గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, నవంబర్ 05, 2014

ఓరుగ‌ల్లు టు జ‌గ‌ద‌ల్ పూర్‌...

chati


-మలి కాకతీయ రాజ్యంలోకి..చరిత్ర పిలిచింది.. 
చరిత్ర ఒక తరగని గని. ఎంత తవ్వినా ఎప్పటికప్పుడు నిత్యనూతన ఆవిష్కరణలు తారసపడుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆధారాలు జిజ్ఞాసకు పదును పెడుతూనే ఉంటాయి. కాకతీయ సామ్రాజ్యం ప్రతాపరుద్రునితో అంతమై పోలేదన్నది నూతన ఆవిష్కరణ. ఇక్కడ ముగిసిన అధ్యాయం బస్తర్ అడవుల్లో మలి కాకతీయ సామ్రాజ్యం రూపంలో పురుడు పోసుకుని వందల ఏళ్లుగా వర్ధిల్లుతున్నది. కాకతీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న తెలంగాణకు బస్తర్ ఇప్పుడొక అపురూప కథావస్తువు. కళ్లారా చూడాల్సిన తీర్థయాత్రా స్థలి. 
చరిత్ర పుస్తకాలకు పరిమితం అనుకున్న కాకతీయ వారసులను ప్రత్యక్షంగా చూడడం రుద్రమదేవి, ప్రతాపరుద్రులను స్ఫురణకు తెచ్చుకోవడం, వందల కిలోమీటర్ల అవతల నట్టడవిలో వెలసిన దంతేశ్వరీ ఆలయంలో కాకతీయ శిల్ప కళారీతులను ఒడిసిపట్టుకోవడం ఓ అద్భుత అనుభవం. ఎటొచ్చీ మావోయిస్టులు, పోలీసులకు మధ్య యుద్ధభూమిగా మారిన ఆ ప్రాంతానికి ప్రయాణించడమే అన్నింటికన్నా క్లిష్టతరమైన అంశం. 

ganesh


ఓరుగల్లునుంచి జగ్‌దల్‌పూర్.. ఇది రెండు నగరాల మధ్య జరిపే సాధారణ పర్యటన మాత్రమే కాదు. ఒక మహాసామ్రాజ్యపు రెండు రాజధానుల మధ్య ప్రయాణం. ఒక చోట ముగిసిన చరిత్ర ఆనవాళ్లు మరోచోట ఆవిర్భవించిన ప్రదేశాల మధ్య చరిత్రకు అనుసంధానాన్ని తడిమిచూసే ప్రక్రియ. ఇక్కడ మాయమైన వైభవాన్ని అక్కడ వెతుక్కునే తపన. పోల్చుకునే ఆరాటం. ఇదే మమ్మల్ని వరంగల్‌నుంచి బస్తర్‌కు నడిపించింది. బస్తర్‌లో కాకతీయ రెండో సామ్రాజ్యం కథనం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన నాటినుంచి ఈ తపన ఉంది. కాకతీయులకు అక్కడ ఒక వారసుడున్నాడని తెలిసినప్పటినుంచి కలుసుకోవాలన్న ఉబలాటం.

కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితోనే అంతం కాలేదు. ఆయన తమ్ముడు అన్నమదేవుడు వరంగల్ నుంచి బస్తర్‌కు చేరి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారనే చరిత్ర ప్రచురితమైనాక తెలంగాణ వ్యాప్తంగా చరిత్రకారుల్లో ఇదొక చర్చనీయాంశంగా ఉంది. సహజంగానే అనుమానాలు, సంశయాలు ఎటూ ఉంటాయి. ఈ నేపథ్యం బస్తర్ వైపు నడిపించింది. దానికితోడు వరంగల్‌లో కాకతీయ ఉత్సవాలు జరిగిన సందర్భంగా బస్తర్‌లోని మలి కాకతీయ రాజు అన్నమదేవుడి వంశానికి చెందిన వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కాకతీయతో జరిపిన సంభాషణలు.. ఇవన్నీ మాలో ఆసక్తిని వందల రెట్లు పెంచాయి.

బస్తర్ వెళ్లాలి. మలి కాకతీయుల రాజసౌధాన్ని చూడాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజులు ఎట్లా ఉంటున్నారు? వారి ఉనికి ఎట్లా ఉంది? అక్కడి ప్రజల యోగక్షేమాల విషయంలో వారి పాత్ర ఏమిటి? నిజంగా వారు రాజులుగానే ఉంటున్నారా? ప్రజాస్వామ్యయుతంగా ప్రజలుగానే జీవిస్తున్నారా? ఇటువంటి అనేకానేక విషయాలు తెలుసుకోవాలనే ఉబలాటం మొదలైంది. అతి కష్టంమీద బస్తర్ రాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌తో అపాయింట్‌మెంట్ దొరికింది. తర్వాత ఎడిటర్ కట్టాశేఖరరెడ్డి జాగ్రత్తలు చెప్పి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నెట్‌వర్క్ కో-ఆర్డినేటర్ మార్కండేయ సలహాలిచ్చారు.

idol


యుద్ధక్షేత్రం మధ్యనుంచి...


దండకారణ్యం ప్రాంతంలో ఉన్న బస్తర్‌లో ఇపుడు యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉంది. బస్తర్, దంతేవాడ, సుకుమా, బీజాపూర్, కాంకేర్ ప్రాంతాల్లోని అడవి అంతా అలజడిగా ఉంది. భారతసైన్యం, మావోయిస్టుల మధ్య హోరాహోరీ పరిస్థితి ఉంది. కొత్త వ్యక్తుల మీద అనుమానపు చూపులు ప్రసరించే సమయం. జిల్లా కేంద్రాలు మినహా మిగిలినదంతా గిరిజన గ్రామాలు అడవులు కావడం మరో సమస్య. మా ప్రయాణం భద్రాచలం,సుకుమా నుంచి జగ్‌దల్‌పూర్‌కు ప్లాన్ చేసుకున్నాం. మిత్రుడు జూలకంటి, టీ న్యూస్ వేముల నాగరాజు, కెమెరామెన్ సాంబశివుడు కలిసి ప్రయాణం ప్రారంభించాం.

ఛత్తీస్‌గడ్ బార్డర్ కుంట చేరే సరికే సాయంత్రం నాలుగైంది. అక్కడి నుంచి రెండు జిల్లాలు దాటాలి. రాత్రి ఎనిమిదికల్లా జగ్‌దల్‌పూర్ చేరుకోవచ్చుననుకుంటే అక్కడికి చేరే సరికి పన్నెండైంది. అంతా అడవి దారే. సుకుమా నుంచి మెలికలు తిరిగే ఘాట్లు. లోయలు. వాహనం స్పీడు చాలావరకు గంటకు ఐదు నుంచి పది కిలోమీటర్ల కంటే సాధ్యం కాదు. మధ్యలో ఎర్రబోరు, దోర్నపాల ప్రాంతాలు తగిలాయి. 76 మంది సీఆర్‌పీఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చివేసిన చోటు అదే. దర్బా దాటగానే కేశ్‌కాల్‌ఘాట్. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, మాజీ కేంద్రమంత్రి వీసీ శుక్లా లాంటి వాళ్లు ప్రయాణిస్తున్న కాన్వాయిపై మావోయిస్టులు దాడి చేసిన చోటు. సుకుమా జిల్లా హెడ్‌క్వార్టర్‌కు చేరుకునే సరికి సెల్ కవరేజ్ వచ్చింది. అప్పటిదాకా అదీలేదు.

అప్పటికి రాత్రి తొమ్మిదిన్నర అయింది. సుకుమా జిల్లా కేంద్రమే అయినా మండల కేంద్రం కన్నా అధ్వాన్నంగా ఉంది. సుకుమా పేరు అందరికీ సుపరిచితమే. అక్కడి కలెక్టర్ అలెక్స్‌పూల్ మీనన్ కిడ్నాప్‌కు గురైన వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అక్కడ కొత్త వ్యక్తులతో ఎవరూ పెద్దగా మాట్లాడరు. హోటల్లో చాయ్‌పెట్టిచ్చిన మనిషి ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా ఆచితూచి మాట్లాడాడు. అక్కడి నుంచి జగదల్‌పూర్ ప్రయాణం.

కాటుక చీకటి. కళ్లు పెద్దవి చేసుకొని చూసినా దారి మినహా ఏమీ మరేమీ కనిపించని చీకటి. చేరేసరికి రాత్రి పన్నెండున్నరైంది. మనలాగా లాడ్జ్‌ల్లో తేలిగ్గా అనుమతి దొరకదు. ఐడీ ప్రూఫ్‌ల జిరాక్స్ అన్నీ ఇస్తే వాటిని చూసుకొని లాడ్జ్ నిర్వాహకులు తృప్తి పడితేనే సాధ్యం. అన్నిరకాలుగా ఆయన సంతృప్తి పడ్డ తరువాతే గది దొరికింది.

మ్యూజియంతో మొదలు..


మా యాత్ర గమ్యానికి చేరింది. కాకతీయ ఆనవాళ్లను సందర్శించే కార్యక్రమం జగ్‌దల్‌పూర్‌లోని మ్యూజియంతో మొదలైంది. ముందుగా కాకతీయ రాజవంశ వారసుడు రాజా కమల్‌చంద్ర భంజ్ దేవ్ కాకతీయను కలుద్దామనే అనుకున్నాం. ఆయన అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం మొదలుపెట్టాం. ఆయన రమ్మన్నాడని ఇంతదూరం వచ్చాం. తీరా ఆయన దొరుకుతాడో లేదో అన్న అనుమానం మొదలైంది. అందరం కలిసి రాజప్రాసాదం వద్దకు చేరుకున్నాం. మహల్ రాజసం ఉట్టిపడుతున్నది. ప్రవేశద్వారం వద్దే గుడి. సెక్యూరిటీ. సమస్య ఏమిటంటే అనుమతిలేనిదే లోనికి వెళ్లకూడదు. లోనికి వెళ్లనిదే అనుమతి దొరకదన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి.

కమల్‌చంద్ర భంజ్‌దేవ్ వ్యవహారాలు చూసుకునే కుమార్ జయదేవ్‌తో ఫోన్‌లో మాట్లాడాం. ఆయన దూరంగా ఉన్నాను. నేను అక్కడికి రావడానికి గంట పడుతుంది అన్నాడు. మహల్ చూస్తే కదలబుద్ది కాలేదు. ఈరోజు ఎట్లయినా సరే లోపలికి వెళ్లాల్సిందే. రాజుతో మాట్లాడాల్సిందే అనుకున్నాం. ఇంతలో అక్కడికి దగ్గరే పురావస్తుశాఖ మ్యూజియం ఉందని తెలిసింది. మ్యూజియం అంటే వారసత్వ సంపద. అక్కడ కాకతీయులకు సంబంధించిన ఏవైనా చారిత్రక ఆధారాలు దొరకొచ్చు. ఎలాగూ గంట సమయం ఉంది. బయటికి వచ్చి అడ్రస్ పట్టుకున్నాం. తీరా అక్కడికి వెళితే మ్యూజియం లోపల ఫొటోలు తీయడం నిషేధం అన్నాడు అక్క చౌకీదార్. కాసేపు తర్జనభర్జన. ఫొటోలు లేకుంటే ఎలా? మ్యూజియం అధికారి ఎల్సీ మెస్రా ఫోన్ నెంబర్ దొరికింది. కాసేపు సంభాషించిన తర్వాత అనుమతి దొరికింది.

మ్యూజియం రెండస్థుల మేడ. సుమారు 50 విగ్రహాలున్నాయి. మరో 100 విగ్రహాలు స్థలం లేక స్టోర్ రూంలో పడేశారు. ప్రదర్శనకు పెట్టిన విగ్రహాల్లో చాలా వరకు కురుష్పాల్, బస్తర్, బడేడోంగర్, చోటేడొంగర్, జగదళ్‌పూర్, దంతేవాడ తదితర ప్రాంతాల్లో లభించాయి. వాటిలో అనేకం గణపతి, శివపార్వతుల విగ్రహాలు. రామప్ప నాగిని పోలిన నాగిని విగ్రహం కూడా అక్కడుంది. విగ్రహాల్లో 13, 14వ శతాబ్దానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. కాకతీయ శిల్పాలతో పోలిస్తే ఈ విగ్రహాల ఫినిషింగ్ కొంచెం ముతకగా ఉంది. కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి. అర్థం కాని భాష. ఏమైనా దాదాపు అన్నీ కాకతీయ రీతులను గుర్తుకు తెచ్చేవే. మన చరిత్రకారులు ఆ మ్యూజియంలో ఉన్న విగ్రహాలు, శాసనాలు చూస్తే అవి కాకతీయుల శిల్పరీతులేనని తేల్చివేస్తారనిపించింది.

ఈ సందట్లో అక్కడ ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ బీజాసింగ్ ఠాకూర్ తారసపడ్డారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడాం. ఆయన బస్తర్ కాకతీయుల ఆనవాళ్లు వరంగల్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒకటి అర్థమైంది. అక్కడున్న వారికి ప్రతాపరుద్రుడి వరకే తెలుసు. అంతకన్నా ముందు కాకతీయుల గురించి పెద్దగా తెలియదు. విచిత్రంగా మనకు ప్రతాపరుద్రుడి వరకే తెలుసు ఆయన తర్వాత (మన చరిత్రకారులు పట్టించుకోనట్టే..) అన్నమదేవుడు, ఆయన తరువాత వారి గురించి తెలియదు. ఈ లింకే అనుసంధానం జరగాల్సి ఉంది. ఓ గంట తరువాత కుమార్ జయదేవ్ చెప్పిన టైం కానే అయింది.

మళ్లీ మహల్‌కు వెళ్లాం. కుమార్ జయదేవ్ చెప్పిన సమయానికి వచ్చారు. మేమే కొంచెం లేటు. ఆయన మాకోసం వేచి చూస్తున్నారు. ఆయన చిరునవ్వుతో కూడిన పలకరింత మమ్మల్ని మలి కాకతీయ సామ్రాజ్య వారసుల రాజప్రాసాదంలోకి ఆహ్వానించింది. ఆ రాజ్య వారసుడితో భేటీకి సమయాన్ని పరిచింది. ఉద్వేగం, సంభ్రమంతో కూడిన అనుభూతితో గేటు దాటి ప్రాసాదంలోకి అడుగుపెట్టాం...

-(ఛత్తీస్‌గఢ్ నుంచి) నూర శ్రీనివాస్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి