గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 03, 2015

తెలంగాణ తురాయి... కందుకూరు...!!!

-పుష్కలంగా క్వార్ట్, ఫెల్స్‌ఫర్ నిక్షేపాలు
-కోట్ల విలువైన ముడిఖనిజం విదేశాలకు ఎగుమతి
-అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణకు ఖ్యాతి
గోల్కొండ వజ్రాలకు పేరుగాంచింది. ఈ ప్రాంతంలో దొరికిన వజ్రాలు రాజులు, సామ్రాట్టుల కిరీటాలను అలంకరించాయి. కోహినూర్ తదితర వజ్రాలు ఇందుకు సాక్ష్యం.. ఇది చరిత్ర.. హైదరాబాద్‌తోపాటు దానిని ఆవరించుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా వజ్రాలు, ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతం. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంతోపాటు కుత్బుల్లాపూర్, మహేశ్వరం మండలాల్లో క్వార్ట్, ఫెల్స్‌ఫర్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లుగా జియాలజీ, మైనింగ్ శాఖ తేల్చింది. ఈ మండలాల్లో 30రకాలకు పైగా ముడిఖనిజాలు విరివిగా లభిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డిల్లోని ఖనిజ సంపద గురించి ఉమ్మడిరాష్ట్రంలో ప్రపంచానికి అంతగా తెలిసేది కాదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదు. వజ్రాల వల్ల ఒకనాడు గోల్కొండ ప్రపంచఖ్యాతిని ఆర్జించినట్లు, ఈ ఖనిజ సంపదతో రంగారెడ్డి జిల్లా అంతర్జాతీయ దృష్టిని విస్తృతంగా ఆకరిస్తున్నది. 

ఇది వర్తమానం..గ్రేటర్ హైదరాబాద్ శివారున రంగారెడ్డి జిల్లాలో ఉన్న కందుకూరు మండలంలోని మూడు గ్రామాల పరిధిలో కోట్ల రూపాయల బి గ్రేడ్ క్వార్ట్, ఫెల్స్‌ఫర్ ఖనిజ నిక్షేపాలున్నాయి. వందల రకాల వస్తువుల తయారీకి ఇక్కడి ఖనిజాన్ని ముడిసరుకుగా వాడుతున్నారు. ప్రధానంగా అద్దాల తయారీ పరిశ్రమలో వినియోగిస్తున్నారు. పేరున్న గ్లాస్ పరిశ్రమలు పోటీపడి మరీ ఇక్కడి ముడిసరుకునే తెప్పించుకుంటున్నాయి. తమిళనాడులోని గ్లాస్ పరిశ్రమకు ఇక్కడి నుంచే ముడిసరుకు సరఫరా అవుతున్నది. కందుకూరు ఖనిజాలకు దేశ విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలోని ఏడు క్వారీ యూనిట్లు క్వార్ట్, ఫెల్స్‌ఫర్ ఖనిజాల్ని వెలికి తీస్తున్నాయి. 

quary






క్వార్ట్, ఫెల్స్‌ఫర్ ఒకేరకానికి చెందినవి. క్వార్ట్‌లో కొంతమేర సిలికాన్ పర్సంటేజీ ఎక్కువగా ఉంటే, ఫెల్స్‌ఫర్‌లో పోటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. నాణ్యమైనదిగా తేలిన ఫెల్స్‌ఫర్, క్వార్ట్‌ను గ్లాస్ పరిశ్రమల్లో వాడుతున్నారు. నాసిరకం ఫెల్స్‌ఫర్‌ను టైల్స్ తయారీ కోసం పరిశ్రమలు ఏరికోరి తీసుకుంటున్నాయి. 2014 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లానుంచి 10,1190 టన్నుల క్వార్ట్, 48, 1185 టన్నుల ఫెల్స్‌ఫర్‌ను ఎగుమతి చేశారు. కందుకూరులో 9.46హెక్టార్లలో, మురళీనగర్‌లో 9.28 ఎకరాల్లో, గూడూరులో 8.05 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. వ్యవసాయయోగ్యం కాని పట్టాభూముల్లో సైతం ఇటీవలి కాలంలో ఖనిజాలకోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. క్వార్ట్ రకం పలుగురాయి టన్నుకు రూ.750 నుంచి 1000 వరకు ధర పలుకుతుండగా, సెల్ప్‌ఫర్‌కు కూడా అదే స్థాయి డిమాండ్ ఉంది.


కందుకూరు ఖనిజానికే డిమాండ్


సాధారణంగా మిగతా క్వారీల్లో దొరికే పలుగురాయి 50 గ్రాముల నుంచి అర కిలోవరకు మాత్రమే ఉంటుంది. ఇది వస్తువుల తయారీకి పనికిరాదు. కేవలం ముగ్గురాయిగా మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. నాణ్యత తక్కువగా ఉండటంలో తవ్వకాల సమయంలోనే ఖనిజం స్వరూపాన్ని కోల్పోయి పౌడర్‌గా మారిపోతుంది. కాని కందుకూరులో దొరికే ఖనిజం నాణ్యమైనది. ఒక్కో పలుగురాయి అరకిలో నుంచి 50 కిలోల బరువు ఉంటుంది. దీంట్లో మూలకాలు విరివిగా లభిస్తాయి. వస్తూత్పత్తికి ఇది అనుకూలంగా ఉంటుంది. దీంతో గాజు గ్లాస్ పరిశ్రమలు రంగారెడ్డి ఖనిజాన్నే డిమాండ్ చేసి మరీ తెప్పించుకుంటున్నాయి.


200 వస్తువుల తయారీలో..


కందుకూరు ఖనిజాన్ని దాదాపు 200 రకాల వస్తువుల తయారీలో వినియోగిస్తున్నారు. ముగ్గురాయి నుంచి మొదలుకుని టేబుల్ గ్లాస్ నుంచి విమానాల తయారీ వరకు దీనిని ముడిసరుకుగా వాడుతున్నారు. బీరుసీసాలు, పింగాణి వస్తువులు, ఖరీదైన గ్లాస్‌ను తయారుచేస్తున్నారు. ఇక్కడి ఖనిజాన్ని నల్లగొండ, పాలమూరు జిల్లాల్లోని పలు పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నాయి. కొన్నవాటిలో అత్యధిక భాగాన్ని ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడి నుంచి మొదట వైజాగ్, కాకినాడ, మద్రాస్‌లకు తరలించి తరువాత అక్కడి నుంచి విదేశాలకు పంపిస్తున్నారు. 


చెన్నైలోని గ్లాస్ పరిశ్రమల్లో ఇక్కడి క్వార్ట్, ఫెల్స్‌ఫర్‌లే వాడుతున్నారు. గతంలో ఇక్కడ లభించిన ఖనిజాన్ని హైదరాబాదు పరిసర ప్రాంతాలకు తీసుకుపోయి ముగ్గురాయి కోసం పౌడరు చేసేవారు. దీంతో కందుకూరు, మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ గ్రామాల్లో తలకొండపల్లిలో పలు పౌడర్ పరిశ్రమలు వెలిశాయి. ఈ పౌడరును వినియోగించి పింగాణి వస్తువులు, గృహాలంకరణ వస్తువులు తయారుచేసేవారు. ఇప్పుడు ముడిఖనిజానికి డిమాండ్ పెరగటంతో క్వారీ యాజమానులకు కాసుల పంట పండుతున్నది. తహసీల్దార్ నుంచి ఎన్‌ఓసీ రాగానే క్వారీలు వెలుస్తున్నాయి. టన్నుల కొద్దీ ఖనిజం ఎగుమతి అవుతున్నది. ఒక్కో టన్ను ముడిఖనిజంపై రూ. 42 రాయల్టీగా ప్రభుత్వానికి చెల్లించి తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు వందల మంది స్థానికులకు ఉపాధి లభిస్తున్నది. ఈ ఎగుమతులతో కూడా తెలంగాణ పేరు అంతర్జాతీయ విపణితో మరోమారు మార్మోగడం ఖాయం.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి