గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, నవంబర్ 01, 2013

సీమాంధ్రుల అభియోగాలు-తెలంగాణుల సమాధానాలు (1)


నా తెలంగాణ సోదరులారా! నే నీమధ్య ’ఫేస్ బుక్’లో తిలకించిన “సీమాంధ్రుల అభియోగాలు-తెలంగాణ సమాధానాలు”ను పద్యరూపమున ప్రకటింప బూనుకొన్నాను. కొంత భాగము ఈ రోజున ప్రకటిస్తున్నాను. రేపు మిగతాది ప్రకటిస్తాను.

1.ప్రజల అభిప్రాయం తీసుకోలేదు….

సమాధానం:
మా తెలంగాణ నాంధ్రతో మమ్మడిగియె
కలిపిరే? యప్డు మా ప్రజా కాంక్షితమ్ము
నడుగ వలెనని తెలియదే? నమ్మఁ బలికి,
నాయకుల మోసగించి, యాంధ్రప్రదేశ
మందుఁ గలిపి, దోచిరి మమ్ము! మఱచినారె?

సరియె, పోనిండు! విభజన జరుపఁగాను
నఱువ దేఁడుల నుండి మే మడుగుచుండ
నటులె యన్యాయమును జేసినట్టి కోర్కి
మీర లొప్పుకొందురె? “వద్దు! మేము నొప్పు
కొన”మటంచుఁ బల్కుదురుగా కోయి దీని!

నాల్గు కోట్లు మేము! నాఱు కోటులు మీర!
లెట్లు కుదురు నోయి యేక వాక్కు?
మమ్ము మీర లండ్రు మైనారిటీలని!
మాకు నెటులఁ గలుగు శోక విరతి?

ఇట్లు దుర్బుద్ధితో మీర లెంత యఱచి
“మా యభిప్రాయ మడుగలేదాయె” ననుచు
గోల చేసిన, నన్యాయ మూలకర్త
లీరె కాన, కేంద్రమ్మె యా తీరు నడచె!

2.హైదరాబాదును మేమే డెవలప్ చేశాము…

సమాధానం:
’చార్మినా, రసెంబ్లీ, కోర్టు, సలరుజంగు
మ్యూజియము, ట్యాంకుబండ్’లను మొదలగునవి
మీరు కట్టించితిరె? దీని మేము వృద్ధి
చేసినా మన, నమ్మంగఁ జెవినిఁ బువ్వు
పెట్టుకొన్నట్టి వారలు వేరె లేరె?

ఇచట కాలమ్ముతోడ హయిద్రబాదు
కలసి యభివృద్ధిఁ గాంచెను! కాని, మీర
లెట్టి యభివృద్ధి చేసితి రిచట? మీవి
యైన వ్యాపారముల కగు నవసరములఁ
దీర్చుకొనఁగాను భవనాలు దిట్టముగను
గట్టుకొంటిరి! కాని, సర్కారు వైద్య
శాల లేవైన, బడులైన స్థాపితమయె
నోయి? సెలవిమ్ము! ప్రైవేటు లాయె వృద్ధి!
యిచటి తెలగాణ జనులు నెట్టి వృద్ధి
లేకయే యుండ్రి! సీమాంధ్రు లిచటఁ జేరి,
వృద్ధిపొందిరి మము దోచి, వెతలఁ ద్రోచి!

3.హైదరాబాదు మాది…

సమాధానం:
వలచి పదిహేను వందల పదియు రెండు
వత్సరమ్మున నే నిట బ్రతుకు బ్రతికి,
హైద్రబాదును గట్టించి, యాదరించి
తందువే? గోలుకొండ సుల్తాను కట్టి
నట్టి హైదరాబాదు నీ దనెడు మాట
చిన్నపిల్లలకుం జెప్పు చిత్రకథయె?

పదియు మూఁడగు జిల్లాల వారి దెట్టు?
లిచటి హైద్రబాదును నీదు హితవుఁ గనెడి
తాత ముత్తాత లెప్పు డుద్ధరణఁ జేసి,
కట్టిరో చెప్పుమోయి! సాక్ష్యమ్ము లేవి?
నీవు చెమటోడ్చియును గట్టినావె చెపుమ!
తండ్రి తాత ముత్తాతలు తరతరాలు
గా నిచట వసించు ప్రజల కాటపట్టు
నైన “హైద్రబాద్”, వారిదే యౌను గాని!

4. తెలుగువారిని విడదీయొద్దు….

సమాధానం:
భారతీయుల విడదీయవ ద్దనుమయ!
తమిళులును భారతీయులే! ధర్మపరుల
గు తెలగాణులు భారతీయత గలారె!
యిట్టి భరత జాతీయత నెట్టు విడిచి
తోయి సీమాంధ్రుఁడా! నాఁడు తూట్లు పొడిచి,
తమిళ సోదరులను వీడి, తప్పుచేసి,
వేరు రాష్ట్రమ్ముగా నెట్లు విడఁగఁ జేసి
నావొ? నేఁడు గుర్తుకు రాదె? నీవె చెపుమ!

హింది మాట్లాడు రాష్ట్రాల వెన్ని కలవొ
నీకుఁ దెలియదే? లెక్కించు! నిక్కముగను
వారు విడదీయఁ బడిరే? వివాద మేది?
తెలుఁగు రాష్ట్రాలు రెండైన స్థిరతఁ గనియు
నెంతయో వృద్ధిఁగను నయ్య! చింత వలదు!

చింత కలుగుచో హింది రాష్ట్రీయుల కొక
రాష్ట్ర మేర్పాటు చేయించి, రమ్మిటకును!
అందరము కలసియు నుందు మయ్య యిచట
తెలుఁగు రాష్ట్ర మొక్కటి యంచు దిగులు వీడి!

మాది తెలగాణ భాషయే! కాదు తెలుఁగు!
తెలుఁగు తెలుఁగంచు నన, మాది తెలుఁగె యైన,
మా తెలంగాణ భాషల నా తెఱఁగున
నెట్టు లవమాన పఱచితో యెఱుకలేదె?

చిత్రసీమను విలనుల, చిన్న నటుల,
హాస్య నటుల సంభాషణలందు మీరు
మా తెలంగాణ భాషను, నీతి తప్పి,
చేర్చలేదె? యిచ్చట మీరు చర్చ చేసి,
యిపుడు తెలుఁగంచు వదరంగ; హృదయమందుఁ
బ్రేమ లొలుకంగ వత్తుమే పిలువఁగానె?

నాది బ్రతుకమ్మ పండుగ! నీది యట్ల
తద్దె! రెంటికిఁ బొత్తేది? తగవు మాని,
వగల మాటలు చాలించి, భ్రమలు వీడి,
తెలుఁగు వారల నిట విడదీయ వద్ద
టంచు మొత్తుకొనకు మోయి టక్కరీఁడ!

(మిగతా అభియోగాలు…వాటికి సమాధానాలు రేపటి టపాలో చూడగలరు)

జై తెలంగాణ!        జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి