గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 01, 2015

అడ్డంగా దొరికినఆంధ్రాబాబు...పచ్చనోట్ల పార్టీ గుట్టురట్టు...!!!

revanth




నిప్పులా బతికాను అంటూ హజారే తమ్ముడిలా డబ్బా కొట్టుకున్న చంద్రబాబు డబ్బుసంచుల బాగోతం.. సాక్ష్యాలతో సహా బట్టబయలైంది. సంతలో పశువుల్లా కొంటున్నారు అంటూ ఇతరుల మీద నిందలు వేసిన సీమాంధ్ర బాబు తెలంగాణ ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. పట్టుబడ్డది రేవంతే అయినా.. అతడు పదేపదే చెప్పినట్టు పంపింది బాబేనని కెమెరాలో రికార్డు చేసిన ఫుటేజీ ప్రపంచం ముందు సాక్ష్యంగా నిలిచింది.
-నామినేటెడ్ ఎమ్మెల్యేకు 50 లక్షలు ఇవ్వబోయి
-ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌రెడ్డి
-కేసులో ఏ 2గా చంద్రబాబు?
-డైరెక్టుగా బాస్ దగ్గర కూర్చోబెడతా.. నా లిమిట్ 2.5 కోట్ల వరకే..
-అదనంగా కావాలంటే బాబుతో మాట్లాడిస్తా.. స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి

క్రైమ్‌బ్యూరో, నమస్తే తెలంగాణ:ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నీచరాజకీయాలకు దిగజారింది. డబ్బులు విరజిమ్మి ఎమ్మెల్యేలను కొనడానికి తెగించింది. ఐదుకోట్ల బేరం పెట్టి తెలంగాణ ఎమ్మెల్యేను కొనడానికి యత్నించి దొరికిపోయింది. తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని ఈ ఉదంతంలో ఓ బీజేవైఎం రాష్ట్ర నాయకుడిని కూడా ఇరికించి బీజేపీ పరువు కూడా తీసింది. ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షల నోట్ల కట్టలు అందిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సంఘటనా స్థలం నుంచి నగదు, సెల్‌ఫోన్లు, రేవంత్‌రెడ్డి కారును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

chandrababu3


రేవంత్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ఉదయ్‌సింహ, మధ్యవర్తి సెబాస్టియన్ బారీని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు, అక్కడున్న సాక్షుల వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం లాలాగూడలో జరిగింది. వివరాలివి.. రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలో టీడీపీ తన అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఈ క్రమంలో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే కార్యక్రమం ప్రారంభించింది. టీడీపీ దృష్టి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌పై పడింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం రంగంలోకి దిగి ఆయన్ని ముగ్గులో దింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.

రేవంత్ ఉద్దేశాన్ని పసిగట్టిన స్టీఫెన్ వెంటనే ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏసీబీ అధికారులు గప్‌చుప్‌గా రేవంత్ రెడ్డి కదలికలపై నిఘా పెట్టారు. రేవంత్ ఆదివారం ఉదయం నుంచి మంతనాలు తీవ్రం చేశాడు. మధ్యాహ్నం వరకు ఇది కొనసాగింది. తర్వాత ఆదివారం సాయంత్రం లాలాగూడ విజయపురి కాలనీలో పుష్పా అపార్టుమెంట్‌లో ఉంటున్న స్టీఫెన్‌సన్ ఇంటికి బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ఉదయ్, మధ్యవర్తి సెబాస్టియన్‌తో కలిసి రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. అప్పటికే ఏసీబీ అధికారులు అక్కడ మఫ్టీలో ఉన్నారు.


కాసేపు మాటామంతీ తర్వాత రేవంత్ రెడ్డి తన వెంట తెచ్చిన ట్రావెలర్ బ్యాగునుంచి లంచంగా ఇవ్వజూపిన డబ్బులను స్టీఫెన్‌సన్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడ టేబుల్ మీద ఉంచిన రూ. 50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడే ఉండి అన్ని ఆధారాలు సేకరించారు. స్టీఫెన్ సన్ , రేవంత్ రెడ్డి వెంట వచ్చిన వారి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి నగదు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? మార్గమధ్యలో ఎవరెవరితో కలిశారు? ఇంకా ఎవరైనా వచ్చారా? అనే కోణాల్లో కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.

షాక్ తిన్న రేవంత్‌రెడ్డి..: స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇచ్చిన అనంతరం డీల్ కుదిరిందన్న ఆనందంలో ఉన్న రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారుల రంగప్రవేశంతో షాక్ తిన్నాడు. మీరెవరు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించగా ఏసీబీ అధికారులమని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. తర్వాత తేరుకుని తనదైన స్టయిల్‌లో కేకలు వేయడం మొదలు పెట్టాడు. దీనితో అప్పటికి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ అపార్టుమెంటులో అలజడి మొదలైంది. అపార్టుమెంట్ వాసులంతా ఆ ఫ్లాటు ముందుకు చేరుకున్నారు. మీడియాకు కూడా సమాచారం అందింది. దీంతో అపార్టుమెంట్‌లో కొంతసేపు విద్యుత్ నిలిపివేశారు.

ఇదిలా ఉండగా, సంఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించగా, రేవంత్ ఎదురు ప్రశ్నలు వేసి దబాయించడం ప్రారంభించాడు. చాలా సేపటి దాకా ఇది కుట్ర.. కుట్ర పన్నారు.. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు..అంటూ అరుపులు ప్రారంభించాడు. చూస్తా... అంటూ ఏసీబీ అధికారులను బెదిరించాడు. ఏసీబీ అధికారులు తొణక్కుండా ఘటనా స్థలంలో లభించిన ఆధారాలపై రేవంత్‌ను ప్రశ్నించి వివరణ తీసుకున్నారు. తర్వాత బంజారాహిల్స్‌లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఆయనను తరలించారు.

కేసీఆర్ కుట్ర : రేవంత్‌రెడ్డి


కేసీఆర్ కుట్రలో భాగంగా తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించాడు. ఏసీబీకి పట్టుబడిన అనంతరం అక్కడకు చేరుకున్న మీడియాతో రేవంత్ మాట్లాడాడు. తన పార్టీలో చేరనందుకు తనపై ఇప్పటికే చాలా అక్రమ కేసులు బనాయించారని ఆరోపించాడు. ఎవరు అధికారంలో ఉంటే వారి మాటలనే అధికారులు వింటారంటూ ఏసీబీ అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించాడు. కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దింపి, ఈ పోలీసులతోనే కేసులు నమోదు చేయించి అరెస్టు చేయిస్తానన్నాడు.

నామిటెడ్ ఎమ్మెల్యేకు రూ. 50 లక్షలు లంచం విషయంపై చెప్పండి అని మీడియా ప్రతినిధులు అడిగినపుడు నేను స్టీఫెన్ సన్‌ను కలిసేందుకు వచ్చాను... అధికారులు అనుకుంటే డబ్బులే కాదు.. మరేవైనా వస్తాయని ఆరోపించారు. మీ క్యాంప్ కార్యాలయం బంజారాహిల్స్‌లో ఉంటే, మార్గ మధ్యలో కూడా లేని లాలాగూడకు ఎందుకు వచ్చారన్న మీడియాపై విరుచుకుపడ్డాడు. మీరు ఎందుకు వచ్చారు?అంటూ ఎదురు ప్రశ్నించాడు. చంద్రబాబును కలిసేందుకు వెళుతుంటే స్టీఫెన్ నాలుగు గంటలకు ఇంటికి రమ్మని చెప్పాడు. తార్నాక నుంచి వెళుతున్నాను. దగ్గరలోనే లాలాగూడ ఉండటంతో వచ్చినట్టు చెప్పాడు. ఇదంతా కేసీఆర్ కుట్ర.. నాకు ప్రాణహాని కూడా ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారులు అపార్టుమెంట్ నుంచి వాహనం వద్దకు రేవంత్‌ను తీసుకువెళుతుండగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రా తొత్తు రేవంత్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం: ఏసీబీ డీజీ ఏకే ఖాన్


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం స్టీవెన్‌సన్‌కు లంచం ఇస్తుండగా తమ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మీడియాకు వెల్లడించారు. ఈ సంఘటన పూర్వాపరాలను ఆయన వివరించారు. రేవంత్ యత్నాలపై ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ రెండు రోజుల క్రితం తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. తమకు వచ్చిన ఫిర్యాదు ఒకటి రూ. 5 కోట్లు, మరొకటి రూ. 2కోట్లకు సంబంధించిన డీల్ అని తెలిపారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఆదివారం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ఉదయ్ సింహ, సెబాస్టియన్ బారిలు స్టీఫెన్‌సన్ ఇంటికి వచ్చారు.

ఆయనకు రూ. 50 లక్షల లంచం ఇచ్చినట్లు ఆడియో విజువల్ లభ్యమైంది. ఈ ఘటనలో కేసు నమోదు చేసి నలుగురిపై కేసు నమోదు చేశాం అని చెప్పారు. రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ, సెబాస్టియన్ బారిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, మరో వ్యక్తి మక్యాల్ జరుసలేం గతంలో ఈ విషయాన్ని డీల్ చేసేందుకు వచ్చినట్లు తెలియడంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తరువాత వీరిని అరెస్టు చేసి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు. ఈ ఘటనపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు 1988, సెక్షన్ 12 మరియు ఐపీసీ 120(బీ), 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇచ్చి వారి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇది కాగ్నిజబుల్, నాన్‌బెయిలబుల్ కేసుగా పరిగణించబడుతుందన్నారు.

తొలినుంచి బాబుది కొనుగోళ్ల చరిత్రే


-డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: డబ్బులు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబుకు మొదటినుంచీ అలవాటేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా డబ్బుమయం చేసిన చరిత్ర బాబుదేనని అన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు ఉదంతంలో యాక్ట్ చేసింది రేవంతే అయినా దర్శకుడు మాత్రం చంద్రబాబేనని ఆరోపించారు. టీటీడీపీ నాయకులు ప్యాకేజీలకు ఆశపడి బాబు చెప్పినదానికల్లా తలూపి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని అన్నారు.

రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించి దొరికిపోవడం వారి ద్రోహబుద్ధిని బయటపెట్టిందని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని ఓడించి నైతికంగా దెబ్బతీయాలని రేవంత్‌రెడ్డి చేసిన యత్నం బెడిసికొట్టి మూతి పండ్లు, ముక్కు పగుల గొట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కాగా ఈ కొనుగోలు యత్నాలపై ఏసీబీకి ఎర్రబెల్లే ఉప్పందించి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీపీలో నెంబర్ 1 స్థానం కోసం సిగపట్లు కొనసాగుతున్నాయని, రేవంత్ చంద్రబాబు దగ్గర క్రెడిట్ కొట్టేస్తాడనే ఆలోచనలతో ఎర్రబెల్లి ఇలా చేసి ఉండొచ్చన్నారు.

పశువుల్లా కొంటున్నదెవరో తేలింది


-మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
ఎమ్మెల్యేలను సంతలో బర్రెలు, గొర్రెల్లా కొం టున్నారని చంద్రబాబు మహానాడు వేదికగా ప్రచారాలు చేశాడని, అయితే వాస్తవంగా ఎమ్మెల్యే లను పశువుల్లా కొనుగోలు చేస్తున్నదెవరో ఇవాళ రేవంత్‌రెడ్డి ఉదంతంతో బయటపడిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. అసలు క్యాం పులో ఉండాల్సిన రేవంత్ ఎట్ల గాయబ్ అయిండు, వాళ్ల ఇంటికి ఎందుకు పోయిండో సమాధానం చెప్పాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ తీరు దొంగే దొంగ.. దొంగ అన్నట్టుగా ఉందన్నారు. చంద్రబాబుది నీచ, దుర్మార్గ చరిత్ర .. మొదటి నుంచి ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి చంద్రబాబుదేనన్నారు.

చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి


-నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్
నిజామాబాద్, నమస్తే తెలంగాణ: శాసన మం డలి ఎన్నికల్లో గెలువలేక టీడీపీ నాయకులు దివాళా కోరు రాజకీయాలకు దిగుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆంగ్లో ఇండియన్ సభ్యుడికి లంచం ఇవ్వడంపై ఎంపీ కవిత ఖండించారు. ఆదివారం రాత్రి ఆమె నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఘోరమైన అవమానం జరిగిందన్నారు. తెలంగాణ బిడ్డలను తన్నుక చావండని ఆంధ్రనాయకులు మన చేతికే కత్తులు ఇచ్చి దూసుకునేలా చేస్తున్న చంద్రబాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.

టీడీపీపై ప్రజలు ఉమ్మేస్తారు


-ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
టీడీపీ నాయకులపై ప్రజలు ఉమ్మేసే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఎదురుదాడి చేయడానికి సిగ్గుండాలని అన్నారు. క్యాంపులో ఉండాల్సిన ఎమ్మెల్యే బయటికొచ్చి స్టీఫెన్‌సన్ ఇంటికి ఎందుకు వెళ్లాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడు కోట్ల రూపాయలకు తమ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించి రూ.50 లక్షలతో దొరికిపోయాడన్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని, డబ్బుల సంచులను కూడా స్వాధీనం చేసుకున్నారని అన్నారు.

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి


-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఏసీబీ అధికారులకు రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేపో, మాపో ఏసీబీ అధికారులు రేవంత్ బండారాన్ని పూర్తిగా బయటపెడతారని అప్పుడు టీడీపీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేని ప్రలోభపెట్టి, డబ్బులు ఆశ చూపిన రేవంత్‌రెడ్డి ఇంకా బుకాయిస్తుంటే, తోటి టీడీపీ నాయకులు కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి