చుతామని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు. 


కానీ... కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం వాగ్దానాలు చేస్తూ, వాయిదాలు వేస్తూ, మభ్యపెడుతూ, మాటల మిఠాయిలు తినిపిస్తూ కాలక్షేపం చేస్తున్నది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణ హైకోర్టు ఏర్పాటు మీద చేసిన ప్రకటనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర విభజన ఇష్టంలేని మోదీయులకు విభజన చట్టాన్ని అమలు జరపడంలో అసలే ఆసక్తి లేదు. అరవై సంవత్సరాల కిందట ఆంధ్ర రాష్ర్టానికి అయాచితంగా తొమ్మిది మాసాలలో వచ్చిన హైకోర్టు తెలంగాణ రాష్ర్టానికి పందొమ్మిది మాసాలైనా ఎందుకు రావడం లేదు? అరవై సంవత్సరాల కిందట అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమర్థత, కార్యదక్షత, నిష్పాక్షికత ఇప్పటి మోదీ ప్రభుత్వంలో కొరవడ్డాయనుకోవాలా? స్వాతంత్య్రానంతరం కేవలం ఆరు సంవత్సరాలకు కేంద్రంలో ఉన్న పరిపాలనా యంత్రాంగం, కమ్యూనికేషన్ సదుపాయాలు, పాలనా నైపుణ్యంతో పోల్చినప్పుడు ఇప్పటి పరిపాలనా యంత్రాంగం, కమ్యూనికేషన్ వ్యవస్థ, పాలనా నైపుణ్యం నిజానికి ఎన్నో రెట్లు మెరుగుపడ్డాయి.

అయినా...

అప్పుడు తొమ్మిది మాసాలకే నెరవేరిన పని (హైకోర్టు ఏర్పాటు)... ఇప్పుడు పందొమ్మిది మాసాలైనా... ఎందుకు కావడం లేదు? మినిమమ్ గవర్నమెంట్ - మాగ్జిమమ్ గవర్నెన్స్ నినాదంతో మోదీయులు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ నినాదం మాగ్జిమమ్ గవర్నమెంట్ - మినిమమ్ గవర్నెన్స్‌గా మారిందా? మాటలే గాని చేతలు లేవు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం, టీం ఇండియా నినాదాలతో మోదీ ప్రభుత్వం ముచ్చట్లు చెబుతున్నది. మోదీ ప్రభుత్వం నిజానికి రాష్ట్రాలకు రాష్ట్ర పార్టీలకు విలువ ఇవ్వడం లేదు. అందువల్ల, తెలంగాణ హైకోర్టు ఎండమావి అవుతున్నది. అవిభక్త రాష్ట్ర ఉద్యోగుల విభజనలో కమల నాథన్ కమిటీ ఒక అంగుళమైనా ఎందుకు ముందడుగు వేయడం లేదు? నదీ జలాలలో న్యాయంగా తెలంగాణ వాటా ఎందుకు లభించడం లేదు? గత పందొమ్మిది మాసాలలో మోదీ ప్రభుత్వం ఆంధ్రకు ఇచ్చింది ఎంత? తెలంగాణకు ఇచ్చింది ఎంత? వీటిపై ఒక శ్వేతపత్రం ప్రకటించి వివరిస్తారా మోదీయులు? ఇచ్చింది ఏమీ లేదు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే: తెలంగాణ ఏడు మండలాలను (ఖమ్మం జిల్లాలో) కబళించడం, ఆంధ్రకు దత్త పరచడం! ఆంధ్ర మీద ప్రేమ, తెలంగాణ పట్ల ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంతో పాటే తమ హైకోర్టు ఏర్పడాలన్నది తెలంగాణ ప్రజల ప్రగాఢ వాంఛ. దీనిని కేంద్రం గుర్తించడంలేదు. ఏడు మండలాల కబళింతతో కుట్రలు ఆగడం లేదు! తెలంగాణ నడి గడ్డ మీద ఉన్న హైదరాబాద్ నగరం తెలంగాణ గుండె. ఈ వాస్తవాన్ని హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసిన వారు, ఉమ్మడి రాజధానిలో తెలంగాణ హక్కులను విస్మరించి సెట్లర్ల హక్కులు, ప్రయోజనాల కోసం అహర్నిశలు ఆరాట పడుతున్న వారు గుర్తించడం లేదు. హైదరాబాద్ నగర పాలనను ఉమ్మడి గవర్నర్‌కు అప్పగించాలన్న కుట్ర తెలంగాణ మెడ మీద కత్తిలా వేలాడుతున్నది. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి సంస్థలు, తెలంగాణ హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించడానికే. ఆంధ్ర న్యాయమూర్తుల సంఖ్య అధికంగా ఉన్న ఉమ్మడి హైకోర్టులో గత పందొమ్మిది మాసాలలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహుశా ఇరవై కంటే ఎక్కువ స్టే ఆర్డర్లు జారీ అయి ఉంటాయి. హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ ప్రజల సొత్తు కాదన్న దుష్ప్రచారం జరుగుతున్నది. తెలగాణ అస్తిత్వ భావం, తెలంగాణ వాదం హైదరాబాద్ నగరంలో బలంగా లేవన్న తప్పుడు ప్రచారం జరుగుతున్నది. 

సెట్లర్లు ఎంతమంది ఉన్నా, దొంగ ఓటర్లు ఎంత మంది ఉన్నా, మొదటి నుంచి తెలంగాణ సెంటిమెంట్‌కు కేంద్రం హైదరాబాద్ నగరమే. 1969-70 ఉద్యమకాలంలో బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఒత్తిడులు తెచ్చినా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాడు నాయకత్వం వహిస్తున్న తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి లక్ష్మీనారాయణ హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికైనారు. కలకత్తా బెంగాలీల, ముంబై మహారాష్ట్రల, చండీగఢ్ పంజాబీల, బెంగుళూరు కన్నడిగుల, తిరువనంతపురం మళయాళీల నగరాలైనట్లు... హైదరాబాద్ తెలంగాణుల నగరం. హైదరాబాద్‌లో ఆంధ్రుల సంఖ్య ఎంత అన్నది ముఖ్యం కాదు - తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాలు ముఖ్యం. నిద్రలో సైతం సెట్లర్ల యోగక్షేమాల కోసం కలవరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, ముఖ్యంగా కేంద్రంలో పెత్తనం చేస్తున్న బీజేపీలు... తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తి పోయడం... ఒక రోజు ఆపి, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ నదీ జలాలు, తెలంగాణ నిధులు, తెలంగాణ ఉద్యోగాల కోసం ఢిల్లీ లో, కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు? మోదీ ప్రభుత్వంలో... బీజేపీ, టీడీపీలు ప్రధాన భాగస్వామ్య పక్షాలనా? 


ఈ రెండు పార్టీల లోకల్ నేతలు తెలంగాణ హైకోర్టు కోసం, తెలంగాణ ఇతర హక్కులు, ప్రయోజనాల కోసం గత పందొమ్మిది మాసాలలో చేసిందేమిటి? ఏమీ లేదు. రేపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ పతాకం జేగీయమానంగా ఎగిరినట్లయితే హైదరాబాద్ నగరం తెలంగాణ నగరం కాదన్న విష ప్రచారానికి మూడు పార్టీలు, విశేషించి మోదీయుల కూటమి, పచ్చమీడియా పడగ విప్పి బుసలు కొట్టే ప్రమాదముండదు. వరంగల్లు విజయం స్ఫూర్తితో ఇటువంటి ప్రమాదాలను నివారించక తప్పదు.


ఈ వ్యాసం పూర్తి వివరాలకై: దీనిపై క్లిక్ చేయండి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!



4 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

మిత్రులు మధుసూదన్ గారు,

"సెట్లర్లు ఎంతమంది ఉన్నా, దొంగ ఓటర్లు ఎంత మంది ఉన్నా.." అన్న దానిపై స్పందించవలసి వస్తున్నదండీ. అంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక, డెబ్బదియవ దశకంలో నాకు హైదరాబాదులో ఉద్యోగం‌రావటం వలన ఇక్కడకు వచ్చి స్థిర్తపడవలసి వచ్చింది. హైదరాబాదు నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధానిగానే పరిగణన. అలాగే‌ పరిగణించి అనేకులు నాలాగే ఉద్యోగాల కారణంగా వచ్చి స్థిరపడ్దారు. వారందరికీ ఏదో ఈ నగరాన్ని ఆక్రమించేద్దాం దోచేద్దాం అన్న ఆలోచన ఉండదు కదండీ. కాని పొట్టచేత్తో పట్టుకొని వచ్చినది నేరం అన్నట్లుగా మాటిమాటికీ‌ సెటిలర్లు అనిపిలిపించుకోవటం ఆవేదన కలిగిస్తుంది. భవిష్యత్తును చూడగలిగి ఉంటే రాకపోయి ఉండేవారమూ - మాటలు పడకపోయి ఉండేవారమూ‌ కదా అనిపిస్తుంది. భారతదేశపూరులకు దేశంలో ఏ ప్రాంతంలో ఐనా నివసించే హక్కు ఉంటుందని అనుకుంటాను. ఒకప్పుడు పుట్టినగడ్డ యావత్తు తెలుగునేలా అనుకున్నాం కాని అందులో‌ ఫలాని ముక్కలో మాది కాదు అందులో ఉండటం వలన అవమానాలు ఎదురుకోవలసి వస్తుంది అన్న స్పృహ లేదు - ఉండే అవకాశమూ లేదు. అంతా విధికృతం.

శ్యామలీయం చెప్పారు...

కారణాంతరాల వలన, వ్యాఖ్య పూర్తికాకుండా ముగించాను. ఇంకా ఒకటి రెండు మాటలు చెప్పవలసి ఉంది. మన్నించండి.
ఏవిధంగా ఉదరపోషణార్థం ఉద్యోగనిమిత్తంగా హైదరాబాదు వచ్చానో అలాగే కుటుంబవసరాల నిమిత్తం అమెరికా వెళ్ళవలసి వచ్చింది. ఆ అవసరాలు తీరాక తిరిగి వచ్చేసాను. నాది అనుకున్న గడ్డ మీద, త్వరలోనే నన్ను పరాయి వాడివి అంటారన్న సంగతి నాకు తెలియదు కదా! ఒకవేళ తెలిసి ఉంటే పరాయివాడు అనిపించుకుందుకు ఎక్కడుంటేనేం?‌ అమెరికా నుండి తిరిగి రాకపోదునేమో. గతజలసేతుబంధనానికి ఇప్పుడు వగచి ప్రయోజనం లేదు కాని తరచు సెటిలర్ అని ఎవరైనా అంటే మనస్సు చివుక్కుమంటుంది. చేసేందేం‌ లేదు కదా. దైవానుగ్రహం ఇలాగుంది!

శ్యామలీయం చెప్పారు...

మిత్రులు మధుసూదన్ గారు,
నేను పంపిన (రెండు విడతల) వ్యాఖ్యను మీరు ప్రచురించనవసరం లేదనుకుంటానండీ. ఇలాంటి విషయాలమీద చర్చల వలన ఎవరికీ ఉపయోగం లేదని అనుకుంటున్నాను. ఏదో‌ బాధకలిగి వ్రాసాను. పోనివ్వండి. మీకు నామాటలు గ్లాని కలిగిస్తే మన్నించండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులు శ్యామలరావుగారికి నమస్సులు!

ఈ వ్యాసంలో మీరు బాధపడవలసిన అంశం ఏదీ లేదు. తెలంగాణులు తమ అక్కసును ఆంధ్ర ప్రజలపై చూపరు. తమకు అన్యాయం చేసిన పాలకులపై చూపుతారు. కాబట్టి మీరు చింతించవలదు. ఇది దుర్మార్గులు చేసిన దుష్కృతం. అందుకే నిరంతరమూ తెలంగాణులకు ఆ పాలకులు చేసిన పని ములుకులా గాయాన్ని రేపుతూనేవుంటోంది. అలాంటి పరిస్థితులుకు కూడా మళ్ళీ మళ్ళీ దాపురిస్తూనే వున్నాయి. ఏం చేస్తాం...! స్పందించినందుకు ధన్యవాదాలతో...స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి