గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 20, 2015

బరితెగించిన ఆంధ్ర బాబు...!!!

-అర్ధరాత్రి టీ న్యూస్ కార్యాలయంలోకి ఆంధ్రా పోలీసుల చొరబాటు
-చంద్రబాబు టేపులు ప్రసారం చేసినందుకు నోటీసులు
-ఇది మీడియా స్వేచ్ఛను హరించడమేనన్న తెలంగాణ జర్నలిస్టులు
-తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా పోలీసుల జోక్యం ఏమిటని నిలదీత


ramana

చంద్రబాబు బరితెగించాడు! తెలంగాణపై అడ్డదారిలో యుద్ధం ప్రకటించాడు! ఇన్నాళ్లూ ముసుగు చాటున దాచిన ఆంధ్రా ఖల్‌నాయక్‌ను బయటకు తీశాడు! ఓటుకు నోటుకేసునుంచి బయటపడేందుకు వేసిన ఒక్కొక్క ఎత్తుగడ విఫలం కావడంతో ఇపుడు రెండు రాష్ర్టాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించే ఎత్తుగడ వేశాడు. ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమని తేలిపోవడం, ఆడియో టేపులు అతికించినవన్న వాదనలు వీగిపోవడం, సెక్షన్ 8 సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేయడం, గవర్నర్‌పై చేసిన విమర్శలు ఉరితాడై మెడకు చుట్టుకోవడంతో తెలంగాణ ఆంధ్ర మధ్య చిచ్చుకు కొత్త ఎత్తుగడ వేశాడు. తెలంగాణ ప్రజల గొంతుకగా పని చేస్తున్న టీ న్యూస్‌కు నోటీసులు పంపడం ద్వారా దానికి బీజం వేశాడు. తమ అధికార పరిధిలో కూడా లేని హైదరాబాద్‌లో ఆంధ్రా పోలీసులను పంపడం ద్వారా తాను అన్నింటికీ తెగించానని ప్రకటించుకున్నాడు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో అక్రమ అరెస్టు సందర్భంలో జయప్రకాశ్ నారాయణ్ చెప్పిన .వినాశకాలే విపరీత బుద్ధి అనే మాటను ఇపుడు చంద్రబాబు చర్య గుర్తు చేస్తున్నది. 

babu

ఆంధ్రబాబు మారడు. మారడు గాక మారడు. ఓటుకు నోటు కేసులో ఇక తప్పించుకునే అవకాశం లేకపోవడంతో తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాల మధ్య యుద్ధం సృష్టించే ఎత్తుగడ వేశాడు. నిన్నటి దాకా వివిధ సాకులు అడ్డం పెట్టి తప్పించుకోవాలనుకున్న ఎత్తుగడలు అన్నీ విఫలం కాగా చివరగా కేంద్రం హెచ్చరికతో గవర్నర్‌పై దాడులు ఆపేసి నేరుగా తెలంగాణపైనే దాడికి దిగాడు. తెలంగాణ గొంతుకగా పేరు పొందిన టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేశాడు. ఒకనాడు సీఎం పదవికోసం సీమాంధ్రనాయకులు హైదరాబాద్ నగరంలో మారణ హోమం సృష్టించారు. ఇపుడు చంద్రబాబు తనను రక్షించుకోవడానికి మరో దారుణానికి తెగించాడు. ఆరిపోయే దీపానికి మంట ఎక్కువ అన్న సామెతను సార్థకం చేసుకుంటున్నాడు.
అర్ధరాత్రి నోటీసులు..:
ఓటుకు నోటు కేసులో కీలకంగా మారిన ఆడియో, వీడియో టేపులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలంటూ ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు ఎక్కడా నిబంధనలు పాటించకపోవడం వారి అహంకారపూరిత వైఖరిని నిరూపిస్తున్నది. ఏ రాష్ట్ర పోలీసులైనా మరో రాష్ట్రంలో ఎవరికైనా నోటీసులు ఇవ్వాల్సి వస్తే..తొలుత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి, వారి సహకారంతోనే ముందుకుపోవాల్సి ఉంటుంది. 


కానీ, ఏపీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఆగమేఘాల మీద అర్ధరాత్రి టీ న్యూస్ కార్యాలయంలోకి తోసుకువచ్చి.. నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో కనీసం ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..? దీనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..? అన్న వివరాలేవీ లేవు. కేవలం చంద్రబాబు, స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన సంభాషణ వల్ల ఏపీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయని, అందువల్లనే కేబుల్ యాక్ట్ చట్టం కింద నోటీసులు జారీ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొనడం గమనార్హం.


ఇది రాజ్యాంగ విరుద్ధమని, పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరించడమేనని తెలంగాణ జర్నలిస్టులు, న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల్లో సీఆర్‌పీసీ నంబర్ కూడా పేర్కొనలేదు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎక్కడ నోటీసులు జారీ చేస్తారో..? ఈ లోగానే ఏదో ఒకటి చేయాలనే ఆదుర్దాతోనే నోటీసులు ఇచ్చారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని.. అతడి అక్రమాలను బయటపెట్టడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటామని టీ న్యూస్ స్పష్టం చేస్తున్నది. పోలీసుల వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. చంద్రబాబు టేపులు, వీడియో ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకోవడానికి టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని.. తెలంగాణ రాష్ట్ర ఏసీబీని కోరినా ఇస్తుందని జర్నలిస్టులు, న్యాయవాదులు పేర్కొన్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ఏపీ దౌర్జన్యం:
తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రా సర్కారు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. నోట్ల కట్టలతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ గ్యాంగ్ చివరకు నిజాన్ని నిర్భయంగా బయటపెట్టిన టీ న్యూస్‌పై దాడికి సిద్ధమయ్యారు. చంద్రబాబు తన రాష్ర్టానికి చెందిన పోలీస్ బలగాలను పంపించి టీ న్యూస్‌కు నోటీస్‌లు ఇచ్చారు. అర్థరాత్రి సమయంలో టీ న్యూస్ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి అక్కడ రాత్రి విధుల్లో ఉన్న జర్నలిస్టులకు నోటీస్‌లు ఇచ్చే ప్రయత్నం చేశారు.


విధులో ఉన్న జర్నలిస్టులు తాము నోటీస్‌లు తీసుకోమని సీఈవో నారాయణ రెడ్డికి సమాచారమందించారు. దీంతో టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డి వచ్చి నోటీస్‌లు స్వీకరించారు. అర్ధరాత్రి పూట నోటీస్‌లు ఇవ్వడంపై టీ న్యూస్ సీరియస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తామని టీ న్యూస్ ప్రకటించింది. అలాగే ప్రెస్ కౌన్సిల్‌కు, సమాచార, ప్రసారభారతిశాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసింది. 


నోటీస్ సారాంశం: జూన్ 7వ తేదీన టీ న్యూస్‌లో 8.30 గంటలకు చంద్రబాబు నాయుడు తెలంగాణ నామినేటెడ్ సభ్యులు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఆడియో రికార్డులను పదే పదే ప్రసారం చేయడం వల్ల రెండు తెలుగు రాష్ర్టాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలో సెక్షన్19 ఆఫ్ కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రెగ్యులేషన్ యాక్ట్1995 ప్రకారం మీకు నోటీస్‌లు జారీ చేస్తున్నాం. మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ నోటీస్‌లను విశాఖపట్టణం ఏసీపీ రమణ టీ న్యూస్‌కు అందజేశారు. 


మీడియా జోలికి వస్తే ఖబడ్దార్: అల్లం నారాయణ


తెలంగాణ భూభాగంలోకి పోలీసులు చొచ్చుకు రావడం చట్ట విరుద్ధమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. అర్ధరాత్రి నోటీసులివ్వడం దురాక్రమణమే అవుతుందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే నగ్నంగా దొరికిపోయాక కూడా తెలంగాణ మీడియాపై పరాయి రాష్ట్రం పోలీసులు నోటీసులివ్వడం ఆక్షేపనీయమని విమర్శించారు. దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ తెలంగాణ మీడియాపై దాడి చేస్తే సహించేది లేదని.. మీడియా జోలికి వస్తే ఖబడ్దార్ చంద్రబాబు అని హెచ్చరించారు. 


వచ్చిన తెలంగాణను అస్థిరపర్చడానికి, కేసు నుంచి తప్పించుకోవడానికే బాబు నోటీసుల డ్రామా ఆడుతున్నాడని.. హైదరాబాద్, తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటామని అన్నారు. పొరుగు రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యాలను తిప్పికొడతామని.. ఇక్కడి జర్నలిస్టులు చైతన్యవంతులని అన్నారు.యావత్ తెలంగాణ మీడియా టీ న్యూస్ వెన్నంటి ఉంటుందని.. ఆంధ్రా బాబు కుట్రను బయటపెట్టిన టీ న్యూస్‌కు కృతజ్ఞతలని తెలిపారు. 


చంద్రబాబు అహంకారానికి పరాకాష్ఠ: కట్టా శేఖర్‌రెడ్డి


చంద్రబాబు దురంహంకారానికి ఇది పరాకాష్ఠ అని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మన రాష్ట్రంలో ప్రవేశించడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంకా హైదరాబాద్‌పై తమకేదో పెత్తనం ఉందని బాబు విర్రవీగుతుండటం సరికాదన్నారు. బాబు రెండు రాష్ర్టాల మధ్య చిచ్చు పెట్టుందుకు కుట్ర పన్నుతున్నాడని.. చివరికి గెట్ లాస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ చంద్రబాబు అని అనిపించుకుంటున్నాడని అన్నారు.


నాడు రాజాజీ అన్న మాట సీఎం కేసీఆర్ అంటే బాబు హైదరాబాద్‌లో ఉండలేడని.. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలన్నారు. హైదరాబాద్‌లో వారి పోలీసులకు ఎలాంటి పాత్ర లేదు.. విభజన చట్టం ప్రకారం, ఇక్కడికి వస్తే స్థానిక పోలీసుల అనుమతి తీసుకురావాలని స్పష్టం చేశారు. టీ న్యూస్‌కు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఆంధ్రా పోలీసులను శిక్షించే వరకు వెనుకాడేది లేదని.. బాబు ఇక్కడ నుంచి బిచానా ఎత్తివేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాన్నారు. గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, హైదరాబాద్‌ను మరో రావణకాష్టంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నాడని ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని చెప్పారు.


అక్రమాలను బయటపెడితే నోటీసులా?: కే కృష్ణమూర్తి


ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్ర ప్రభుత్వ అక్రమాలను బట్టబయలు చేసినందుకు టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని నమస్తే తెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్ కే కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ జర్నలిస్టులందరూ ఖండించి తీరుతారని అన్నారు. తెలంగాణ విషయంలో మొత్తం తెలంగాణ ప్రాంత జర్నలిస్టులందరూ ఒకేతాటిపై ఉంటారని అన్నారు. ఏపీ పోలీసుల దుందుడుకు చర్యను తీవ్రంగా ఖండించారు. ఇదే తీరు కొనసాగితే టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 


ఎక్కడా నిబంధనలు పాటించలేదు: కిరణ్


ఏపీ సీఐడీ అధికారులుగా పేర్కొంటూ టీ న్యూస్‌కు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు ఎక్కడా నిబంధనలు పాటించలేదని న్యాయవాది కిరణ్ అన్నారు. ఏ రాష్ట్ర పోలీసులైనా మరో రాష్ట్రంలో నోటీసులు ఇవ్వాల్సి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసుల్లో కనీసం సీఆర్‌పీసీ నంబర్ కూడా పేర్కొనలేదు. పైగా ఫిర్యాదు ఎవరు చేశారు..? ఏ పోలీస్‌స్టేషన్‌లో చేశారు..? అన్న ప్రాథమిక వివరాలు కూడా నోటీసులో లేవు. ఇది ఏపీ పోలీసుల అతి చర్య. దీనిపై టీ న్యూస్ న్యాయపోరాటం చేయవచ్చు.


స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి: డీసీపీ వెంకటేశ్వరరావు


ఏదైనా నోటీసులు జారీ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఏసీసీ అర్ధరాత్రి సమయంలో స్థానిక పోలీసుల సహాయం తీసుకోకుండా నోటీసులు జారీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. 


ఆంధ్రా పోలీసులు సిగ్గు సిగ్గు: తెలంగాణ జర్నలిస్టులు


ఆంధ్రా పోలీసులు టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మీడియా భగ్గుమంది. చంద్రబాబు తప్పుమీద తప్పు చేస్తున్నాడని జర్నలిస్టులు మండిపడ్డారు. వాస్తవాలు బయటపెట్టిన టీ న్యూస్‌కు నోటీసులు జారీ చేయడమా.. సిగ్గు సిగ్గు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి