గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, నవంబర్ 30, 2013

ఎందుకు హైదరాబాదును యూటీ చేయాలి?


(1) 
అఱువ దేఁడుల నుండియు నక్రమముగ 
సంగ్రహించిన వన్నియు సక్రమముగ 
స్వంతముం జేసికొనుటకు వార లిపుడు 
యూటి నినదమ్ముఁ జేయుచు నుండి రయ్య! 

(2) 
అక్రమాస్తులు, భూములు నన్ని తమకె 
హక్కు భుక్తమ్ముగాఁ జెంది, యడుగువారు 
లేక యుండఁగ వలెనని యేకముగను 
యూటి నినదమ్ముఁ జేయుచు నుండి రయ్య! 

(3) 
ఎన్ని వేషాలు, మోసాలు, నెన్ని లొసుఁగు, 
లెన్ని దౌష్ట్యమ్ము, లక్రమా, లెన్ని కతల 
తోడ నార్జించిన సిరుల్ దొలఁగకుండ 
యూటి నినదమ్ముఁ జేయుచు నుండి రయ్య! 

(4) 
అప్పు డెప్పుడొ పొందిన యిట్టివాని 
లెక్క తేల్చంగఁ బూనెద రిక్క డనుచు, 
నక్రమాస్తులు జప్తుల నందకుండ 
యూటి నినదమ్ముఁ జేయుచు నుండి రయ్య! 

(5) 
“మాకు దక్కని దేదైన మాకుఁ గాక, 
మఱి యొకరికి దక్కఁగ నీయ” మనెడి దుష్ట 
చింత తోడ సీమాంధ్రులుఁ జేరి యచట 
యూటి నినదమ్ముఁ జేయుచు నుండి రయ్య! 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, నవంబర్ 29, 2013

ఇందుకే మేం స్వరాష్ట్రం అడుగుతున్నాం!


ఇన్ని చేసితి! నన్ని చేసితి!
రాష్ట్రమును అభివృద్ధిచేసితి!
అనుచు పలికెడు ముఖ్యమంత్రియె
తెలంగాణములో

మొన్న ’ఫైలిన్’ తుఫానుకు తన
పంట నాశనమైన రైతుకు
ఒక్క పైసయు ఈయకుండెను!
నిరంకుశుడయ్యా!

కాని, సీమాంధ్రకును పరిహా
రమ్ము నిచ్చిన ముఖ్యమంత్రికి
యెఱుకలేదా, తెలంగాణను
ఆదుకొన నిపుడున్?

పక్షపాతము లేక యున్నచొ
నష్టపరిహారమ్ము ఎందుకు
అందజేయడు? ఖచ్చితమ్ముగ
పక్షపాతియెగా!

ఇట్టి పాలన మాకు వలదని;
ఇందుకే మా రాష్ట్ర మడుగుచు
పోరుచుంటిమి! ఆంక్ష లుండని
తెలంగాణముకై

కేంద్రమును మఱి కోరుచుంటిమి!
ఇట్టి సీమాంధ్రుల ’కుపాలన’
సాగుచో నష్టమ్ము లింకను
పెరుగు నో యయ్యా!

మమ్ము గావని, మమ్ము జూడని,
మాకు పైసా నీయ బూనని,
ఇట్టి సీమాంధ్రుల ’కుపాలన’
మాకు వలదయ్యా!

జై తెలంగాణ!       జై జై తెలంగాణ!

గురువారం, నవంబర్ 28, 2013

తెలంగాణకు పరిష్కారం ఇలాగే ఉండాలి!


హైదరాబాదు “యూటి” చేయంగ వలదు!
భద్రగిరి మాదె! మునగాల వలయు మాకు!
పంచ వర్షము లుమ్మడి నుంచఁ, జాలు!

పోలవర “డిజైను”ను మార్చి, ముంపు గలుగ
కుండఁ జేయంగ వలయు మా కోర్కి మేర!
కఱువ దేఁడులఁ దెలగాణ మందినట్టి
నష్ట మెంతయో లెక్కించి, నష్ట మంతఁ 
బూడ్చవలయును! సీమాంధ్ర పొందినట్టి 
లాభముల లెక్కఁ దేల్చి, తల్లాభములను 
బఱఁగ నే దొంగ లొందిరో, నిజవిచార 
ణమ్ముఁ జేయించి, చర్యల నపుడుఁ గొనుఁడు! 

నాఁటి ప్రకటన నుండియు నేఁటి వఱకు
ముఖ్యమంత్రి యిడిన “జీవొ” మొత్తములను
వేగిరమె విచారణకుఁ దెప్పించి, వాని
లోన లొసుఁగు లెన్నియు నున్న, వాని రద్దు 
పఱచి, సీమాంధ్ర వారి దుష్పాలనమును 
కేంద్ర మెఱిఁగి, తెలంగాణ కిడుఁడు న్యాయ 
మిపుడు! తెలగాణ కాంక్షల మెఱయఁజేయు 
రాష్ట్ర మందఁజేయఁగ నాదు ప్రణతు లివియె! 

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

మంగళవారం, నవంబర్ 26, 2013

ఓ తెలంగాణ నాయకా, యొప్పుకొనకు!



"హైదరాబాదు యూటీగ నైదు వత్స
రములు చేయ నొప్పినచో, బిరాన మేము
నొప్పుకొందుము తెలగాణ, నిప్పు డొసఁగు
కేంద్ర కృతముల వేగ మంగీకరించి!"

యనెడు సీమాంధ్ర నాయక ఘనుల మాట
నమ్ముచోఁ దెలగాణమ్ము నమ్ముకొండ్రు!
సందు దొఱకుచో నంతియే చాలు! వారు
పూర్తిగా నాక్రమించియుఁ బొమ్మనెదరు
మన తెలంగాణ వారినే! కనుక వినుఁడు!
వారి కేయవకాశమ్ము కోరి యిడిన,
నదియె యమపాశముగ మన కగును సుమ్ము!

భద్రగిరి మునగాలలున్ హైద్రబాదు
తోడఁ గూడిన తెలగాణె నీడ మనకు!
కాక, యెట్టి యాంక్షలనైనఁ గట్టి నట్టి
రాష్ట్ర మిచ్చిన నొప్పము! రాజకీయ
స్వప్రయోజనములు మీరు ప్రక్కనుంచి,
యఱువ దేఁడుల యాకాంక్ష నందఁ గోరి,
నడుము గట్టుఁడు తెలగాణ నాయకు లిట!

ఒడలు మఱచియు, సీమాంధ్ర నొడఁబఱుపఁగ,
నాంక్షలే చిన్న వంచును నమ్మకుఁ డయ!
యమృతమును ద్రాగి, విషమును నందఱకును
బంచి, మోసగింతురు వారు! వలదు, వారి
నమ్మి మోసపోవల దీనిజమ్ము నమ్ము!

కేంద్రమే సమకట్టెను క్షిప్ర మిడఁగ
మన తెలంగాణ రాష్ట్రమ్ము! మనదె జయము!
అఱువ దేఁడుల స్వప్నమ్ము లాకృతిఁ గొని,
యెదుట నిల్చెడు సమయాన, నెటుల నాంధ్ర
నాయకుల మాట విందురు? నమ్మఁ, జెడుదు
మోయి తెలగాణ నాయకా! మోసపోకు!

అఱువ దేఁడుల క్రిందట నాంధ్ర వాండ్ర
నమ్మి మోసపోయిన తెలంగాణ, మఱల
కల్లబొల్లి మాటల నమ్మి, కష్టములను
దెచ్చుకో వలెనే? వల దిట్టి యాంధ్ర
వారితోఁ బొత్తు వలదయ్య! వలదు వలదు!

మన తెలంగాణ రాష్ట్రమ్ము మన దెసకును
నడచి వచ్చుచున్నది, కేంద్ర మిడఁగ నేఁడు!
స్వాగతింపుఁడు తెలగాణ పాట పాడి,
కేలు మోడ్చియు, జై కొట్టి, క్షిప్రముగను!
కాని, మోసపోకుఁడు దోసకారి మాట
నమ్మి! కూల్చి సీమాంధ్ర పన్నాగములను,
వెలిఁగిపొండు తెలగాణ ప్రేమ లంది!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!


సింగరేణి మా హక్కోయి! చెలఁగఁ బోకు!


హైదరాబాదు రాష్ట్రాన నపుడు నున్న
సింగరేణిలో వాటా విశిష్ట మెన్న
నేఁబదియు నొక్క శాతమ్ము నిష్ఠఁ గొనియె!
కేంద్రమున నల్వ దెన్మిది కెక్కువుండె! (1)

నేఁడు తెలగాణ రాష్ట్రమ్ము నిచ్చు తఱిని
నాంధ్రకును వాట నిడఁగాను నడచెఁ గుట్ర!
లేఁబదొక్క శాతమ్మున రెండవదగు
వాట నీయంగఁ గోరియు వలచి రంట! (2)

దీని నెట్టి పరిస్థితిలోను నొప్పు
కొనరు తెలగాణ జనులిట! కనఁగ, నేల
వాట నీయంగ వలెనయ్య? ప్రథమముననె
హైదరాబాదు రాష్ట్రాన నైదుపదుల
పైన నొక్క శాతమ్ముండె! పఱఁగ దీని
జీల్చి యిచ్చుటకై హక్కు సీమ కిడుట
ధర్మ సమ్మతము కాదు తఱచి చూడ! (3)

ఇడుదురే యాంధ్ర సంస్థల కడమ సగము
వాటగాఁ దెలంగాణకు వాటముగను?
ఓడరేవు, స్టీల్ ప్లాంటు, గ్యాస్ యొక్క వాట
లందు సగపాలు వాటగ నొంద నిడుఁడు! (4)

మీ తిరుమలలో నాదాయ మెంత యున్న,
దాన, సగము వాటగ నిత్తురేని, యపుడు
యోచనము సేతుమోయి వివేచనమున!
నటులె యా సంస్థ లందున నమరఁ గొలువు
లును సగ మ్మిడఁగా వలయునయ మాకు! (5)

అట్లు కాక, దౌర్జన్యాన నందిరేని,
తీవ్ర యుద్యమమ్మిట రేఁగు! తెలిసి తెలిసి
గిల్లి కజ్జాల జోలిని నొల్లనట్టి
మమ్ము రెచ్చఁగొట్టిన మీకె సుమ్ము నష్ట
మొదవుఁ గావున మానుఁడు! ముదముఁ గనుఁడు! (6)

ఇంక రాయల తెలగాణ నిత్తు మంచు,
మా యభిప్రాయ మడుగంగ, నీ యదనున,
మా తెలంగాణ మొప్పదు! మంచి కాదు!
కుట్ర మానుఁడు! పది జిలాల్ కోరి యిడిన,
నొప్పుకొందుము! రా.తె.ను నొప్పుకొనము! (7)

భద్రగిరి మునగాలలు, హైద్రబాదు,
మరియు శ్రీశైల ప్రాంతాలఁ దఱచి తఱచి,
దుష్ట చింతనతోఁ గోరఁ గష్ట మొదవు!
నిదియ మీ యబ్బ సొమ్మౌనె? వదరకోయి! (8)

పోలవరము ప్రాజెక్టును నేల యిట్లు
కట్టుచుంటిరి? కట్టిన బిట్టుగా "డి
జైను" మార్చినచో నొప్పుగాను ముప్పు
తప్పునోయయ్య! యట్టులే తగిన రీతి
నీటి వాటాల లెక్కించి, నిక్కముగను
నిరువుఱును బొందఁగా వలె నేర్పు మెఱయ! (9)

పోలవరమును గట్టుచోఁ బూర్తిగాను
ముంపు లేకుండ, నష్టాల మున్గకుండ,
నెట్టి నిర్వాసితులు లేని యట్టి విధము
నొప్పుకొందుము! లేనిచో నొప్పుకొనము!
కాన, జాగ్రత్త యాంధ్రుఁడా కని మసలుము!! (10)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

సోమవారం, నవంబర్ 25, 2013

సకల దుర్మార్గ పూరిత చరితులు!



(1)
రాహుకేతులు క్షణములే గ్రహణమంద;
నైదు పుష్కరాల్ సీమాంధ్రు లధివసించి,
మా తెలంగాణ తేజమ్ము మఱుగున నిడి,
తామె యెదిగిరి మము దోచి, దర్పితులయి!

(2)
పాండవులుఁ గోర నైదూళ్ళు, ఖండితముగ
నీయనని సుయోధనుఁడు మన్నింపకుండె!
"నొక్క పైసైన నీయను నిక్కముగ" న
టంచుఁ గిరణుండు వల్లించె నాగ్రహించి!

(3)
నూఱు తప్పుల శిశుపాలు నొప్పి, పిదప,
సంహరించిన కృష్ణుని చరిత ఘనము!
లెక్క లేనన్ని తప్పులు మిక్కిలిగను
మించ, సీమాంధ్రుల నిట సహించినట్టి
మా తెలంగాణు లెంతయో మంచివారు!

(4)
ఏకచక్రపురజను లనేకులఁ దిని,
బాధలిడె బకాసురుఁ డట వనమునందు!
మా తెలంగాణమందు సీమాంధ్రు లెన్నొ
భూజలోద్యోగనిధులనుఁ, బూరి మేయు
తరి, భుజించిరి నవ బకాసురులు నయ్యు!

(5)
"చచ్చెనయ్య, యశ్వత్థామ చచ్చె"నంచు
ధర్మరాజు బొంకెను నాఁడు ధర్మపరుఁడు!
"భద్రగిరి మునగాలలు పలు విధముల
మావె"యంచు సీమాంధ్రులు మఱి యబద్ధ
మాడి రిట నీటికై యధర్మపరు లయ్యు!

(6)
బాలు నభిమన్యుఁ గాపాడు పాండవులను
సైంధవుం డడ్డె నాఁడు దుస్సాహసమున!
నేఁడు సీమాంధ్రు లడ్డిరి నీచ కృతుల,
మా తెలంగాణ మిడఁ గేంద్ర మాస్థఁ జేయు
సకల కార్యమ్ములను దుష్టచరితు లయ్యు!

(7)
భారతేతిహాసమ్మున వంచకులగు
నిట్టి సీమాంధ్రు లున్నచో నట్టి జయముఁ
బాండవులు పొందఁ గందురే? దుండగులగు
నిత్య దుష్కర్మఠులు వారు, నీచజనులు!

(8)
మా తెలంగాణ, "శని" వోలె, మత్సరమున,
రాష్ట్ర మేర్పడకుండఁగా భ్రమలతోడ
నడ్డుచుండిరి స్వార్థ కృత్యముల నేఁడు
సకల దుర్మార్గ పూరిత చరితు లయ్యు!


(ఇది Suneel Rajavaram, Calgary, Canada గారి వచనకవితకు పద్యరూపము)
["కట్టా-మీఠా" బ్లాగు సౌజన్యంతో కృతజ్ఞతా పూర్వక స్వీకరణం]

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


ఆదివారం, నవంబర్ 24, 2013

బూదిలోఁ బడ్డ పన్నీరు పోలిక యగు!



పోలవరము ప్రాజెక్టుకై పూని యిచటి
"భద్రగిరి మా"దటంచును బలుకుచుండ్రి!
మాయఁ దెలియని వారల, మాయ చేసి,
మోసగింపఁగఁ దలచిరి మోసకాండ్రు!

వేగిరముగ నాగార్జునసాగరంపు
నెడమ కాల్వపై యధికార మెడఁదఁ దలఁచి,
"మాదె మునగాల"యంచును మండుచుండ్రి!

యట్లె "శ్రీశైల ప్రాజెక్టు నాంధ్రభూమి
లోననే కట్టి, రిట మీకు దాని మీద
నెట్టి యధికారమే లేదు; నిలువకుఁ డిట"
యంచుఁ బలుకుచు, విద్యుత్తు నడుగకుండ,
నీర మడుగకుండఁగ జాగ్రత్త నెఱపుచుండ్రి!

మా తెలంగాణ కొలువుల నీతిమాలి,
కొల్లగొట్టిన రీతులు తెల్లమగు న
టంచు భయపడి, "యెన్‍జివో"లందఱ నిట
రెచ్చగొట్టుచు నుండిరి రీతి లేక!

హైదరాబాదు భూమిపై యాధిపత్య
ముంటకై, దాని యభివృద్ధి మొత్తమునకు
"మేమె" కారణ మంచును మిడుకుచుండ్రి!

యెన్ని వేషాలు వేసిన, నేమి వదర,
నవియ కేంద్రమ్మునకును సువిదితమోయి!
రాష్ట్ర విభజన తథ్యమ్ము! ప్రజలమైన
మాకుఁ దెలగాణ రాష్ట్ర సమ్మాన మందఁ
జేయు దినము సమీపానఁ జేరుచుండె!

కేంద్ర మిచ్చిన మాటను క్షేమ మెంచి,
వేగ నెరవేర్చుచున్నట్లు విదిత మాయె!
కాని, సీమాంధ్ర నేతలు క్షణము క్షణము
నక్కజిత్తులతో దాని నాపఁ బూని,
చిత్ర చిత్రంపు వ్యూహాలఁ జెలఁగుచుండ్రి!

యైన నన్నియు వ్యర్థమ్ము లగును సుమ్ము!
బూదిలోఁ బడ్డ పన్నీరు పోలిక యగు!!


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శనివారం, నవంబర్ 23, 2013

"మావి...మావి" యనంగనే, మీవి యగునె?

భద్రగిరి మునగాలలఁ బలువిధముల
నెందఱో రాజు లంది, పాలించఁగాను,
కీర్తిఁ గన్నట్టి తెలగాణ కృపను గొన్న
యా నిజాం రాజులే, దయ నందఁ జేయఁ,
గొన్న మదరాసు ప్రెసిడెన్సి నున్న దొరలు
పాలనము చేసి నట్టివై వఱలిన యవి,
మనకు స్వాతంత్ర్య మబ్బిన మంచి సమయ
మందు మదరాసు రాష్ట్రమ్మునందు, నట్లె
యాంధ్ర రాష్ట్రమ్ములో నుండి, యంతలోనఁ
దరలె నాంధ్రప్రదేశమ్ముదౌచు మఱల!

మా తెలంగాణ పాలనమందు నుండి
తరలి పోయిన గ్రామాలు తిరిగి వచ్చి,
మా తెలంగాణముం జేరె మహితముగను!

ఆంధ్ర పాలన మందున నవియ యాఱు
వత్సరములున్న కారణావసరముననె
"మావె యా గ్రామము"లటన్న, మఱియు నవియె
వందలేండ్లుగఁ దెలగాణ మందుఁ బాలి
తములుగా నుండె మేమేమి తఱచి యనఁగ
వలెను? మావె యవియ కావె? వలదు చర్చ!

మా తెలంగాణ నడ్డఁగా మంచి యోచ
నమ్మె! "యీ గ్రామములు మావె, నమ్ముఁ"డనుచు,
విషముఁ జిమ్మెడి వాక్కులు! వేగిరమున
నిట్లు పల్కఁగ నఱువ దేండ్లెచట నుండ్రి?
యెన్నఁడైనను నంటిరే? "యివియ మావి"
యనుచు! నఱువ దేండ్ల క్రితము నట్టి వాని
మా తెలంగాణలోఁ ద్రోచి, మఱలి చూడ
కుండఁ జేతులు దులిపితిరండి మీరు!

అఱువ దేఁడుల నుండియు నాదరించి,
పెంచి, పెద్దఁ జేసిన యట్టి పెద్దవారి
పెంపకము నాదరించెడి విధ మిదేనె?
యెట్టి యభివృద్ధి చేసితి విట్టివాని?

ఆదరించని యమ్మయే యఱ్ఱుఁ జాచి,
నటనఁ జేయుచుఁ బల్కఁగా, నవియె యిచట
మా తెలంగాణలోఁ జేరి, మమతఁ బొంది,
యైక్యతనుఁ జాటుచుండఁగ, నయ్యొ, యయ్యొ!
మావి యెట్టులు కావయ్య? మతియ లేదె?
నోరు మూయుఁడు! మాటలు మీఱఁ బోక,
పరువు దక్కించుకొనుఁడయ్య పలుకుఁ దక్కి!

పుట్టి పెరిగెను తెలగాణ! మెట్టెను మద
రాసులో! స్వతంత్రమ్మదె రాఁగ, నాంధ్ర
రాష్ట్రమందున మూఁడేండ్లు క్రాఁగి క్రాఁగి,
పిదప మీ దుష్ట రాజకీయ దమన కృత
ముననె యాంధ్రప్రదేశాన మూఁడు నేండ్లు!
మొత్త మాఱేండ్లె పాలన మ్మొదుగ, మీరు
వానిఁ బాలింపఁగా నిష్టపడక తిరిగి
మా తెలంగాణలోఁ జేర్చి, మఱల యిపుడు,
కుట్రపూరిత యోచనఁ, గోరి, వాని
"మావి మావి" యనంగనే, మీవి యగునె?


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గురువారం, నవంబర్ 21, 2013

పోలవరము వర మిడదు! ముంపు నిడును!


భద్రగిరిఁ బొంది, మీ పోలవరము నిచట
నిర్మితము సేయఁ గుట్రల నెన్నొ పన్ని,
"మేల్మి బంగారమే యయ్య మే" మటంచుఁ
బల్క, నమ్మెడి వారమే? వదరఁ బోకు!

ఇచటి భద్రాచలాలయ, మిచటి జనులు,
వీరిపై ప్రేమ మీ కున్న వేగిరముగఁ
బోలవరమందుఁ బ్రాజెక్టు పూన్కి నాపి,
ముంపు నందెడి భద్రాద్రి కింపు నిడుఁడు!

పోలవర మిట నిర్మింప మునుఁగు నంచు
నమ్ముఁ డెనుఁబది మూఁడు శాతమ్ము గ్రామ
ములును! మూఁడు లక్షల జనములు నుపాధి
లేక నిర్వాసితులు నయి, లేమిలోనఁ
గూర్పఁ బడుదురు! బాధలఁ గోరఁ దగునె?

ఇరువదియు నైదు వేల యెకరములు గల
యటవి నీటను మున్గును! నటులె రెండు
నూర్ల డెబ్బది యైదగు నూళ్ళు మునుఁగు!
పాపికొండలు, పేరంట్ల పల్లి మునిఁగి,
నీటి కడుపున నివసించు నిజము సుమ్ము!

నేఁడు పదునేను నడుగుల నీటిమట్ట,
మది నలువదియు మూఁడడ్గు లటు పయిఁ జను!
భారి వర్షమ్ము వచ్చిన వరద హెచ్చ
రికయె నల్వదెన్మిది గంటలకును ముందె
జారి యగుచుండ, ప్రాజెక్టుఁ గోరి యిచట
నిర్మితముఁ జేయు తదుపరి నెట్టు లుండు
నో యటంచు నూహింపఁ గదోయి! యితర
ప్రాంత సంబంధముల్ తెగు! వైద్య, విద్య.
గిరిజ నోపాధు లన్ని దుష్కరము లగును!

గిరిజనులఁ గావ మైదాన పరిధులకును
దీసికొని పోవ నేజన్సి వాస చట్ట
మెటులు వారికి వర్తించు? నేది దారి?

సరియె పోనిండు! భరత దేశమ్మునందె
మిగులఁ బ్రాచీన జాతిగ నెగడునట్టి
కొండ రెడ్ల తెగయె యిటనుండి తొలఁగు!

ఎనిమిదౌ గ్రామములు మున్గు నిచట యనియుఁ
బల్కి, "యొడిశా"యె పెట్టె నభ్యంతరమ్ము!
ఇన్ని భద్రాద్రి గ్రామా లవెట్టి దుఃఖ
మందఁగాఁ గోరు దీవు? తమంత తాము
వెలికి వచ్చి, భద్రాద్రినిం గలుప వలదు
నాంధ్రలోపల నంచును నార్తి తోడఁ
బల్కుచుండి రీ ప్రజ! పోలవరము నాపి,
జరుగఁ బోవు విలయమునుం జరుగకుండఁ
గావఁగా నాంధ్రుఁడా నీకుఁ గరుణ లేదె?
కర్కశుండవే? యిఁక నైన గాలి మాట
లాపి, భద్రాద్రి జోలికి రావలదయ!

పోలవరము ప్రాజె క్టదియేల నీకు?
నెన్నొ దుష్పరిణామాలు నున్న దదియ!
నీదు బాగుకోసమె యిట, నాదు బాగు
నాశ మొనరింతువే? యన్యాయమునకు
నడుము కట్టెదవే? దుర్జనుఁడవె నీవు?

మంచివాఁడవు నీవైన, మాన్యతఁ గన,
భద్రగిరి జోలికే రావ వలదు! కోర,
పోలవరము వర మిడదు! ముంపు నిడును!


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

బుధవారం, నవంబర్ 20, 2013

భద్రగిరి తెలంగాణదే! బాధ యేల?


పూర్వ కాలమ్ము నుండియుఁ బూర్తిగాను
భద్రగిరి తెలంగాణలో భాగమోయి!
యెందఱో రాజవంశాల కందఱకును
బూజనీయ మ్మిదౌచు సమున్నతిఁ గనె!

కుతుబు షాహీల్, నిజాములు కూర్మితోడఁ
బాలనము సేసి, ప్రగతితో వఱలఁ జేయఁ,
దానిషా బంటు గోపన్న తనరు నట్టి
యాలయమ్మును గట్టించి, యర్చ సేసె!
నాంగ్ల పాలకుల్ గోరంగ నట్టి దాని
నిచ్చె మద్రాసు ప్రెసిడెన్సి యేలుబడికి!

భారతావని స్వాతంత్ర్య భాసమాన
మూర్తి కాఁగాను, నేఁబది మూఁడు వఱకు
నదియ మద్రాసు రాష్ట్రాన నటులె యుండె!

ఆంధ్రరాష్ట్ర మేర్పడిన సందర్భమందు
నేఁబదాఱున తూ.గో.జి. కిడిన పిదప,
నేఁబదియుఁ దొమ్మిదిన దాని నిడిరి ఖమ్మ
మునకు! నాఁటి నుండియు నది పూర్తిగాను
మా తెలంగాణ మందున మాకుఁ జెందె!

ఆంధ్రవారల పాలన యందు నదియ
కేవల మ్మాఱు వత్సరాల్ కిరికిరిఁ బడె!
నిట్టి కాలమ్ము నందున నిడుము లందె!
జిల్ల కేంద్రమ్మునకుఁ బోవఁ జిక్కు లెన్నొ?

ఐదు వందల మైళ్ళ ప్రయాణమునకు
లేవు రహదారులు! వరద లిచట రాఁగ,
నాదుకొనువారు లేక యున్నార లిచట!
వైద్య సౌకర్యములు లేవు! విద్య లేదు!

ఏఁబ దెన్మిదిలో గుడి కేగి, రాము
దర్శనము సేయఁగా నెంచి, తరలి వచ్చు
రెండు పడవల నున్నట్టి రెండు నూర్ల
జనులు, పడవలున్ మున్గఁగాఁ జచ్చినారు!

ఇన్ని బాధలఁ బడుచుండ నేమి కతనొ,
విడిచి, ఖమ్మ మందునఁ జేర్చి, పీడ వదలె
నంచుఁ జేతులు దులుపుకొన్నారు మీరు!

అట్టి వారలౌ మీ రిప్పు డాదరమున
"భద్రగిరి మాది" యన్నచో, ఫక్కున నగి,
మూతి మీఁదొక్క టిత్తురు! మూర్ఖు లయ్యు
నిట్టి భద్రాద్రి విడిచియు, నేఁడు పోల
వరము ప్రాజెక్టు నిర్మాణ వరము నందఁ
గోరి, భద్రాద్రి మునిఁగినన్ గూడ లెక్క
సేయకయె యుందురయ్య విచ్చేసి యిటకు?

పోలవరము వలన నెంత ముంపు కలుగు
నో తెలిసియును భద్రాద్రి నోరి కొలఁదిఁ
గోరుచుండి రనంగనుఁ, జేరి యడుగు
టిద్ది ప్రేమతోఁ గాదయ్య! హితముఁ గాదు!

దీని దుర్బుద్ధి తోడనే, తెలిసి తెలిసి,
యడుగు చుంటిరి! దీని, దుఃఖార్తిఁ ద్రోచి,
ముంపునకు గుఱిసేయు తలంపు తోడ
నే యటంచు మే మెఱుఁగమే? నీచ బుద్ధి
బయటఁ బెట్టితి రోయయ్య! వగలమారి
కోర్కి మీదయ్య! భద్రాద్రి, కూర్మిఁ బంచు
నట్టి మాదయ్య! మా హక్కు! నటులె మీకు
హక్కు లెటు లబ్బు? నాఱేండ్ల హక్కె మీది!

వంద లేండ్లుగ మాదెయౌ భద్రగిరిని
మీకు నెట్టుల నిత్తుము మేలు విడిచి?
దుష్ట చింతన తోడుత నిష్ట మనుచు
ననఁగనే, మీకు నిత్తుమే యాంధ్రవాఁడ?

మూఁడు వత్సరా లాంధ్రలో, మూఁడు వత్స
రమ్ము లాంధ్రప్రదేశానఁ గ్రాఁగి, క్రాఁగి,
చివరి కీ తెలంగాణమ్ముఁ జేరి, సుఖము
లందు భద్రాద్రి, వేఱుచేయంగఁ బూను
హక్కు లేదోయి నీ కిప్పు డాంధ్రవాఁడ!
భద్రగిరి తెలంగాణదే! బాధ యేల?


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, నవంబర్ 18, 2013

మొసలి కన్నీరు కపటప్రే మసలె వలదు!


నాఁడు తెలగాణ వీరుల నణచి పట్టి,
కట్టి, బలవంతముగఁ దెలంగాణ లోన
నుద్యమము నాపి నందున, నొచ్చి నట్టి
వీరవరు లంత, నక్సలైట్ పేర నడచు
దళమునందునఁ గలిసిరి! తప్పు మీది!

నేఁడు తెలగాణ నాపుచో, నిక్కముగను,
నక్సలైట్ దళము లవెన్నొ నడచు నోయి!
పిల్లి నింట బంధించినఁ బెనఁగి, యదియుఁ
దిరుగఁబడుఁ గాదె! తెలగాణ ధీరు లంతె!

నక్సలిజ మెంతయో హెచ్చు ననుట మాని,
దాని నాపఁగఁ, దెలగాణఁ దగిన రీతి,
రాష్ట్రముగఁ బ్రకటింప, శీఘ్రగతిని నది
రూపు మాయును; శాంతియే రూపుఁ గొనును!

"విభజనము వల్లఁ దెలగాణ పెద్ద నష్ట
మందఁ గలదయ! విద్యుత్తు మందగించు;
జలవివాదాలు చెలరేఁగు; సత్య" మనుచు
మొసలి కన్నీరు కార్చుచు, ముంగిస వలె
నంగి మాటల కపటమ్ము నమ్మ మయ్య!

దొంగ ప్రేమను నటియించి, దోచుకొనఁగ,
నెత్తుగడఁ బన్నఁ, దెలియమే, నీదు మాయ?

నష్టపోయినఁ, దెలగాణ నష్టపోవు!
దాన, మీ కేమి కష్టమ్ము? తరలి పొండు!
తరలి పోయి, లాభమ్ముల నరసికొనుఁడు!

మీరు మా తోడఁ గలువక, మిడుకు నాఁడు,
తిరుపతి బెజవాడయు మరి విశాఖ
పట్టణా లెట్టులుండె? నేఁ డెట్టు లుండె?
నట్టి యభివృద్ధి, తెలగాణ నష్ట పఱచి
నట్టి ధనముతోఁ గాదె? మానవత వీడి;

ఆశ పడుట కెంతైన హద్దు లుండ
వలయు! వట్టి మాటల నాపి, వచ్చి నట్టి
సదవకాశమ్ము నందినఁ జాలు మీకు!
కల్లబొల్లి మాటల నిఁకఁ గట్టిపెట్టి,
బాగుపడు బాట పట్టుఁడు! వలదు వలదు
మొసలి కన్నీరు, కపటప్రే మసలె వలదు!


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కేంద్ర మెఱుఁగును సీమాంధ్ర కృతము లన్ని!


 

విభజనము సేయు నిర్ణయ ముభయ నేతృ
వర్గ చర్చల పిదపనే వలచి కేంద్ర
మీ తెలంగాణ రాష్ట్ర నిర్మితము సేయఁ
బ్రకటనము వెల్వరించెను! రాజకీయ

లబ్ధి కోసమై సీమాంధ్రు లంత చేరి,
"విభజనము వల"దంచును సభలు చేసి,
కుట్రలు కుతంత్రముల నెన్నొ కోరి, చేయఁ,
గేంద్రమునకుఁ దెలియునయ్య, కిరణు మొదలు

నాంధ్ర నేతృ మనోగ తోన్మాద కృతులు!
నెన్ని తైతక్క లాడిన, నెన్ని గతుల
లాబియింగులు సేసిన లబ్ధి సున్న!
కాన, కుట్రలన్ మాని, సఖ్యతను గనుఁడు!!

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

శనివారం, నవంబర్ 16, 2013

కుట్రలూ...కుతంత్రాలూ...తెలంగాణను ఆపలేవు!



(1)

మా తెలంగాణమ్ము నాంధ్రను
గలిపి నప్పటి పెద్ద మనుషుల
అగ్రిమెంటును ఆచరించక,
మంటగలిపిరయా!

(2)

లోటు బడ్జెటు మీది కాగా,
అధిక బడ్జెటు మాది కాగా,
మమ్ము దోచియు లోటు పూడ్చిన
ఘనులు మీరయ్యా!

(3)

ముల్కి రూల్సు నతిక్రమించియు,
మా కొలువులను దోచి, మీరలు
మమ్మమాయకులనుగ మార్చియు,
మాయ జేసిరయా!

(4)

నీటి వనరుల వాట లేకయె,
అక్రమమ్ముగ మఱల జేసియు,
తెలంగాణము నెండ బెట్టిన
కీర్తిమీ దయ్యా!

(5)

ఆరువందల పదియు జీవో
తుంగలో దొక్కియును, కొలువులు
స్వవశమందున బెట్టుకొనియును,
వెక్కిరించిరయా!

(6)

వలస రాజ్యము పాదుకొనగా,
కొల్లగొట్టిరి భూములెన్నియొ!
ఏ బినామీ పేర్లతోడనొ
వ్యవహరించిరయా!

(7)

వనరు లుండిన తెలంగాణనె
విద్యు దుత్పత్తులవి యుండగ
వలెను! కానీ, ఆంధ్రలోపల
వెలయజేసిరయా!

(8)

కలిసి యుండిన కలవు సుఖముల
టంచు బలుకుచు, మోసగించియు,
మాకు సుఖములు! మీకు దుఃఖము
లనుచు పంచిరయా!

(9)

ఒక్క పైసా నీయ నంటూ,
నిధులు సీమాంధ్రమునకే యిడి,
మొండి చెయ్యే తెలంగాణకు
చూపుచుండిరయా!

(10)

మాయ మాటలు చెప్పి చెప్పీ,
అరువదేండ్లుగ దోచుచుండిరి!
తెలంగాణము నీయు మనగా
అడ్డుపడిరయ్యా!

(11)

మా తెలంగాణమును తిట్టుచు,
సమైక్యాంధ్రమ్మంచు పలుకుచు,
కలిసి జీవించుటయు నెట్లో
చెప్పకుండిరయా!

(12)

కేంద్ర మిప్పుడు తెలంగాణను
ఈయబూనగ, సమైక్యాంధ్రను
ముందు నిలిపీ, లాబియింగును
జేయబూనిరయా!

(13)

అన్నదమ్ములటంచు బలుకుచు,
కలుములన్నకు, లేమి తమ్ముల
కీయ దలచిన యట్టివారలు
అన్నదమ్ము లెటుల్?

(14)

వేరు పడిననె మేలు కలుగును!
మీది మీరే, మాది మేమే!
తెలంగాణకు అడ్డుపడినను
కేంద్ర మిడునయ్యా!


జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

శుక్రవారం, నవంబర్ 15, 2013

చివరి దశలోనఁ గుట్రలు చేయు టేల?



"మార లేదయ్య నా మాట! తీరు కూడ!
రాష్ట్ర మది సమైక్యమ్ముగా రాజిలఁ గను
వృద్ధి యెసఁగును! విడిపోవ వృద్ధి లేదు!
నక్సలిజము పెరుఁగును కనంగ మనము!

కాన, కలిసి యుండుఁ డటంచు నేను చెపితి!!"
ననుచు ముఖ్యమంత్రిగఁ బల్కఁ గను నసత్య
వచనుఁ డనుటకు సందేహ మిచట వలదు!
నాఁడు నీవు వల్కిన మాట నమ్మితి మయ!

కాని, యాడి తప్పిన, గొప్ప యౌనె నీకు?
’కేంద్ర మే నిర్ణయముఁ గొన్నఁ గిరణుఁ డద్ది
తలను దాల్చు’ నటంచును బలికి నట్టి
మాట, కేంద్రంపు నిర్ణయమైన పిదప,

దాని తలఁదాల్చకయె, యసత్యంపు మాట
"నే సమైక్య వాదిని" నంచు నిక్కముగను
పల్కి, "నే మార లేదయ్య! పలుకు కూడ
మార లే" దని, తెలగాణ మౌనముగను

వినఁగఁ, జెవిఁ బువ్వుఁ బెట్టెదో పెద్ద సారు?
విలువ కాపాడుకోవయ్య! తెలిసి తెలిసి
మాట మార్చంగ నొప్పునే? మాన్యతగునె?
"ఇట్టి స్థితిలో సమైక్యతే యిమ్ము లొసఁగు!

రెండు వేల పద్నాలుగు దండిఁ గనెడు
నెన్నికల దాఁక నట్టులే మిన్నకుండుఁ
గేంద్ర" మంచుఁ బల్కంగను; గేంద్ర మిపుడు
చేయు కృతములు వట్టివే? చిత్రముగను

బల్కు పల్కులు కేంద్రమున్ బరిహసించు
నట్టివే, ముఖ్యమంత్రీ? వినంగ మేము
తెలివి లేనట్టి వారమా? స్థిరత గలుగు
మా తెలంగాణ చేఁతలు మఱచినావె?

విభజనము చేయకున్ననే, వేగముగను
నక్సలిజము హెచ్చును! నిద్ది నమ్మి, నీవు
విభజనమ్ముకై తోడ్పడి, ప్రేమ లెసఁగు
నెడఁద తోడుత, విడిపోవ నొడఁబఱచియు

సహకరించిన మెప్పు నొసంగెద మయ!
లేనిచోఁ గేంద్రమే నిన్ను హీన పఱచు!!
మాట దక్కించుకోవయ్య మాన్య వర్య!
విలువ దక్కించుకోవయ్య ప్రేమ పంచి!!

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

గురువారం, నవంబర్ 14, 2013

ఆత్మగౌరవ ప్రద..ధీర..యౌచు, వచ్చుచుండె నా తెలంగాణ !


(1)
అఱువ దేండ్ల నిరీక్షణ మ్మంతరింప,
స్వేచ్ఛ నందియు, వెలుఁగుచుఁ, జిత్రముగను
బది జిలాల ప్రజలుఁ బిల్వ, వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(2)
హైదరాబాదుతోఁ గూడి, యంచితముగ,
నాంక్షలే లేని రాష్ట్ర బంధమ్ముఁ గొనియుఁ,
బ్రజల నానంద పఱుపంగ వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(3)
రామదాస నిర్మితము భద్రాద్రి రామ
సహిత భద్రాచలముఁ గూడి, సరగున నిటఁ
బ్రజలు సంతోషమునఁ బిల్వ, వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(4)
సకల జనముల కోటి యాశలు చిగుర్పఁ
జేయు నవరాష్ట్ర యుక్త సంచిత శుభాలఁ
బంపకముఁ జేయఁగాఁ దాను వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(5)
ఇర్వ దెన్మిది రాష్ట్రాల కెంతయుఁ దగు
రమ్య రాష్ట్రమ్ము కేంద్ర మలంకరింపఁ;
బరుగు లెత్తుచు, వేగమే వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(6)
సకల జనుల కష్టముల సమయఁ జేసి,
సంతసముఁ గూర్చి, తఱుఁగని సంపద లిడి,
పావన మొనర్చి, కావఁగ వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!


జై తెలంగాణ!       జై జై తెలంగాణ!

మంగళవారం, నవంబర్ 12, 2013

హైదరాబాదు భద్రాద్రు లగును మావె!


శార్దూలవిక్రీడిత మాలిక:

మా రాష్ట్రమ్మును గోరఁ, గేంద్ర మిపుడున్ మా రాష్ట్ర మీఁ బూనఁగా,
మీ రీ హైదరబాదు ’యూటి’గను నిర్మింపంగఁ గోరన్, భలే
వారోయీ! బెజవాడనున్, దిరుపతిన్, వైజాగునున్ ’యూటి’ కాఁ
గోరం బోతిమె? మీర లిట్టు లనుచున్ గోరంగ సద్వాదమే?

మీరే యీ నగరంపు వృద్ధి నెచటన్, మించంగఁ జేపట్టిరో,
బీరాలన్ బలుకంగ మాని, చెపుడీ, పేరాస లేకుండఁగా!
నౌరా! కోట్లు పదేను వేల నట మీ యయ్యల్ దగం దెచ్చిరా?
మీ రే కష్టముఁ జేసి, పైస లిచటన్ మేలెంచి వెచ్చించిరే?

మా రాష్ట్రమ్మును గల్పు వేళ మిగులుం బడ్జెట్టు మా దౌటచే,
మీ రాష్ట్రమ్మున లోటు బడ్జె టగుటన్, మీ ఖర్చుకే లేకయున్,
మీ రా డబ్బును దోచి, ఖర్చు లిడి, “మేమే వృద్ధిఁ జేశా”మనన్,
ధీరమ్మే? యెవరైన మెచ్చెదరె? లేదే మీకు సిగ్గున్, శరం

బీ రో జిట్టి ఘనంపు మీ బ్రతుకు మా పేదల్ తెలంగాణులే 
యా రో జట్టుల భిక్ష నిడ్డ కతమే! యావ త్తెలంగాణులన్ 
మీ రీ రీతిని మోసగింపఁ దగునే? మేలౌనె మీ కిద్దియున్? 


స్వైరోచ్చారణ మీరు సేయఁ దగునే? భద్రాచల ప్రాభవ
ప్రారబ్ధుల్ తమరా? నిజాము తమరా? రామాలయ మ్మందునన్
మీ రొక్కమ్ములు, శిస్తు లెన్ని కలిసెన్? మీ రెక్క డున్నారలో?

కారోయీ యిట స్థానికాఖ్యు లనఁగన్! కంచెర్ల గోపన్న శ్రీ
కార మ్మిచ్చట నాలయమ్ము కొఱకై కావింప నిర్మాణమున్,
దా, రొక్కమ్మది రాజ ద్రవ్య మగుటన్, ద్రవ్యమ్ము వెచ్చించుచున్,

“నా రాముండు భరించు నన్ని” యనుచున్, ధన్యాత్ముఁడైనట్టి త
త్పౌరున్, భక్తుని, రామదాసుఁ జెఱనున్ బంధింపఁగాఁ దానిషా; 
మా రామయ్య మహోన్నతంపు మహిమన్ మన్నింపఁ దానీషఁ, దాఁ 
జేరం బోయియు, రొక్కమిచ్చి, విడిపించెన్ రామదాసున్ వెసన్! 

ఆ రాజప్పుడు తప్పు సైఁచు మని తా నా రాముఁ బూజింప, స
త్కారమ్ముల్, పలు రీతి సౌరు లమరన్, గళ్యాణ మింపారఁగన్,
జేరంగాఁ జని, మేలి ముత్యములఁ నిచ్చెన్ గాఁ దలంబ్రాలు! వే,
ధారాదత్తముఁ జేసె మాన్యముల సన్మాన్యాది సంసేవకై!

మా రామయ్యయు, రామదాసు, ప్రభువౌ మా తానిషల్ స్థానికుల్!
మీ రీ బంధము లేవి లేని పరులే! మీదైన భద్రాచలం
బౌరా! నోళ్ళును మూయ, వృద్ధిఁ గనకే, పర్వెత్తె షష్ట్యబ్దముల్!

మీ రీ వేళ మహాప్త భక్త తతి సంప్రీతాస్థ వాక్యమ్ములన్
గోరన్, మీ దిది యౌనె? యెట్టు లగునో? గోపన్న మీ వాఁడె? ప్రా
పా రాజన్యుఁడగున్ నిజాము ప్రభుఁడే భద్రాద్రిఁ బాలింపఁగా;

నా రాజెద్దియ రాజధాని యనెనో యా హైద్రబాదే యిటన్
సారాచార విచార సార్వజనియౌ భద్రాద్రిఁ దా నిమ్ముగా 
సారించెన్ బరిపాలనమ్ము! కనుకన్, సాగెన్ దెలంగాణలోఁ; 

బారమ్మిద్దియ! రాజ్య మిద్దియ కదా! భద్రాద్రి మాదే కదా! 
మీ రెట్లందురు మాదె యంచు నిపుడున్? మీ దెట్లు? మాదే కదా! 

జై తెలంగాణ!                  జై జై తెలంగాణ!

శనివారం, నవంబర్ 09, 2013

షరతులే లేని తెలగాణఁ ద్వరగ నిడుఁడు!


అఱువ దేఁడుల నుండి పోరాడుచున్న
మా తెలంగాణ జనముల మానసమున
హైదరాబాదుతోఁ గూడినట్టి దైన
నవ్య తెలగాణ రాష్ట్రమ్ము నాదరమున,
షరతు లేమి విధింపక, సరగున నిడి,
వేడుకను గూర్పఁ గేంద్రమున్ వేడుచుంటి!

మా తెలంగాణ జనులు నమాయకులని,
మమ్ము వంచింపఁ జూచు సీమాంధ్ర నాయ
కుల కుటిల బుద్ధి నెఱిఁగి, చేకూర్పుఁడు హిత
మనుచు, వేడుచుంటిని కేంద్ర ఘనుల నిపుడు!

అఱువ దేఁడుల నుండి మే మన్ని రంగ
ములలొ మోసగింపఁ బడియు, నిలిచితి మిట!
ఇంక మోసగింపక, మాకు హితము గలుగు
కృత్యములు సేయఁ గోరెదఁ గేంద్ర ఘనుల!

జై తెలంగాణ!          జై జై తెలంగాణ!

శుక్రవారం, నవంబర్ 08, 2013

మేం తెలబానుల మైతే…మీరు తెలబాన్ధ్రులు కారా? (2)




మేము విజయమ్మ నడ్డిన మెచ్చుకొనక,
“తీవ్రవాదు లీ తెలబాన్లు! ద్వేషమునను
నడ్డుచుండిరి! రాజ్యాంగ హక్కు నిటులఁ
ద్రోచి రయ వీరు! నేత నాక్రోశమునను
రా వలదటంచుఁ బల్కంగఁ, బ్రజల నెట్లు
తిప్పలను బెట్టెదరొ”యంచుఁ దెలివి తప్పి,
మాటలాడంగ సరియౌనె? మాకు నామె
యిచ్చిన వరాల మాటల వెక్క డయ్య?

“ఓ తెలంగాణ ప్రజలార! నీతి తప్పి
నేను నడువను! తెలగాణ నిచ్చునట్టి
దాన నేఁ గాను! కేంద్రమ్మె దాని నిచ్చు!
మీ తెలంగాణ సెంటిమెంట్ మేము గౌర
వింతు మయ్య! నా భర్త యా వేళ మీకు
నిడఁ దెలంగాణమును బాగనెంచి, ఢిల్లి
హై కమాండుకుఁ దెలిపెను! మాకు మీర
లోటు వేయఁ గృతజ్ఞతఁ జాటుకొందు!”
మనుచు మాట్లాడి, నేఁ డిట్లు మాట తప్పి,
“జై సమైక్యాంధ్ర!” యనుచును సాఁగి వచ్చి,
మా తెలంగాణలో “సానుభూతి యాత్ర”
పేరఁ “దెలగాణ వ్యతిరేకి”, తీరు మార్చి,
యడుగు పెట్టంగ నడ్డరే యామె నపుడు?

మా మనోభావమ్ముల మాత్ర మామె
గాయ పఱుపంగ వచ్చునే? కనుక మేము
నడ్డుకొంటిమి నిరసన నందఁ జేయ!

మాట తప్పిన వారికి మంగళార
తుల నొసంగియు స్వాగతింతురె జనులిట?

“మా స్థలమ్ముకు రావద్దు, మాను”మనుచు
నిరసనముఁ దెల్ప; వచ్చిన నేమి కతము?
మమ్ము పరిహసించుటె కాదె మఱల మఱల?
“నిరసనముఁ దెల్పరా” దన, నేమి యిదియె
బ్రిటిషు పాలనమే? లేక, వేఱె యౌనె?

మా మనోభావముల గాయ మందఁజేయ,
మా నిరసనఁ దెల్పెడి హక్కు మాకు లేదె?

నాఁడు “సైమను గో బ్యా” కనంచు నాంధ్రు
లందఱును నడ్డరే తీవ్రమైన కృతుల!
నేల నడ్డిరి సైమను నిట్టి జనులు?

అట “సమైక్యాంధ్ర” పేర మీ రడ్డగించి
యున్న సీమాంధ్ర నేతల కెన్ని యడ్లు
పెట్టితిరొ మీరు మఱచిరే విలువ తప్పి?

బొత్స బంధువర్గము పైన బూటకంపు
దాడి చేసి, లూటి యొనర్ప ధర్మమౌనె?

హర్ష కుమారుఁ డేమియు ననియె నయ్య?
యతని పైదాడి సేయంగ నగునె నీతి?
మీది తీవ్రవాదము కాక, మాది యౌనె?

సరియె పోనిండు! మొన్న శ్రీశైల భక్తు
లనఁగ, మా హనుమంత రావును ననంగ,
నట వసించునట్టి తెలగాణ జను లనఁగ
నెందు కడ్డితిరో చెప్పు! నీతి మాలి,
నిండు చూలును వైద్యమ్ము నీఁకఁ దఱిమి
కొట్టినట్టి మిమ్మేమందు రట్టి తఱిని?

మా తెలంగాణకును జెందు మహిళ పైన
పేడఁ గొట్టుట నేమండ్రు వెఱ్ఱి యనక?
యిట్లు దాడి చేసిన కత మేమొ చెపుడు!

నిరసనము కాదె? మేమును నిరసనమును
దెల్పినారము! మమ్మేలఁ దిట్టుదు రయ?

మే మిట వసించు సీమాంధ్రు నేమి యైన
నంటిమే? మేమె బాధల నంది, వేయి
యాత్మ బలిదానముల నిడి యడలితి మయ!

మేము తీవ్రవాదులమైన, మీర లెవరు?
మమ్ము తెలబాను లందురే? మమ్మనంగ,
మీరు తెలబాన్ధ్రులరు కారె? మిత హితులరె?

మీరు చేసిన శృంగారమే యదౌనె?
మేము చేసిన వ్యభిచారమే యిదౌనె?
నోరు మూయుఁడు! నవ్వియుఁ బోరె? మీర
లింక వగల మాటలు మానుఁ డిట్టి తఱిని!


జై తెలంగాణ!             జై జై తెలంగాణ!